మరో సంగీత ఆణిముత్యం పట్రాయని సంగీతరావు మృత్యువాత

 మరో సంగీత ఆణిముత్యం పట్రాయని సంగీతరావు మృత్యువాత

భూమిపుత్ర, చెన్నై:

సుప్రసిద్ధ సంగీత విద్వాంసుడు, శతాధిక వృద్ధుడు పట్రాయని సంగీతరావు (101) కరోనాతో కన్నుమూశారు. కరోనా బారినపడ్డ సంగీతరావు బుధవారం రాత్రి 9 గంటల సమయంలో చెన్నైలో తుదిశ్వాస విడిచారు. ఆయనకు ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలున్నారు. 1920 నవంబర్‌ 2 న విజయనగరం జిల్లా కిండాం అగ్రహారంలో సంగీతరావు జన్మించారు. పట్రాయనివారి సంగీత కుటుంబంలో మూడోతరానికి చెందిన సంగీత రావు అసలు పేరు నరసింహమూర్తి. హార్మోనియం వాయించడంలో ఆయనకు మంచి పేరుంది. అందరికీ సంగీతరావుగానే సుపరిచితులు. సినీ సంగీత దిగ్గజం ఘంటసాలకు సంగీతరావు సహాయకుడిగా పనిచేశారు. ఘంటసాల స్వర సహాయకుడిగా 1974 వరకు సుమారు పాతికేళ్ల పాటు తెలుగు సినిమాతో సంగీతరావు జీవితం కొనసాగింది. తమిళనాడు ప్రభుత్వం సంగీతరావును కలై మామణి బిరుదుతో సత్కరించింది.

సాహితీ రంగంలోనూ సంగీతరావు ఎంతో ప్రతిభను కనపరిచారు. తెలుగు స్వతంత్ర, ఆంధప్రభ, ఆంధ్రపత్రిక, జగతి వంటి ప్రముఖ పత్రికలలో సంగీతరావు రచనలు వచ్చాయి. శతాధికుడైనా ఆరోగ్యంతో కాలం గడుపుతున్న పట్రాయని కి ఇటీవల కరోనా సోకడంతో అస్వస్థతకు గురయ్యారు. బుధవారం రాత్రి చెన్నైలోని స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. ఆయనకు ముగ్గురు కుమార్తెలు, ఇద్దరు కుమారులు. కర్ణాటక, హిందుస్థానీ సంగీతరీతుల్ని ఔపోసన పట్టిన పట్రాయని హార్మోనియం, వీణ, వయోలిన్‌ వాయిద్యాల్లో మహాదిట్ట. గాత్రం పరంగానూ అపార ప్రతిభాపాటవాలు చూపారు. ఆయన అసలు పేరు పట్రాయని వేంకట నరసింహమూర్తి. అయితే సంగీతజ్ఞుల కుటుంబానికి చెందిన తన బిడ్డ తప్పకుండా సంగీత విద్వాంసుడు అవుతాడన్న నమ్మకంతో మాతృమూర్తి మంగమ్మ ఆయన్ను సంగీతరావు అని పిలిచేవారు. తర్వాత ఆ పేరే ఆయనకు స్థిరపడింది. ఘంటసాల తీసిన ’పరోపకారి’ చిత్రంలో ’పదండి తోసుకు.. పదండి ముందుకు..’ అనే పాటను పట్రాయనే పాడారు. రాజశ్రీ ప్రొడక్షన్స్‌కు చెందిన అన్ని చిత్రాలకు పట్రాయని పని చేశారు. ఘంటసాల ఆర్కెస్టాల్రో పని చేశారు.సీనియర్‌ నటీమణి కాంచన వంటివారికి సంగీతం నేర్పారు. వెంపటి చినసత్యం స్థాపించిన ’కూచిపూడి అకాడవిూ’లోనూ పని చేశారు. అనేక కూచిపూడి నాటకాలకు సంగీతం అందించారు. మల్లాది రామకృష్ణశాస్త్రి, ఆరుద్ర, ఆదిభట్ల నారాయణదాసు, గుడిపాటి వెంకటాచలం, దేవులపల్లి కృష్ణశాస్త్రి, ఆకొండ వెంకటశాస్త్రి, నండూరి రామ్మోహన్‌రావు, జరుక్‌ శాస్త్రి, యామిజాల పద్మనాభస్వామి వంటి మహామహులతో ఆయనకు సాహితీ సాన్నిహిత్యం వుంది.

Related News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *