నందీశ్వరుడికి విశేష పూజలు

 నందీశ్వరుడికి విశేష పూజలు

భూమిపుత్ర, శ్రీశైలం:

త్రయోదశిని పురస్కరించుకుని లోక కల్యాణం కోసం ఆలయ ప్రాంగణంలోని నందీశ్వరస్వామికి ( శనగల బసవన్న స్వామివారికి ) విశేషార్చనలు నిర్వహించారు . ప్రతి మంగళవారం మరియు త్రయోదశి రోజున దేవస్థాన సేవగా ( సర్కారీ సేవగా ) ఈ కైంకర్యం జరిపించబడుతోంది . ప్రదోషకాలంలో అనగా సాయంసంధ్యాసమయంలో ఈ విశేషపూజలు నిర్వహించడం జరుగుతోంది . ఈ విశేషార్చనలో ముందుగా లోకక్షేమాన్ని కాంక్షిస్తూ దేశం శాంతిసౌభాగ్యాలతో విలసిల్లాలని , ప్రకృతి వైపరీత్యాలు సంభవించకుండా సకాలంలో తగినంత వర్షాలు కురిసి , పంటలు బాగా పండాలని , పాడి సమృద్ధిగా ఉండాలని , జనులకు ఆయురారోగ్యాలు కలిగి, వారికి అకాలమరణాలు రాకుండా ఉండాలని , దేశంలో అగ్నిప్రమాదాలు , వాహన ప్రమాదాలు మొదలైనవి జరగకుండా ఉండాలని , అన్ని సామాజికవర్గాల ప్రజలు సుఖశాంతులతో ఉండాలంటూ అర్చకులు , వేదపండితులు సంకల్పాన్ని పఠించారు .

అనంతరం కార్యక్రమం నిర్విఘ్నంగా జరిగేందుకు మహాగణపతిపూజను నిర్వహించారు. ఆ తరువాత నందీశ్వరస్వామికి శాస్త్రోక్తంగా పంచామృతాలతోనూ , ద్రాక్ష , బత్తాయి , అరటి మొదలైన ఫలోదకాలతో హరిద్రోదకం , కుంకుమోదకం , గంధోదకం , భస్మోదకం , రుద్రాక్షాదకం , బిల్వోదకం , పుష్పోదకం , సువర్ణోదకం మరియు మల్లికాగుండంలోని శుద్ధజలంతో అభిషేకం నిర్వహించబడింది . తరువాత నందీశ్వరస్వామికి అన్నాభిషేకం చేశారు . పురుషసూక్తం , వృషభసూక్తం మొదలైన వేదమంత్రాలతో శాస్తోక్తంగా ఈ విశేషాభిషేకాన్ని నిర్వహింపచేశారు . తరువాత నందీశ్వరస్వామివారికి నూతనవస్త్ర సమర్పణ , విశేష పుష్పార్చనలు కావించారు . అనంతరం నానబెట్టిన శనగలు నందీశ్వరస్వామికి సమర్పించబడ్డాయి . చివరగా స్వామికి నివేదన అర్పించబడింది . అర్చకులు కోవిడ్ నిబంధనలతో భౌతికదూరాన్ని పాటిస్తూ నందీశ్వరస్వామికి ఈ విశేషార్చనలు నిర్వహించారు .

Related News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *