నిర్లక్ష్యం ఖరీదు వేల నిండు ప్రాణాలు

 నిర్లక్ష్యం ఖరీదు వేల నిండు ప్రాణాలు

వీడని విషాదపు ఛాయలు

భూమిపుత్ర,సంపాదకీయం:

దేశంలో అత్యంత విషాద ఘటనగా, అతి పెద్ద పారిశ్రామిక విపత్తుగా భోపాల్‌ గ్యాస్‌ దుర్ఘటన నిలిచింది. మధ్యప్రదేశ్‌ లోని భోపాల్‌లో యూనియన్‌ కార్బైడ్‌ ఇండియా లిమిటెడ్‌ (యుసిఐఎల్‌) పురుగు మందుల ప్లాంట్‌లో గ్యాస్‌ దుర్ఘటన జరిగి 37 ఏళ్ళు. సుమారు 8000 మందికి పైగా మృతి చెందగా 5 లక్షలకు పైగా జనాభా దీని ప్రభావానికి లోనయ్యారని ఒక అంచనా! భోపాల్‌ దుర్ఘటనకు యూనియన్‌ కార్బైడ్‌ యాజమాన్య నిర్లక్ష్యం, భద్రతా లోపాలే కారణమని అనేక నివేదికలు తేటతెల్లం చేశాయి. భోపాల్‌ లో గల యూనియన్‌ కార్బైడ్‌ ఇండియా లిమిటెడ్‌ (యుసిఐఎల్‌) పురుగుమందుల ప్లాంట్లో 1984 రాత్రి పూట జరిగింది. 500,000 మందికిపైగా ప్రజలు మిథైల్‌ ఐసోసైనేడ్‌ వాయువు, ఇతర రసాయనాల ప్రభావానికి గురయ్యారు. భోపాల్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలో 56 వార్డులు ఉంటే 36 వార్డుల్లో విషవాయువు ప్రభావం చూపింది.మృతుల సంఖ్యపై వివిధ నివేదికలు ఇచ్చిన అంచనాలు వేర్వేరుగా ఉన్నాయి. మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం విడుదల చేసిన అధికారిక లెక్కల ప్రకారం మృతుల సంఖ్య 3,787 మంది, అందులో 2,259 మంది తక్షణమరణానికి గురైనట్టుగా నిర్ధారించింది.

2006 సంవత్సరంలో ఒక ప్రభుత్వ అఫిడవిట్లో గ్యాస్‌ లీకేజి వలన 5, 58,125 మంది ప్రభావితమైనట్టు పేర్కొంది. ఇందులో 38,478 తాత్కాలిక ప్రభావానికి, 3,900 శాశ్వత ప్రభావానికి గురయ్యారని తెలిపింది. అంతేగాక, ప్రమాదం జరిగిన రెండు వారాలలోపులోనే 8,000 మంది మరణించారని, గ్యాస్‌ సంబంధిత వ్యాధుల కారణంగా జీవితాలతో పోరాడలేక మరో 8,000 పైగా వ్యక్తులు మరణించారని ఒక అంచనా.దేశంలో ఈ ఘటన అనంతరం జరిగిన వాటిలో 2020 మే 7న విశాఖపట్నం లోని ఎల్‌.జి పాలిమర్స్‌ గ్యాస్‌ లీక్‌ కూడా భోపాల్‌ ఘటనను తలపించింది. విశాఖ దుర్ఘటనలో 11 మంది మృతి చెందగా, దాదాపు వెయ్యి మందికి పైగా విష వాయువుల ప్రభావానికి లోనయ్యారు. సరళీకరణ విధానాల మూలంగా విదేశాల్లో నిషేధించిన అనేక విషపూరిత రసాయన, ఫార్మా కంపెనీలు మన దేశానికి రావడంతో ఏదో మూల భోపాల్‌ లేదా విశాఖ ఎల్‌.జి గ్యాస్‌ లీక్‌ లాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ప్రజల ప్రాణాలు పోతూనే ఉన్నాయి. ఇటీవల నవంబర్‌ 28న రాత్రి విశాఖపట్నం ఫార్మా సిటీలో విష వాయువులు విడుదల కావడంతో ముక్కుపచ్చలారని ఇద్దరు యువ కార్మికులు మృత్యువాతపడ్డారు.భోపాల్‌ దుర్ఘటన నుండి ప్రభుత్వాలు ఏ గుణపాఠాలు నేర్చుకోలేదనే చెప్పాలి.

భోపాల్‌ గ్యాస్‌ దుర్ఘటనకు కారణమైన వారెన్‌ ఆండర్సన్‌ను శిక్షించడంలోను, బాధితులకు నష్టపరిహారం అందించడంలోను ప్రభుత్వాలు అనుసరించిన తీరు అంత్యంత దుర్మార్గంగా ఉంది. నేటికీ భోపాల్‌ దుర్ఘటన బాధితులు జీవచ్ఛవాలుగానే బతుకుతున్నారు. అభివృద్ధి పేరుతో లాభాలే పరమావధిగా నడుస్తున్న పరిశ్రమల వల్ల పర్యావరణానికి, ప్రజలకు నష్టమని తెలిసి కూడా అటువంటి పరిశ్రమలకు అనుమతులు ఇస్తున్నారు. కనీస ప్రమాణాలు పాటించకుండా ఇష్టానుసారం నడుపుతున్నా పట్టించుకునేవారే లేరు! పరిశ్రమల్లో ప్రమాణాలు కాపాడాల్సిన కాలుష్య నియంత్రణా బోర్డు, ఫ్యాక్టరీ ఇన్‌స్పెక్టర్‌, ఫైర్‌ డిపార్డుమెంట్లు,ప్రభుత్వాలు చెప్పినట్లు, యాజమాన్యాలకు అనుకూలంగా అనుసరిస్తోన్న ఘటనలు అనేకం ఉన్నాయి.దీనివల్ల భవిష్యత్‌లో మరిన్ని భోపాల్‌, ఎల్‌.జి. ఘటనలు పునరావృతం కాక తప్పదనిపిస్తోంది. పర్యావరణ అసమతుల్యత కారణంగా ప్రకృతి విపత్తులు తలెత్తడం, వాతావరణ సమతుల్యత సరిగా లేకపోవడం వలన అనేక ప్రాంతాలు నష్టపోవడం చూస్తూనే ఉన్నాం. విశాఖపట్నం సవిూపంలోని పరవాడ వద్ద ‘రాంకీ’ డెవలపర్‌గా జవహర్‌లాల్‌ నెహ్రూ ఫార్మా సిటీని 2005లో నెలకొల్పారు.

హైదరాబాద్‌ పఠాన్‌ చెరువులోని అనేక ఫార్మా కంపెనీలు, మరిన్ని దేశీయ విదేశీ ఫార్మా కంపెనీలు ఇక్కడికి చేరాయి. ప్రస్తుతం 85 ఫార్మా కంపెనీలు 2500 ఎకరాల విస్తీర్ణంలో ఫార్మా ఉత్పత్తులు చేస్తున్నాయి. ప్రతి ఏడాది నాలుగైదు కంపెనీల్లో ప్రమాదాలు జరగడం అనేక మంది మృత్యువాత పడడం, మరి కొంతమంది క్షతగాత్రులు కావడం జరుగుతోంది.గత ఐదేళ్లలో జరిగిన ప్రమాదాల్లో 32 మంది వరకు మరణించారు. 80 మందికి పైగా క్షతగాత్రులయ్యారు. ప్రమాదాలు జరిగినప్పుడు ప్రభుత్వం, అధికారులు హడావుడి చేయడం, మృతులకు ఎంతో కొంత నష్టపరిహారం చెల్లించి చేతులు దులుపుకోవడం తప్ప ఘటనపై సమగ్ర విచారణ జరపడం, వాటిపై క్రిమినల్‌ చర్యలు తీసుకోవడం, బాధ్యులను శిక్షించడం వంటివేవీ ఈ కాలంలో జరగలేదనే చెప్పాలి. కార్పొరేట్ల చేతుల్లో ప్రభుత్వాలు సైతం వారికి అనుగుణంగా నిబంధనలు సడలించడం వారికి పెద్ద పీట వేయడంతో ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వాలు మేల్కొకపోతే భవిష్యత్‌లో భారీ నష్టం తప్పదు. ఇప్పటికే సరళీకరణ పేరుతో ఎంత సరళం చేసుకుంటున్నామో అన్ని కష్టాలను కొని తెచ్చుకుంటున్నాం. ఇది ఇలాగే కొనసాగితే ఇలాంటి సంఘటనలు పునారావృతం అవుతునే ఉంటాయి అలా కాకుండా ప్రభుత్వాలు కఠినంగా వ్యవహరించినప్పుడు మాత్రమే వాటిని ఆపగలుగుతాం.

Related News

Leave a Reply

Your email address will not be published.