సకల ధర్మసారం రామాయణం

 సకల ధర్మసారం రామాయణం

శ్రీరామచంద్ర మూర్తి

అందుకే వేల ఏండ్లుగా చెక్కుచెదరని విశ్వాసం

నేడు శ్రీరామ నవమి పర్వదినం

భూమిపుత్ర ,ఆధ్యాత్మికం:
రామాయణ ప్రారంభంలో వాల్మీకి మహర్షి దగ్గరకు నారద మహర్షి వచ్చినప్పుడు వాల్మీకి నారదుడి ముందు తన మనస్సులోని సందేహాలను ఉంచాడు. సకల సద్గుణ సంపన్నుడు అయిన వారు ఎవరున్నారని ప్రశ్నించారట. అందుకు రాముడి గురించి చెప్పడంతో వాల్మీకి దానిని కావ్యంగా మలిచారు. ఎటువంటి విపత్కర పరిస్థితులలోనూ తొణకనివాడు, లౌకిక అలౌకిక ధర్మాలను బాగా తెలిసినవాడు, శరణాగతవత్సలుడు, ఎలాంటి క్లిష్టపరిస్థితులోనూ ఆడి తప్పనివాడు, నిశ్చలమైన సంకల్పం కలవాడు, సదాచారసంపన్నుడు, సక ప్రాణులకు హితాన్ని కలిగించేవాడు, సకల శాస్త్ర సంపన్నుడు, సర్వ కార్య దురంధరుడు, తన దర్శనంతో అందరినీ సంతోషింపచేసేవాడు, దైర్యశాలి, అరిషడ్వర్గాలను జయించినవాడు, చక్కని రూపలావణ్యాలతో శోభిల్లేవాడు, ఎవరిపైనా అసూయ లేనివాడు, రణరంగంలో కోపిస్తే దేవాసురులను సైతం భయకంపితులను చేసేవాడు అయిన మహాపురుషుడు ఎవరైనా ఉన్నారా అని వాల్మీకి తన మనసులోని సందేహాన్ని నారదుడి ముందుంచాడు. అప్పుడు ఆ నారదుడు అలాంటి ఉత్తమ గుణాలన్నీ ఒక్కరిలోనే ఉండటం చాలా కష్టం. అయినా అలాంటి విశిష్ట గుణాలన్నీ ఉన్న ఉత్తమ పురుషుడొకడు ఉన్నాడు. ఆయనే శ్రీరామచంద్రుడు అని నారదుడు వివరించాడు. ఈ నారద వాల్మీకి సంభాషణలో శ్రీరామచంద్రుడు ఎంతటి ధర్మాత్ముడో, సద్గుణ సంపన్నుడో అవగతమవుతుంది. అలాంటి సద్గుణాల నిధిలాంటి రామచరితాన్ని చదివినవారికి, తెలుసుకొన్నవారికి ఆ గుణాలు అబ్బుతాయన్న ఆలోచనలతోనే సకల ధర్మశాస్త్రనిధి అయిన రామాయణాన్ని, ధర్మాన్నీ మూర్తీభవించిన శ్రీరామచంద్రుడిని గురించి తెలుసుకోమంటున్నారు మన పెద్దలు. రామాయణ మహాకావ్యంలో రామకథ, సీతాచరిత్రం, రావణ వథ వర్ణితమైనట్లు పైపైకి కనిపిస్తుంది కానీ లోతుగా పరిశీలిస్తే మానవాళికి పనికివచ్చే ఎన్నెన్నో జీవన మార్గదర్శక సూత్రాలు కనిపిస్తాయి. రామాయణంలోని రాముడు,సీతాదేవి లోకాలకు ఆదర్శలే కాదూ ఆరాధ్య దేవతలు కూడా. రామాయణంలో రాముడి ప్రతి కదలికలోనూ ధర్మం, మిత్రధర్మం, భాతృధర్మం, భర్తృధర్మం, శిష్యధర్మం, శత్రుధర్మం ఇలాంటి ధర్మాలన్నీ కనిపిస్తాయి. అందుకే రామాయణాన్ని ధర్మశాస్త్రనిధి అని అంటారు. మానవ జీవితంలో ధర్మార్థకామాలనే మూడు పురుషార్థాలను సాధించటం అవసరం. అయితే ఈ మూడిటికీ ధర్మమే మూలం. ధర్మబద్ధం కాని అర్థం, కామం అనే పురుషార్థాలు రెండూ అనర్థహేతువువుతాయి. ధర్మానికి విరుద్ధంగా స్వార్థంతో రాజ్యరూపంలో అర్థాన్ని కట్టబెట్టాలని చూసిన కైక లోకనిందుకు గురైంది. అలాగే ధర్మాన్ని విడిచిపెట్టి కామంతో కళ్లు మూసుకుపోయిన రావణుడు అపకీర్తి పాలయ్యాడు. ధర్మబద్ధుడై రాజ్యాన్నే తృణప్రాయంగా విడిచిపెట్టిన శ్రీరాముడు లోకానికంతటికీ ఆరాధ్యుడయ్యాడు. అంతేకాక ధర్మాన్ని రక్షించినవాడిని ధర్మమే రక్షిస్తుందన్న సూక్తిని రుజువు చేశాడు. శ్రీరామచంద్రుడిలో ఇంకా ఎన్నెన్నో ధర్మాలు ఇమిడి ఉన్నాయి.

Related News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *