ప్రజల ప్రాణాలతో పరిహాసమాడుతున్న ప్రభుత్వాలు

 ప్రజల ప్రాణాలతో పరిహాసమాడుతున్న ప్రభుత్వాలు

భూమిపుత్ర,సంపాదకీయం:

ఒకేదేశం..ఒకే ప్రజలు..ఒకే చట్టం..ఒకే పన్నుల విధానం అంటూ జిఎస్టీ సందర్భంగా ప్రకటించిన ప్రధాని మోడీ మాటలు వినడానికి సొంపుగానే ఉన్నా ఆచరణలో మాత్రం అభాసు పాలయ్యాయి. ప్రజలను ముక్కుపిండి ఏదోరకంగా వారినుంచి డబ్బులు వసూలు చేయడమే లక్ష్యంగా గుజరాత్‌ వ్యాపారి లాగా మోడీ ప్రభుత్వం నడుస్తోంది. ఎక్కడా వదలకుండా పన్ను వసూళ్లు సాగుతున్నాయి. చివరకు మనం రేపటి భవిష్యత్‌ కోసం చేసే ఎల్‌ఐఎసి లాంటి పొదుపు పథకాలపైనా జిఎస్టీ వసూళ్లు సాగుతున్నాయి. బ్యాంకుకు వెళ్లి ఏ పని చేసుకున్నా జిఎస్టీ పడుతోంది. దేశంలో జిఎస్టీ నుంచి తప్పించుకున్న సేవలు గానీ,వస్తువులు గానీ లేవంటే నమ్మ శక్యం కాదు. ప్రజలను పన్నుల పేరుతో పీడిస్తున్న ఏకైక ప్రభుత్వంగా చరిత్రలో మోడీ నిలుస్తారు. ఈదశలో కరోనా వ్యాక్సిన్‌ ధరలపై దేశవ్యాప్తంగా విమర్శలు చెరేగుతున్నాయి. ఓకేదేశం..ఒకే పన్ను అన్న వాళ్లు రెండు రకాల ధరలు నిర్ణయించడంపై తెంగాణ మంత్రి కెటిఆర్‌, బెంగాల్‌ సిఎం మమతా బెనర్జీ మండి పడ్డారు. ఇదేం విధానమని విమర్శించారు. వ్యాక్సిన్‌ ధనరపై విపక్షాలు సైతం తప్పు పట్టాయి. ప్రజలు కరోనా బారిన పడి చస్తుంటే శవాపై పేలాలు ఏరుకునేలా కేంద్రం విధానాలు ఉంటున్నాయి. నిజానికి కరోనా విపత్కర సమయంలో దేశంలోని ముప్పావు వంతు జనాభా కష్టాల్లో పడ్డారు. అలాంటి వారికి ఉచిత కరోనా ఇవ్వాల్సిన కేంద్రం ధరలను పెంచుకునేలా ఆయా కంపెనీలకు అధికారమివ్వడం, రాష్ట్రాలపై భారం మోపడం ఎంతవరకు సమంజసమో మోడీకే తెలియాలి. మోడీ ప్రభుత్వంలో అడిగే వారు లేరు. ఆయన చెప్పిందే వేదం. ఆయన చేసిందే చట్టం అన్నట్లుగా సాగుతోంది. కరోనా టీకాను కేంద్ర ప్రభుత్వానికిచ్చే రేటుకన్నా దాదాపు మూడింతలు అధిక ధరను రాష్ట్ర ప్రభుత్వాల నుండి వసూలు చేస్తామనడం దారుణం కాక మరోటి కాదు. ఇది ఓరకంగా రాష్ట్ర ప్రభుత్వాలపై భారం మోపడమే అవుతుంది. నిజానికి దేశం మొత్తానికి కరోనా వ్యాక్సిన్‌ ఇచ్చే జాతీయ విధానం అవలంబించి ఉంటే బాగుండేది. కానీ అలా జరగడం లేదు. దేశ ప్రజలందరికీ అవసరమైన టీకాను ఇవ్వాల్సిన బాధ్యతను కేంద్ర ప్రభుత్వం విడనాడింది. ఇలాంటి వివక్షాపూరిత విధానానికి తెర తీయడం సరైనదేనా అన్నది కేంద్రంలోని పెద్దలు సమీక్షించాలి. మే 1 నుంచి 18 ఏళ్ల పైబడిన వారందరికీ వ్యాక్సినేషన్‌ ప్రారంభమౌతుందని, ప్రజల ప్రాణాలను కాపాడడమే ప్రభుత్వ లక్ష్యమని మోడీ ఘనంగా చెప్పారు. అయితే 45 ఏళ్లు పైబడిన వారికే ఇప్పటికీ వ్యాక్సినేషన్‌ పూర్తి కాలేదు. వ్యాక్సిన్‌ ధరను నిర్ణయించే స్వేచ్ఛను ప్రైవేటు ఉత్పత్తిదార్లకివ్వడం వల్ల ప్రజలపై భారం పడుతుందని గ్రహించడం లేదు. వ్యాక్సిన్‌ విధానం సక్రమంగా జరగకపోతే దేశం ప్రమాదంలో పడేలా ఉంది. ప్రజలను ఆత్మరక్షణలో పడేయడం మంచిది కాదు. కరోనా చికిత్స, వ్యాక్సిన్‌ అన్నవి కేంద్రమే భరించేలా ఉండాలి. ఇది కొత్తగా వచ్చిపడిన ఉపద్రవం కనుక కేంద్రం బాధ్యత వహించాలి. అందుకు భిన్నంగా ప్రధాని మోడీ నిర్ణయాలు ఉంటున్నాయి. కోవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ ఉత్పత్తిదారులు సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా తన ధరను రెండు రకాలుగా ప్రకటించింది. దానిని సమర్థించుకుంది. ప్రపంచ దేశాలతో పోలిస్తే తక్కువేనని చెప్పుకుంది. ఒక మోతాదు వ్యాక్సిన్‌ను రాష్ట్ర ప్రభుత్వాలకు రూ.400కు, ప్రైవేటు ఆస్పత్రులకు రూ.600కు విక్రయిస్తామని, కేంద్ర ప్రభుత్వానికి మాత్రం 150 రూపాయలకే లభిస్తుందని పేర్కొంది. ’ఒక దేశం`ఒకే పన్ను` ఒకే భాష`ఒకే మతం…’ అంటూ ఊదరగొట్టిన పాలకులు ప్రాణాలు కాపాడే వ్యాక్సిన్‌కు మాత్రం ఇన్ని రకాల రేట్లెందుకు నిర్ణయిస్తున్నారో అర్థం కావడం లేదు. నిజానికి అదే 150ని అందరికీ వర్తించేలా చేసినా ఇలా చర్చించుకోవాల్సిన అవసరం వచ్చేది కాదు. వ్యాక్సిన్‌ కొరత వెంటాడుతుంటే కేంద్ర ప్రభుత్వం సరఫరాను పెంచకుండా, అమ్మకాలను సరళీకరించడం, ధరలపై నియంత్రణను ఎత్తివేయడం కార్పొరేట్ల లబ్ది కోసమేనన్నది ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. నిజానికి దేశంలో నెలకొన్న ప్రస్తుత విపత్కర ఆరోగ్య అత్యవసర పరిస్థితులను అధిగమించడానికి సార్వత్రిక వ్యాక్సినేషన్‌ విధానం చేపట్టాలి. ప్రజలకు సామూహికంగా వ్యాక్సినేషన్‌ కార్యక్రమం ఉచితంగా చేపట్టాలి. ఇందులో ఎలాంటి చర్చలకు తావులేకుండా చూడాలి.

వ్యాక్సినేషన్‌, ఆక్సిజన్‌ సరఫరా, కరోనా ట్రీట్‌మెంట్‌ ఇప్పుడు దేశాన్ని పీడిస్తున్న సమస్యలు. వీటిని అధిగమించేందుకు కేంద్రం నడుం బిగించాలి. అయితే మోడీ ప్రభుత్వం అలా ఆలోచించడం లేదు. ప్రతిదీ వ్యాపార ధోరణులతో ఆలోచించే మనస్తత్వం ఉన్న మన ప్రధాని మోడీకి వ్యాక్సిన్‌ కూడా వ్యాపర వస్తువుగానే కనిపిస్తోంది. కేంద్రం ప్రకటించిన కొత్త విధానం ప్రజలను ఆరోగ్య సంక్షోభం నుండి బయటపడేసేలా లేదు. ఒక సమున్నత బాధ్యత నుండి తాను తప్పించుకునేందుకు చేసే ప్రయత్నంలా కనిపిస్తోంది. కేంద్రం తన బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వాల పైకి నెట్టివేసేందుకు చూస్తోంది. వ్యాక్సిన్‌ను తీసుకోలేని కోట్లాదిమంది ప్రజలను గాలికొదిలేయాని చూస్తే జరిగే విపత్కర విపరిణామాల గురించి ఆలోచించడం లేదు. వ్యాక్సిన్లు ఇప్పటి వరకు రాష్ట్రాలకు ఉచితంగా అందుతున్నాయి. కానీ ఇప్పుడు, ఎలాంటి ధర నియంత్రణ లేకుండా బహిరంగ మార్కెట్‌లో రాష్ట్రాలు వ్యాక్సిన్లను సమకూర్చుకోవాలని చెప్పడం నిరంకుశ విధానాలకు పరాకాష్టగా చూడాలి. తాంబూలాలు ఇచ్చాను తన్నుకు చావండి అన్న పద్దతిలో ..నేనో నిర్ణయం తీసుకున్నాను…ఇక మీ ఖర్మ అన్నట్లుగా ప్రధాని మోడీ విధానాలు ఉన్నాయి. ఇకపోతే పి.ఎం కేర్స్‌ నిధికి వచ్చిన సొమ్మును ఇందుకు ఉపయోగించకపోవడం కూడా దారుణం కాక మరోటి కాదు. దేశమంతటా ఆక్సిజన్‌ కొరత ఏర్పడిన నేపథ్యంలో అందుకు తగ్గట్లుగా ప్రత్యామ్నాయ మార్గాలను ఆలోచించి రాష్ట్రాలను విశ్వాసంలోకి తీసుకోవ్సాన మోడీ ఇప్పుడు సెకండ్‌ వేవ్‌లో సైలెంట్‌గా ఉంటున్నారు. బిజెపి రాజకీయ విధానాలు అనాలో..లేక మోడీ విధానాలు అనాలో కానీ ప్రజలకు మాత్రం ఏవగింపుగా ఉన్నాయి. కేవలం పారిశ్రామిక వేత్తలను దృష్టిలో పెట్టుకుని చేస్తున్న లేదా అవలంబిస్తున్న విధానాలను ప్రజలు ఎల్లకాలం సహిస్తారని భావించరాదు. కరోనా టీకాను దేశ ప్రజందరికీ కేంద్ర ప్రభుత్వమే ఉచితంగా అందజేయడం ద్వారా సంక్షోభం నుంచి ప్రజలను గట్టెక్కించే ఆలోచన చేయాలి. ఓ మంచి నిర్ణయం తీసుకుని ప్రజల మనసును గెలుచుకోవాలి. అప్పుడే పాలకులపై విశ్వాసం కుగుతుంది.

Related News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *