ప్రత్యక్ష ప్రసారాల ప్రయోజనమెంత?

 ప్రత్యక్ష ప్రసారాల ప్రయోజనమెంత?

భూమిపుత్ర,జాతీయం:

సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ సుప్రీం కోర్టు విచారణలను ప్రత్యక్ష ప్రసారం చేసి న్యాయవ్యవస్థ పారదర్శకతను సమాజానికి చాటిచెప్పే ప్రక్రియ పరిశీలనలో ఉన్నదని వ్యాఖ్యానించడంతో న్యాయవర్గాలలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. పైకి చూస్తే ఇది ఆదర్శంగానే కనిపించవచ్చు. పారదర్శకంగా, ప్రజలందరూ న్యాయస్థానాల పనితీరును తెలుసుకుంటే తప్పేమిటని అనిపించవచ్చు. కానీ లోతుగా తరచి చూస్తే పర్యవసానాలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే న్యాయక్రియాశీలత్వం కారణంగా ప్రభుత్వాలు కొంత ఇబ్బందికరమైన పరిస్థితులను చవి చూస్తున్నాయి. అయితే విస్తృతమైన ప్రజాప్రయోజనాల కోణంలో న్యాయస్థానాల తీర్పును అందరూ స్వాగతిస్తున్నారు.

రాజ్యాంగంలో బాధ్యతలు, అధికారాల విషయంలో స్పష్టత ఉంది. చట్టసభలు, ప్రభుత్వం, న్యాయస్థానాలు ఏమేమి చేయాలనే అంశాలను వివరంగానే పొందుపరిచారు. అయితే రాజ్యాంగాన్ని పరిరక్షించే బాద్యతలను, దానికి భాష్యం చెప్పే అధికారాన్ని న్యాయస్థానాలకు అప్పగించారు.కొన్ని సందర్బాల్లో ప్రభుత్వం కంటే కూడా ఆధిక్యతను న్యాయస్థానాలు కనబరుస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఎదుటి వ్యవస్థ ప్రతిష్ఠకు భంగం కలిగించే రీతిలో న్యాయమూర్తులు వ్యాఖ్యానిస్తున్నారనే విమర్శలూ ఉన్నాయి.రాజ్యాంగ పరిరక్షణ బాధ్యతలో భాగంగా హైకోర్టు, సుప్రీం కోర్టు ఎప్పటికప్పుడు ప్రభుత్వా అనుచిత కార్యక్రమాలను నిలదీస్తుంటాయి. వివిధ కేసులు విచారణ ప్రత్యక్ష ప్రసారం పరిధిలోకి వస్తే ప్రజా ప్రభుత్వాల ప్రతి సందర్బంలోనూ బోనులోకి ఎక్కుతున్న భావన కలుగుతుంది. పైపెచ్చు విచారణ సందర్బంగా న్యాయమూర్తులు చేస్తున్న వ్యాఖ్యలు వారికి హీరోయిజం ఆపాదిస్తున్నాయి. అందువల్ల ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులపై సామాజిక మాధ్యమాల్లో విరుచుకుపడేందుకు న్యాయమూర్తుల వ్యాఖ్యలు సాకుగా కనిపిస్తాయి.

ఇది వ్యవస్థ పనితీరుకు ప్రతిబంధకంగా మారుతుంది. పైపెచ్చు విచారణ సందర్బంగా న్యాయమూర్తులు చేస్తున్న వ్యాఖ్యలు తీర్పును ప్రతిబింబించాలని లేదు. అందువల్ల తుది తీర్పుతో సంబంధం లేకుండా ముందస్తుగానే ప్రత్యర్థులపై దుష్ప్రచారానికి ప్రత్యక్ష ప్రసారాలు దోహదం చేస్తాయి. తీర్పు ఏం చెప్పారనే దానికంటే విచారణే పెద్ద చర్చకు దారి తీస్తుంది. ప్రజా జీవితంలోని వారికి ఇది నష్టం కలిగిస్తుంది. వ్యవస్థల మద్య సంఘర్షణకూ దారి తీయవచ్చు. అంతిమంగా తీర్పు ఏమి వచ్చిందనేది ముఖ్యం. విచారణలోని అంశాలను ఇష్టారీతిగా ప్రధాన స్రవంతి విూడియా, సోషల్‌ విూడియా అనువర్తింపచేసుకునే అవకాశం పెరుగుతుంది. ఇప్పటికే సోషల్‌ విూడియాను కట్టడి చేయలేని పరిస్తితి.రాజకీయ పార్టీలు న్యాయస్థానాలను ఆసరాగా చేసుకుంటూ పోరాటం చేయడం చాలా కాలంగా చూస్తున్నాం. ప్రభుత్వ, ప్రతిపక్షాలు పరస్పరం కేసులతో ఒకరినొకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ లలో ఈ పరిస్థితి మరింత తీవ్రంగా ఉంది.

ప్రజాజీవితంలో తేల్చుకోవాల్సిన అంశాలను సైతం న్యాయవివాదం గా మార్చి కాట్లాడుకోవడం తరచూ చూస్తున్నాం. ప్రత్యక్ష ప్రసారాలు మొదలైతే ఈ వేడి మరింతగా పెరుగుతుంది. తాము చేసిన ఆరోపణలు ప్రజల్లోకి వెళితే చాలనుకుంటాయి రాజకీయ పార్టీలు. అంతిమ తీర్పుపై వాటికి పెద్దగా ఆసక్తి ఉండదు. ఇటువంటి సందర్బాల్లో ప్రత్యర్థులను ఇబ్బంది పెట్టడమే లక్ష్యంగా కేసుల సంఖ్య మరింతగా పెరిగిపోతుంది. ఎలాగూ ప్రత్యక్ష ప్రసారం ఉంటుంది కాబట్టి ఆ మేరకు ప్రత్యర్థికి రాజకీయ నష్టం వాటిల్లితే సంతోషిస్తారు. ఈ తరహా కేసులు పెరిగితే కోర్టులు ప్రజా ప్రయోజనాలను విచారించలేవు. ప్రత్యక్ష ప్రసారం చాలా సున్నితమైన అంశం. తర్వాత న్యాయస్థానమే పున:సమీక్ష చేసుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది. దేశంలోని అన్ని వ్యవస్థలను తమకు అనుకూలంగా వాడుకోవాలని చూసే రాజకీయ పార్టీలు , నాయకులు పెరిగిపోయారు. వారి చేతిలో న్యాయస్థానాల ప్రత్యక్ష ప్రసారం దుర్వినియోగానికి గురవుతుంది.

ఉన్నత న్యాయస్థానాలలో జడ్జిలు చాలా వరకూ లో ప్రొఫైల్‌ లో ఉంటారు. తప్పనిసరి అయితే తప్ప బహిరంగ కార్యకలాపాల్లో పాల్గొనరు. రాజకీయ నాయకులతో చేతులు కలిపి వేడుకలలో కనిపించరు. తాము వ్యక్తిగత గోప్యతను కాపాడుకుంటూ , ఎవరికీ అతి చనువు ఇవ్వకుండా ఉండటానికే ప్రాధాన్యతనిస్తారు. ప్రజలకు న్యాయమూర్తుల పేర్లు తెలుస్తాయే తప్ప వారు ఎలా ఉంటారో తెలియదు. ప్రత్యక్ష ప్రసారాలు మొదలైతే వారి వ్యక్తిగత జీవితానికీ స్వేచ్చ లేకుండా పోతుంది. న్యాయమూర్తులను వారు విచారించే కేసులను బట్టి అభిమానించే వారు, ద్వేషించేవారుగా వర్గాలు ఏర్పడే అవకాశం ఉంది. ఇది అత్యంత ప్రమాదకరం. తాము ఇచ్చే తీర్పు ప్రభావం ఎలా ఉండబోతుందోనని ముందుగానే ఆలోచించుకోవాల్సిన వాతావరణం ఏర్పడుతుంది.

రాజ్యాంగానికి కట్టుబడి మాత్రమే తీర్పు ఇవ్వాలి. సమాజంలో ప్రజల కోణం, ప్రభుత్వ కోణం వంటివి న్యాయమూర్తుల దృష్టిలో ప్రధానమైనవి కాకూడదు. న్యాయమూర్తులు ప్రశాంతంగా ఎటువంటి ఒత్తిడికి లోనుకాకుండా విచారణలు నిర్వహించాలి. ఒక కేసుకు సంబంధించి సమాజంలో తీవ్రమైన చర్చ జరుగుతున్నప్పుడు, అందులోనూ అది ప్రత్యక్ష ప్రసారం అవుతుందంటే సహజంగానే ఒత్తిడి పెరిగిపోతుంది. న్యాయమూర్తులు వేరే గ్రహం నుంచి పుట్టుకురారు. వారికి కూడా సహజమైన బహీనతలు, మానవ సహజమైన కీర్తి కండూతి ఉండక తప్పవు. వీటన్నిటి ప్రభావంతో కేసులోని మెరిట్స్‌, డీ మెరిట్స్‌ కంటే అది ప్రజల్లోకి ఎలా వెళుతుందనే అంశానికి ప్రాముఖ్యం పెరిగిపోతుంది. అంతిమ ఫలితం తీర్పు. అది మాత్రమే ఆచరణలోకి వస్తుంది. దానిపైనే దృష్టి పెట్టాలి. పారదర్శకత పేరుతో విచారణ తీరు మొత్తం ప్రజలకు చెప్పాలనుకోవడం అనుచితం. అనవసర ఆదర్శం.

Related News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *