ప్రజాస్వామ్యానికి పట్టుగొమ్మలు పత్రికలు

 ప్రజాస్వామ్యానికి పట్టుగొమ్మలు పత్రికలు

నేడు ప్రపంచ పత్రికా స్వేచ్ఛా దినోత్సవం

భూమిపుత్ర,చరిత్ర:

మానవాళి మనుగడ సజావుగా సాగాలంటే ప్రజాభీష్టానికి ప్రతిబింబాలుగా పత్రికలు ఉండాలి. అట్లాంటపుడే దేశంలో ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుంది. ప్రభుత్వానికి ఉండే మూడు అంగాలు శాసన వ్యవస్థ, కార్య నిర్వాహక వ్యవస్థ,న్యాయ వ్యవస్థ లతో పాటు ప్రజాస్వామ్య వ్యవస్థ పటిష్టతకు పత్రికా స్వేచ్ఛ ఎంతో ఆవశ్యకం.అందుకే దీనిని నాలుగో స్తంభంగా పరిగణిస్తారు.ఈ ఫోర్త్ ఎస్టేట్ లో పత్రికలతో పాటు ప్రసార మాధ్యమాలన్నీ వస్తాయి.1729-92 మధ్య కాలంలో జీవించిన ప్రముఖ ఆంగ్లో- ఐరిష్ రాజకీయ పరిశోధకుడు ఎడ్మండ్ బ్రూక్ పత్రికలను అత్యంత శక్తివంతమైనవిగా పేర్కొన్నారు. ప్రజాభిప్రాయాలను ప్రతిబింబించడంలోనూ, వాటిని వార్తలుగా మలచడంలోనూ పత్రికలు కీలకపాత్ర పోషిస్తాయని తొలిసారిగా ప్రపంచానికి నొక్కి చెప్పారు.

పెరుగుతున్న సాంకేతికతను వేగంగా అందిపుచ్చుకున్న పత్రికారంగం తన రూపురేఖలను సాధ్యమైనంత వరకు మార్చుకుని,కొత్త పుంతలు తొక్కింది. తొలినాళ్ళలో అప్పటి మౌలిక వసతుల కారణంగా ఒక పత్రిక ముద్రణ పూర్తయిన వారం రోజుల తరువాత కూడా పాఠకులకు చేరేది.ఒకప్పడు ప్రధాన సంచికలకే పరిమితమైన పత్రికలు క్రమేపీ జిల్లా అనుబంధాలు,డివిజన్,మండల స్థాయిలో అనుబంధాలను ప్రచురిస్తున్నాయి. ప్రతీ జిల్లాలో ఎడిషన్లు నిర్వహిస్తున్నాయి. దీంతో సమాచారం మరింత విస్తృతంగా,వేగంగా ప్రజలలోకి చేరవేయడంలో పత్రికలు సఫలీకృతమయ్యాయి.నేడు రేడియో,ఎలక్ట్రానిక్ మీడియా,వెబ్ మీడియా ఉధృతి పెరిగిన తరుణంలో పత్రికా రంగాన్ని విస్తృతార్థంలో మీడియాగా పరిగణిస్తున్నారు. సామాజిక మాధ్యమాల వల్ల ప్రయోజనాలున్నా అంతే స్థాయిలో దుష్ప్రభావాలు కూడా ఉన్నాయి. సమాచార మార్పిడి,భావజాల ప్రచారం కోసం వినియోగించేవారు కొందరైతే, మరి కొందరు దుర్వినియోగపరచడం చూస్తూనే ఉన్నాం. ప్రముఖుల వ్యక్తిగత జీవితాలలో చొరబడటం వంటివి ఇందులో భాగమే.

జర్నలిజం ఒక యుద్ధభూమి.ఆ యుద్ధభూమిలో జర్నలిస్ట్ నిత్య సైనికుడు. దినపత్రిక అంటే కేవలం తెల్ల కాగితం మీద నల్లని‌ అక్షరాల ముద్రణ కాదు.ప్రజల‌ మనోఫలకం మీద సమకాలీన సంఘటనల ముద్రణ అనే విషయం గుర్తెరగాలి. ప్రజాస్వామ్యంలోని పౌరుల భావప్రకటన,వాక్ స్వాతంత్ర్యపు హక్కుల పరిరక్షణకై స్వయం ప్రతిపత్తి గల ప్రతిష్టాత్మక పత్రికారంగం లోకి నేడు ప్రభుత్వాలు,కార్పొరేట్ శక్తులు ప్రవేశించి వ్యాపారమయంగా మార్చివేశాయి.భావ ప్రకటన స్వేచ్ఛ (పత్రికా స్వేచ్ఛ)అనేది ప్రజల పక్షాన నిలబడి, నిస్సహాయుల,తాడిత,పీడిత,బడుగు,బలహీన వర్గాల గొంతులకు అక్షరరూపమై మద్దతు నిలుస్తుంది.పత్రికా స్వేచ్ఛ అంటే దేశ పౌర,రాజకీయ,మత,స్వాతంత్ర్య పరిరక్షణ కల్పవృక్షం.రాజ్యాధినేతలు విద్యావంతులు కాకున్నా ఫర్వాలేదు. కానీ సంస్కార వంతులైన మనుషులై ఉండాలని పౌరసమాజం భావిస్తుంది. పౌర సమాజం స్వేచ్ఛగా స్వేచ్ఛగా జీవించాలంటే పత్రికాస్వేచ్ఛ పరిఢవిల్లాలి. ప్రపంచంలో ఎక్కడ,ఏ మూల అన్యాయం జరిగినా కుల,మత,ప్రాంత,జాతి,లింగ బేధాలు లేకుండా పత్రికా స్వేచ్ఛ బాధితుల పక్షాన రక్షణ కవచంగా నిలిచి అక్షరసేద్యం చేయాలి. ఈ అక్షర సైనికులకు రక్షణ కల్పించవలసిన బాధ్యత ప్రభుత్వాలది,పాలకులది. ప్రజల పక్షాన నిలిచే పత్రికా స్వేచ్ఛకు విఘాతం కలగకుండా చూడాలి. ఎక్కడైతే పత్రికా స్వేచ్ఛ నిరంతరంగా,నిర్భయంగా కొనసాగుతుందో అక్కడ ప్రజాస్వామ్యం వర్ధిల్లుతుంది.అబ్రహాం లింకన్ ప్రజాస్వామ్యాన్ని ఉద్దేశించి ఈ విధంగా అంటారు. “నా శత్రువు నోరు విప్పకుండా చేయగల బలం,బలగం,అధికారం నాకున్నప్పటికీ అతను తన అభిప్రాయాలను వెల్లడించే స్వేచ్ఛను హరించను.‌చివరికి అతని మాటలు నా పై విమర్శలయినా సరే” అదే ప్రజాస్వామ్యమని అంటారు.‌

కానీ నేడు పత్రికా స్వేచ్ఛ ప్రమాదంలో పడింది. మీడియా పై ప్రభుత్వాలు,ఉగ్రవాద సంస్థలు ఆంక్షలు విధిస్తున్నాయి. నియంత్రించాలని చూస్తున్నాయి.మీడియాపై దాడులకు తెగబడుతున్నాయి. పత్రికల గొంతు నొక్కడానికి ప్రయత్నిస్తున్నాయి. పాత్రికేయుల రహస్య మూలాలు,గుర్తింపు బహిర్గతం చేయాలని విధిస్తున్నాయి. ప్రపంచంలోని అన్ని దేశాల ప్రభుత్వాలు ఒకేలా వ్యవహరించవు. కొన్ని దేశాలలో పత్రికలే నిర్వహించవీలు లేకుండా చేస్తారు. మరికొన్ని దేశాలలో నిర్వహించే అవకాశం ఉన్నా వాటి స్వేచ్ఛ నామమాత్రమే. చాలా దేశాలలో వృత్తికి అంకితమైన జరనలిస్టులు నిప్పుల గుండంలో, మొనదేలిన కత్తుల‌ మీద నడుస్తూ నిజాలను నిర్భయంగా వెల్లడిస్తున్నారు. మృత్యుకుహరాలకు ఆమడ దూరంలో విధులు నిర్వహిస్తున్నారు.ప్రభుత్వాలు పెట్టే ఆంక్షలు ఒకెత్తు అయితే,మాఫియా ముఠాలు పెంచే ఒత్తిడి ఒకవైపు. టెర్రరిస్ట్ గ్రూపులు,డ్రగ్ మాఫియా మీడియాపై ఎప్పుడూ కత్తి కట్టి ఉంటాయి.
1991 లో ఆఫ్రికన్ జర్నలిస్టులు పత్రికలపై ఉన్న ఆంక్షలపై ఏప్రిల్ 29 నుండి మే 3 వరకు నమీబియాలోని విండ్ హాక్ లో సమావేశం జరిపి పత్రికా స్వేచ్ఛపై పలు తీర్మానాలు చేశారు. పత్రికా స్వేచ్ఛపై ఆంక్షలకు నిరసనగా ఆఫ్రికన్ జర్నలిస్టులు నిరసనగా ప్రకటన చేసిన రోజునే (మే 3) ప్రపంచ పత్రికా స్వేచ్ఛా దినోత్సవం జరపాలని ఐక్యరాజ్యసమితి నిర్ణయించింది. నిష్పక్షపాతంగా,నిర్భయంగా,నిజాయితీగా,నిక్కచ్చిగా విధులు నిర్వహిస్తూ బలైపోయిన జర్నలిస్టులు ఎందరో ఉన్నారు.వీళ్ళంతా పత్రికా స్వేచ్ఛకు దివిటీలు.‌గుల్లెర్మోకేనో అను వ్యక్తి ఎడిటర్‌గా పనిచేస్తున్న సమయంలో అతని వాస్తవాలతో కూడిన రాతలను సహించలేక డ్రగ్ మాఫియా అతడిని హత్య చేసింది.అతని బలిదానం పత్రికా స్వేచ్ఛకు స్ఫూర్తిగా నిలవడంతో ఆయన పేరు మీద గుల్లెర్మో కేనో అవార్డు నెలకొల్పారు. ఈ అవార్డు కింద యునెస్కో ప్రమాదపు అంచులలో సైతం నిర్భయంగా వ్యవహరించి పత్రికా స్వేచ్ఛకు ప్రతీకగా నిలబడిన జర్నలిస్టులకు 25,000 అమెరికన్ డాలర్ల నగదును అందిస్తారు.

మన దేశంలో పాత్రికేయులపై జరుగుతున్న దాడులలో1992 నుండి నేటి వరకు ఏ ఒక్క దానికీ శిక్ష పడలేదు.పత్రికా స్వేచ్ఛను పత్రికలు కాదు. ప్రజలే కాపాడుకోవాలి.భారత రాజ్యాంగంలోని 19 (1ఎ) అధికరణంలో పత్రికా భావ ప్రకటనా స్వేచ్ఛ, 19(2) అధికరణంలో దేశ రక్షణ సార్వభౌమాధికారం లపై పరిమితులు పొందుపరచబడ్డాయి.మన దేశంలో పాత్రికేయులపై జరుగుతున్న దాడులలో1992 నుండి నేటి వరకు ఏ ఒక్క దానికీ శిక్ష పడలేదు.పత్రికా స్వేచ్ఛను పత్రికలు కాదు. ప్రజలే కాపాడుకోవాలి.

పత్రికా స్వేచ్ఛా దినోత్సవం ఉద్దేశాలు
పత్రికా స్వేచ్ఛ,విలువల పట్ల అవగాహన కల్పించడం
ప్రపంచ వ్యాప్తంగా పత్రికా స్వేచ్ఛ స్థితిగతులను‌ పర్యవేక్షించడం
స్వేచ్ఛ కలిగిన మీడియాను దాడుల‌నుండి రక్షించడం
నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పాత్రికేయులకు నివాళి ఘటించడం

Related News

2 Comments

  • పత్రిక శక్తి గురించి ప్రతి పదం శక్తివంతంగా పలికింది. వ్యాసం చాలా బాగుంది.అభినందనలు.

    • thanks a lot sir

Leave a Reply

Your email address will not be published.