కమలానికి బీపీ తెప్పిస్తున్న యూపీ!!

 కమలానికి బీపీ తెప్పిస్తున్న యూపీ!!

భూమిపుత్ర,జాతీయం:

నరేంద్రమోడీ,హోంమంత్రి అమిత్ షా పార్టీలో,అనుబంధ సంస్థల్లో అంతర్గత విభేదాలను సరిదిద్దడానికి,అసంతృప్తులను చల్లబరచడానికి ఆపసోపాలు పడుతున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.గడచిన కొంతకాలంగా ఈ ఇరువురి చర్యల ఫలితంగా పార్టీలో సీనియర్ నేతలు అసంతృప్తికి లోనవుతున్నారు.అదే సమయంలో మాతృసంస్థ అయిన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ లోనూ వారి పలుకుబడి దిగజారింది.దశాబ్దం పై నుంచి అధ్యక్ష స్థానంలో సర్ సంఘ్ చాలక్ గా వ్యవహరిస్తున్న మోహన్ భగవత్ సూటిగానే విమర్శలను ఎక్కుపెడుతున్నారు.ఇటీవల కరోనా విజృంభణలో ప్రభుత్వ బాధ్యత ఉందని కుండబద్దలు కొట్టినట్లు చెప్పేశారు.విపక్షాలు , వామపక్ష వాదులు భగవత్ మాటలనే ప్రాతిపదికగా చేసుకుంటూ తీవ్రస్థాయిలో కేంద్ర ప్రభుత్వంపై రాజకీయ సమరం సాగిస్తున్నారు.ఆయన మాటలను ఖండించలేక అలాగని చూస్తూ ఊరుకోలేక మోడీ,షా ద్వయం సతమతమవుతున్నారు.

ప్రభుత్వం చేసే ప్రతి తప్పునూ చూస్తూ ఊరుకోవాల్సిన అవసరం లేదని తన మాటల ద్వారా ఆర్.ఎస్.ఎస్ శ్రేణులకు భగవత్ సంకేతాలు పంపించారు.కేంద్రంలోని అగ్రనాయకులిద్దరికీ ఇవి ప్రమాద ఘంటికల కిందే లెక్క అందుకే సంఘ్ పరివార్ తో తమ సంబంధాలను మెరుగు పరుచుకోవడానికి నాయకులిద్దరూ కలిసి కట్టుగా రంగంలోకి దిగారు.ఆర్ఎస్ఎస్ అగ్రనాయకుడైన భగవత్ కొంతకాలంగా ప్రభుత్వ తీరుపై అసహనంగానే ఉన్నట్లు తెలుస్తోంది.ముఖ్యంగా బీజేపీలో వ్యక్తి ఆరాధన పతాక స్థాయికి చేరడం పట్ల ఆయన ఆవేదనతో ఉన్నట్లుగా చెబుతున్నారు.నాయకుడిగా ఎవరున్నా సైద్ధాంతిక అంశాల్లో రాజీపడకూడదనేది ఆర్ఎస్ ఎస్ మార్గదర్శకాల్లో కీలకమైనది.ప్రస్తుతం ప్రదాని నరేంద్రమోడీ పార్టీని మించిన ఇమేజ్ తో ఎదిగిపోయారు.ఆర్.ఎస్.ఎస్ ను సైతం కాదని బీజేపీకి ప్రత్యేక అజెండాను రూపకల్పన చేసే స్థాయికి చేరుకున్నారు.తాము పెంచి పోషించిన సంస్థ బీజేపీ.

దేశంలో కమలం పార్టీ రాజకీయాధికారానికి రావడానికి శక్తి వంచన లేకుండా ఆర్.ఎస్.ఎస్ కార్యకర్తలు కృషి చేశారు.మోడీ ఇమేజ్ బీజేపీ విజయానికి తోడ్పడిన మాట వాస్తవమే.కానీ పునాదులుగా నిలిచి ఆ సౌధాన్ని నిలిపింది మాత్రం ఆర్.ఎస్.ఎస్ అని బీజేపీ నాయకులు సైతం ఒప్పుకుంటారు.ప్రస్తుతం బీజేపీలో మోడీ,షా లకు ప్రత్యామ్నాయ నాయకత్వం ఇవ్వగలిగిన వారెవరూ లేరన్న వాతావరణం ఏర్పడింది.దీనిని ఆర్.ఎస్.ఎస్ జీర్ణించుకోలేక పోతోంది.సైద్ధాంతికంగా బీజేపీ పక్కదారి పడుతుందని , వ్యక్తి నియంతృత్వం ప్రమాదమని భావిస్తోంది.అందుకే భగవత్ నోటి నుంచి అసమ్మతి స్వరాలు వినవస్తున్నాయి.ఆర్.ఎస్.ఎస్ కు జనరల్ సెక్రటరీ హోదాలో సర్ కార్యవాహ్ గా కర్ణాటకకు చెందిన దత్తాత్రేయ హోసబలే రెండు నెలల క్రితమే బాధ్యతలు స్వీకరించారు.సంఘ్ చాలక్ తర్వాత అత్యంత ముఖ్య నాయకుడు. ఆయన,మోడీ,అమిత్ షాలు ఆయనతో నేరుగా సమావేశమయ్యారు.కొన్ని గంటల పాటు వివిధ అంశాలు చర్చించారు.

దేశంలో ప్రతిపక్షాలన్నీ ఏకమవుతున్నాయి.కరోనాను సాకుగా చేసుకుంటూ దాడిని ఉధ్రుతం చేశాయి.ప్రభుత్వం ఉక్కిరిబిక్కిరవుతోంది.నేరుగా ప్రధానినే టార్గెట్ చేస్తున్నాయి.ఇంతవరకూ ప్రతిపక్షాలకు దీటైన సమాధానం మోడీ చెప్పలేకపోయారు.కరోనా కట్టడిలో విఫల ప్రదానిగా,అసమర్థునిగా ఆయన పై ప్రతిపక్షాలు ముద్ర వేశాయి.గతంలో వివిధ అంశాల్లో ప్రతిపక్షాలు ప్రదానిపై దాడి చేస్తే సోషల్ మీడియాలో విపక్షాలను ప్రజలు ఏకి పారేసేవారు.కానీ విచిత్రంగా ఈసారి ప్రతిపక్షాల వాదనకే ప్రజల మద్దతు లభిస్తోంది.ఈ నేపథ్యంలో సొంత సంస్థ ఆర్ఎస్ ఎస్ కూడా తమను దూరంగా పెడితే ఏం జరుగుతుందో మోడీ , షా లకు తెలుసు.అందుకే దేశంలో రాజకీయ పరిస్థితులను,తాము చేస్తున్న కృషిని వివరిస్తూ సత్సంబంధాలను నెలకొల్పుకునేందుకు కార్యవాహ్ తో కథాకమామిషు మొదలు పెట్టారని ప్రచారం మొదలైంది.

బీజేపీ కి అత్యధిక సీట్లు కట్టబెట్టిన రాష్ట్రం ఉత్తరప్రదేశ్ , అక్కడ ఏమాత్రం తేడా వచ్చినా కేంద్రంలో అధికారం గల్లంతు కావడం ఖాయం.ఇటీవల రాజకీయంగా ఉత్తరప్రదేశ్ లో తీవ్రమైన మార్పులు కనిపిస్తున్నాయి.తాజాగా జరిగిన స్థానిక ఎన్నికల్లో కీలకమైన ప్రాంతాల్లో పార్టీ పట్టు కోల్పోయింది.ప్రధాని ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాశి ప్రాంతంలోనూ పరాజయం పాలయ్యింది.గత ఎన్నికల్లో ప్రధానికి ఇక్కడ 63 శాతంపైగా ఓట్లు లభించాయి.సమాజ్ వాదీ , కాంగ్రెసు పార్టీలు రెండూ కలిసి మూడు లక్షల పైచిలుకు ఓట్లు మాత్రమే తెచ్చుకుంటే ప్రదాని ఆరులక్షల డెబ్ళైవేల ఓట్లతో ఘన విజయం సాధించారు.అటువంటి ప్రాంతంలో పంచాయతీ ఎన్నికల్లో పతనం కావడం పరిస్థితులకు అద్దం పడుతోంది.రాష్ట్ర రాజధాని లక్నో ప్రాంతంలోనూ పార్టీకి పట్టు చిక్కలేదు.ముఖ్యమంత్రి సొంత ప్రాంతమైన గోరఖ్ పూర్ ప్రాంతంలోనూ ఘోరమైన అవమానమే మిగిలింది.మరోవైపు పశ్చిమ ఈ త్తరప్రదేశ్ లో వ్యవసాయ చట్టాల రద్దు కోరుతూ రైతులు ఆందోళనలు సాగిస్తున్నారు.ఇవన్నీ రాజకీయంగా ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో యూపీలో ఎన్నికలు జరగాల్సి ఉంది.అందువల్ల తక్షణం ఉత్తరప్రదేశ్ లో పరిస్థితులను చక్కదిద్దుకోవాలి.ఆర్ఎస్ఎస్ ప్రభావం అక్కడ చాలా ఎక్కువ.కలిసి కట్టుగా నడిచేట్లుగా బీజేపీ,ఆర్.ఎస్.ఎస్ నాయకత్వాలు నిర్ణయం తీసుకుంటేనే సత్ఫలితాలు లభించేందుకు అవకాశం ఉంటుందని మోడీ,షా లకు తెలుసు.అందుకే తమ రాజకీయ వ్యూహాల్లో భాగంగా ముందుగా ఆర్.ఎస్.ఎస్ ను ప్రసన్నం చేసుకునే ప్రయత్నాల్లో పడ్డారు.

Related News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *