రామప్ప ఆలయానికి ప్రపంచ గుర్తింపు

 రామప్ప ఆలయానికి  ప్రపంచ గుర్తింపు

భూమిపుత్ర,వరంగల్‌:

రామప్ప ఆలయాన్ని ప్రపంచ వారసత్వ స్థలంగా యునెస్కో గుర్తించింది. వరంగల్‌ రామప్ప ఆలయానికి అంతర్జాతీయ స్థాయి గుర్తింపు ఇస్తున్నట్లు వెల్లడించింది. ఇంజనీరింగ్‌, శిల్పకళకు నెలవైన రామప్ప ఆలయం ఇక భారత కట్టడం ఎంత మాత్రం కాదని ప్రపంచ స్థాయి కట్టడమంటూ సంతోషం వ్యక్తం చేశారు కేంద్ర ఆర్కియాలజీ డిపార్ట్‌మెంట్‌ డిప్యూటీ డైరెక్టర్‌ జాన్‌విజ్‌. చైనాలో జరిగిన యూనెస్కో సమావేశం రామప్పకు ప్రపంచ వారసత్వ కట్టడ హోదాను కట్టబెట్టింది. ఈ విషయాన్ని కేంద్ర ఆర్కియాలజీ డిపార్ట్‌మెంట్‌ డిప్యూటీ డైరెక్టర్‌ జాన్‌విజ్‌ అధికారికంగా ప్రకటించారు. 2020 ఏడాదికి గాను రామప్పకు ఈ హోదా దక్కింది. 2021 ఏడాది నామినీగా గుజరాత్‌కి చెందిన ధోలవీర ఆలయం వరల్డ్‌ హెరిటేజ్‌ సైట్‌ బరిలో ఉంది.

రామప్పకు వారసత్వ సంపద హోదా రాకుండా నార్వే అడ్డుకునే యత్నం చేయగా, భారత్‌ తరఫున రష్యా వాదించింది. 17 దేశాలు ఆమోదం తెలపడంతో రామప్ప దేవాలయానికి అంతర్జాతీయ స్థాయి గుర్తింపు లభించింది. కాకతీయుల కాలంలో 13వ శతాబ్దంలో రామప్ప ఆలయం నిర్మితమైంది. ఇప్పటివరకు ప్రపంచ వారసత్వ జాబితాలో 167 దేశాల నుంచి 1,121 కట్టడాలు ఉన్నాయి. వరల్డ్‌ హెరిటేజ్‌ సైట్‌ గుర్తింపు కోసం మొత్తం మూడు చారిత్రక కట్టడాలు పోటీ పడగా అందులో సాంకేతిక కారణాల వల్ల ఖిలావరంగల్‌, వేయిస్థంభాలగుడిలు తుది జాబితాలో చోటు దక్కించుకోలేకపోయాయి. ములుగు జిల్లా వెంకటాపురం మండలం పాలంపేటలో ఉన్న రామప్ప ఆలయం ఒక్కటే ఎన్నికైంది. ఆ తర్వాత వరల్డ్‌ హెరిటైజ్‌ సైట్స్‌ టెంటెటీవ్‌ జాబితా 2014లో చోటు దక్కించుకుంది. అనంతరం వరల్డ్‌ హెరిటైజ్‌ సైట్స్‌ గుర్తింపుకి ఇండియా తరఫున 2020గాను రామప్ప ఎంపికైంది.

అయితే ఈ ఏడాది కరోనా కారణంగా యూనెస్కో కమిటీ సమావేశం నిర్వహించలేదు. కాకతీయ చక్రవర్తి గణపతిదేవుడి సేనాధిపతి అయిన రేచర్ల రుద్రుడు శివుని విూద ఉన్న ఆపారమైన భక్తితో 1213లో రామప్ప ఆలయాన్ని నిర్మించాడు. ఈ ఆలయాన్ని నిర్మించేందుకు 40 ఏళ్ల సమయం పట్టింది. ఈ ఆలయ నిర్మాణ బాధ్యతలు రామప్ప అనే శిల్పి చేపట్టాడు. ఇప్పుడు ఈ ఆలయం ఆయన పేరునే ప్రాచుర్యంలోకి వచ్చింది. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో నల్లరేగడి నేలలు ఎక్కువ. ఎక్కువ బరువు ఉండే రాతి నిర్మాణాలను ఈ నేలలు తట్టుకోలేవు. అందుకే నేల స్వభావాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక ఇంజనీరింగ్‌ నైపుణ్యం ప్రదర్శించారు. దీన్ని నేటి ఇంజనీర్లు శాండ్‌ బాక్స్‌ టెక్నాలజీగా పేర్కొంటున్నారు. ఆలయం నిర్మాణ స్థలంలో మూడు విూటర్ల లోతు పునాది తవ్వి అందులో పూర్తిగా ఇసుకను నింపారు. ఈ ఇసుక ఎప్పుడు తడిగా ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు.ఆ తర్వాత ఇసుకపై రాళ్లను పేర్చుకుంటూ పోయి కక్ష్యా మంటపం వరకు నిర్మించారు. అక్కడి నుంచి ఆలయ నిర్మాణం చేపట్టారు. నేల స్వభావాన్ని బట్టి ఆలయం బరువును తగ్గించేందుకు అత్యంత తేలికైన ఇటుకలను తయారు చేశారు.

సాధారణ నిర్మాణంలో వినియోగించే ఇటుకలు 2.2 సాంద్రతను కలిగి ఉంటాయి. కానీ రామప్ప ఆలయ గోపురానికి వాడిన ఇటుకలు కేవలం 0.8 సాంద్రతను కలిగి ఉంటాయి. అందుకే ఇవి తక్కువ బరువు కలిగి ఉండి నీటిలో తేలియాడుతాయి. ఇలాంటి ఇటుకలతో దేశంలో మరెక్కడా నిర్మాణాలు లేవని చరిత్రకారులు చెబుతున్నారు. ఆలయం నలువైపులా ఉన్న మదనికల శిల్పాలు చూపరులను ఇట్టే ఆకట్టుకుంటాయి. బ్లాక్‌ గ్రానైట్‌ రాయిపై చెక్కిన మదనికల సొగసు వర్ణనాతీతం. ఇక ఆలయం నలువైపులా ఆనాటి కాలమాన పరిస్థితులకు తగ్గట్టుగా ఈజిఫ్టు, మంగోలియన యాత్రికుల శిల్పాలు అబ్బరు పరుస్తాయి. ఇక ఆలయం లోపల నాట్యమంటపం ఆనాటి శిల్ప కళా వైభవానికి తార్కాణంలా నిలిచిపోతుంది.సూది బెజ్జం సందుతో అతి సూక్ష్మమైన శిల్పాలు ఇక్కడ కొలువుదీరి ఉన్నాయి. అంతేకాదు ఆలయం బరువును మోస్తున్నట్టుగా వందలాది ఏనుగుల శిల్పాలను చెక్కారు. అయితే ఒక ఏనుగుతో మరో ఏనుగుకు సంబంధం లేకుండా విభిన్నంగా ఉంటాయి. ఇక శివుడి ఎదురుగా ఉన్న నంది గురించి వర్ణించడానికి మాటలు చాలవు. శివుడి ఆజ్ఞ కోసం ఎదురు చూస్తున్నట్టుగా చెవిని లింగం వైపుకు పెట్టి.. లేవడానికి తయారుగా ఉన్నట్టుగా నందిని మలిచాడు శిల్పి రామప్ప.

Related News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *