మరో విద్యా సంవత్సరం కరోనార్పణమేనా!!

 మరో విద్యా సంవత్సరం కరోనార్పణమేనా!!

భూమిపుత్ర,బ్యూరో:

వరుసగా రెండోయేడు కూడా విద్యా సంవత్సరం దెబ్బతింది ఈ యేడు విద్యా సంవత్సరం ప్రారంభం అవుతుందా లేదా అన్న ఆందోళనలో తల్లిదండ్రులు ఉన్నారు. ఇప్పటికే విద్యా సంవత్సం ప్రారంభం కావాల్సి ఉన్నా..కరోనా సెకండ్‌వేవ్‌తో ఇప్పటివరకు స్పష్టత లేదు. మహమ్మారి ఇంకా తుడిచిపెట్టుకుని పోలేదు. పరిస్థితులన్నీ బాగుండి వుంటే నేటికి నూతన విద్యా సంవత్సరం 2021-22 ప్రారంభమై వుండేది. కానీ కరోనా మహమ్మారి కారణంగా నూతన విద్యాసంవత్సరం నేటికీ ప్రారంభం కాలేదు. జూన్‌ 30వ తేదీ వరకూ వేసవి సెలవులను పొడిగించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదేశించింది. తెలంగాణలో 20 వరకు వేసవి సెలవులు పొడిగించారు. జూలై 1 నుంచి నూతన విద్యా సంవత్సరం ప్రారంభించాలన్న ఆలోచనలో ఏపి ప్రభుత్వం ఉంది. పిల్లలు కూడా ఇళ్లకే పరిమితం కావడం వల్ల అయోమయంలో ఉన్నారు.

ఆలస్యంగా అయినా పాఠశాలలు, కళాశాలలు ప్రారంభం కావాలని పిల్లలతో పాటు తల్లిదండ్రులు కూడా కోరుకుంటున్నారు. కఠినమైన కరోనా నిబంధనలతో విద్యాసంస్థలను ప్రారంబించాలని కోరుకుంటున్నారు. ఇకపోతే ఆన్‌లైన్‌ క్లాసులతో సరిపెడుతున్న విద్యాసంస్థలు పూర్తిస్థాయిలో ఫీజులను వసూలు చేస్తున్నాయి. తగ్గేది లేదని తెగేసి చెబుతున్నాయి. దీంతో ఆర్థికంగా చితికిన అనేకమంది ఇప్పుడు ఫీజలు కట్టేందుకు నానాతంటాలు పడుతున్నారు. పాలకులు ప్రైవేట్‌ విద్యాసంస్థల దోపిడీని అరికట్టడంలో ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. కనీసం నోటీసులు కూడా ఇవ్వడం లేదు. కష్టకాలంలో సైతం లక్షల్లో ఫీజులు వసూలు చేస్తూ టీచర్లకు మాత్రం పంగనామాలు పెడుతున్నారు. ఇకపోతో ఇంటిపట్టునే ఉంటున్న పిల్లలను సముదాయించడం పెద్దల తరం కావడం లేదు. ఆన్‌లైన్‌ క్లాసుల వల్ల మానసిక ఎదుగుదల అన్నది లేకుండా పోయింది.

మరోవైపు కరోనాతో దెబ్బతిన్న విద్యారంగం విషయంలో జాతీయస్థాయి విధానాలు అవలం బించేలా చేయడంలో కేంద్రం విఫలం అయ్యింది. పరీక్షల నిర్వహణ అన్నది ఎవరికి వారుగా ఆయా రాష్ట్రాలు తమకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటున్నాయి. తెలంగాణలో పది, ఇంటర్‌ పరీక్షలను రద్దుచేసి ఫలితాలను ప్రకటించారు.ఏపీలో పరీక్షలపై సంధిగ్ధస్థితి అలానే నెలకొనియుంది. పబ్లిక్‌ పరీక్షలను తప్పనిసరిగా నిర్వహిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. దీంతో విద్యార్థులు, తల్లిదండ్రుల్లో అమోమయం నెలకొంది. పది, ఇంటర్‌ విద్యార్థులకు మాత్రం పరీక్షలు తప్పనిసరిగా జరిపి తీరుతామని ప్రభుత్వం ప్రకటిం చింది. కానీ ఆ పరీక్షలు ఎప్పుడు నిర్వహిస్తారనేది మాత్రం ఇప్పటికీ స్పష్టంగా చెప్పలేకపోతోంది. పరీక్షల తేదీలను తరచూ మార్చుకుంటూ పోతోంది. పరీక్షల అంశం కోర్టుకు చేరడంతో పదోతరగతి పరీక్షలనూ వాయిదా వేసింది. వాటి నిర్వహణపై జూలైలో సమీక్ష జరిపి నిర్ణయం తీసుకుంటామని న్యాయస్థానానికి తెలిపింది.

దీనినిబట్టి జూలై వరకు పరీక్షలు జరిగే అవకాశం లేదనేది స్పష్టమవుతోంది. ఇదే ఇప్పుడు విద్యార్థులకు సమస్యగా మారింది. పరీక్షలకు చదవాలో లేక కొత్త తరగతులకు సిద్ధపడాలో తెలియక అయోమయానికి గురవుతున్నారు. కరోనా సెకండ్‌ వేవ్‌ కాలంలో దేశంతో పాటు తెలుగు రాష్ట్రాల్లోనూ వందలాదిమంది ఉపాధ్యాయులు మృత్యువాత పడ్డారు. ఏప్రిల్‌ 30వ తేదీ వరకూ పాఠశాలకు హాజరు కావడం, పరిషత్‌ ఎన్నికలు, అసెంబ్లీ, ఎంపి ఉప ఎన్నికలు, మున్సిపల్‌ ఎన్నికల విధుల్లో పాల్గొనడంతో అనేకమంది కరోనా బారిన పడి మృత్యువాత పడడ్డారు. ఇక విద్యార్థులకు సైతం కరోనా సోకింది. పైగా ఇప్పుడు థర్డ్‌ వేవ్‌ ముప్పు వారిని మరింత కలవర పెడుతోంది. ఈ నేపథ్యంలో పిల్లలను మహమ్మారి నుంచి ఎలా కాపాడుకోవాలా అని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.ఏపీ లో రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల భవితను దృష్టిలో పెట్టుకుని కఠినమైన నిబంధనలతో నైనా గతంలో వాయిదా వేసిన పరీక్షలను నిర్వహించాలని చూస్తోంది. దేశంలో ఇప్పటికీ మెజారిటీ రాష్ట్రాలు పదవ తరగతి, 12 బోర్డు పరీక్షలు రద్దు చేశాయి.

గుజరాత్‌, మధ్యప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, ఉత్తరప్రదేశ్‌, రాజస్థాన్‌, హర్యానా, గోవా, కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ, ఒడిషా, పశ్చిమ బెంగాల్‌, జార్ఖండ్‌ తదితర రాష్ట్రాల్లో పరీక్షలు రద్దు చేశారు. కరోనా కారణంగా 2020-21 విద్యాసంవత్సరం ఆలస్యం గా ప్రారంభమైంది. సకాలంలో నిర్ణయం తీసుకోకుండా ఇప్పుడు కూడా పరీక్షలు వాయిదా వేస్తూ పోతే 2021-22 విద్యా సంవత్సరం కూడా ఆలస్యం అవుతుంది. క్లాసులు మొదలై, సిలబస్‌ సగంలో వుండ గానే పరీక్షలు ముందుకొస్తాయి. ఒకవైపు పరీక్షల ఒత్తిడి, మరోవైపు పూర్తికాని సిలబస్‌ కారణంగా ఏపీ లో టెన్త్‌ విద్యార్థులు నలిగిపోతున్నారు. ఇక ఇంటర్‌ పరీక్షలను ఆంద్రప్రదేశ్‌ రాష్ట్రంలో వాయిదాలు వేస్తున్నారు. అయితే, జాతీయ స్థాయిలో సిబిఎస్‌ఇ ఇప్పటికే 12వ తరగతి పరీక్షలను రద్దు చేసింది. దీంతో సిబిఎస్‌ఇ విద్యార్థులు ప్రస్తుతం జెఇఇ, నీట్‌పై తమ దృష్టినంతా పూర్తిగా కేంద్రీకరించి సిద్ధం అవుతున్నారు.

ఏపీ లో మాత్రం పరీక్షలపై ఇంకా స్పష్టతే రాలేదు. దేశవ్యాప్తంగా ఒకే విధానం ఉండివుంటే విద్యార్థులకు గందర గోళం తప్పేది. ఒక్కో రాష్ట్రం ఒక్కో విధంగా ముందుకు పోవడం అన్నది మరింత గందరగోళానికి దారి తీస్తోంది. ఈ దశలో దేశంలో అందరికీ ఒకే రకమైన విద్య అందజేయాలి. ప్రైవేట్‌, కార్పొరేట్‌ విద్యావ్యవస్థ ను నియంత్రించ కుంటే పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడం అసాధ్యం కాగలదని ఇప్పటికే తేలిపోయింది. పాలకవర్గాలు ప్రసార మాధ్యమాలను గుప్పిట్లో ఉంచుకుని తమ అభిప్రాయాలను, నిర్ణయా లను ప్రజలపై బలవంతంగా రుద్దే ప్రయత్నం చేయడం సరికాదు. పేద, ధనిక తేడా లేకుండ అందరికీ సమాన విద్య కోసం కలసి నిర్ణయాలు తీసుకోవాలి. విద్యకు కనీసం 20 శాతం నిధులు కూడా కేటాయిం చాల్సి ఉంది. అలాగే తక్షణ కర్తవ్యంగా ఈ యేడు విద్యాసంవత్సరంపైనా చర్చించి ముందుకు సాగాలి. అప్పుడే తల్లిదండ్రులు, విద్యార్థుల్లో గందరగోళం తొలగిపోగలదు.

Related News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *