హత్య కుట్ర భగ్నం- నిందితుల అరెస్టు

 హత్య కుట్ర భగ్నం- నిందితుల అరెస్టు

వివరాలు వెల్లడిస్తున్న ఎస్పీ సత్య ఏసుబాబు

భూమిపుత్ర,అనంతపురం:
ధర్మవరం పట్టణంలో వ్యక్తిగత కారణాలతో ఇద్దరిని వేరువేరుగా చంపాలనుకున్న కుట్ర ను పోలీసులు భగ్నం చేశారు. హతమార్చేందుకు సిద్ధం చేసుకున్న పిస్టల్ ను స్వాధీనం చేసుకుని ఇద్దరిని అరెస్టు చేశారు. నిందితులలో ఒకరు రియల్ ఎస్టేట్ వ్యాపారి కాగా మరొకరు ఆర్టీసీ కండక్టర్. వీరినుండి ద్విచక్ర వాహనం,రెండు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఎస్పీ సత్య ఏసుబాబు మీడియా ముందు నిందితులను ప్రవేశపెట్టి వివరాలను వెల్లడించారు.

పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు మొదటి నిందితుడైన కప్పల గంగాధర్ కు మరియు ధర్మవరం చెందిన వ్యక్తికి స్థల వివాదం,రియల్ ఎస్టేట్ లావాదేవీలలో గొడవలు ఉన్నాయి. తనతో వివాదమున్న వ్యక్తిని అంతమొందించి అడ్డు తొలగించుకోవాలని భావించాడు. రెండవ నిందితుడైన కారంతోటి మురళీ నాయక్ ధర్మవరం ఆర్టీసీ డిపోలో కండక్టర్ గా పనిచేసేవాడు. ఇటీవల తన భార్య ఆత్మహత్య చేసుకోగా అందుకు కారణమైన వ్యక్తిని చంపి పగ తీర్చుకోవాలనుకున్నాడు. కప్పల గంగాధర్,కారంతోటి మురళీ నాయక్ లు చర్చించుకుని తమ తమ శత్రువులను అంతమొందించేందుకు నిశ్చయించుకుని తమకు పరిచయము ఉన్న అడవిబ్రాహ్మణ పల్లి కి చెందిన సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ బాలునాయక్ ను సంప్రదించారు. ఈ బాలు నాయక్ కర్ణాటక లోని హాసన్ జిల్లాలో విధులు నిర్వహిస్తున్నారు.

ఇతని సహకారంతో బెంగుళూరు లో రూ 2.50 లక్షల రూపాయలు వెచ్చించి పిస్టల్ ను కొనుగోలు చేశారు. కొనుగోలు చేసిన పిస్టల్ ను కప్పల గంగాధర్ తన వెంట తీసుకువెళుతుండగా ధర్మవరం పోలీసు స్టేషన్ పరిధిలోని యర్రగుంట్ల రైల్వే స్టేషన్ వద్ద పోలీసుల వాహన తనిఖీలో పట్టుకున్నారు. వెంటనే ద్విచక్ర వాహనంలో పరారయ్యాడు. దీనిపై అర్బన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదయ్యింది. పిస్టల్ పట్టివేతకు సంబంధించి కేసును వెంటనే ఛేదించాలని ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు డిఎస్పీ రమాకాంత్ పర్యవేక్షణలో మూడు బృందాలు రంగంలోకి దిగాయి. పక్కా సమాచారంతో సీఐ కరుణాకర్ ఆధ్వర్యంలో నిన్న సాయంత్రం కరుణాకర్ నేతృత్వం లో కప్పల గంగాధర్,కారంతోటి మురళీ నాయక్ లను అరెస్టు చేశారు. ఈ కేసులో పిస్టల్ కొనుగోలుకు సహకరించిన సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ బాలూ నాయక్ ను అరెస్టు చేయవలసి ఉందని పోలీసులు తెలిపారు. హత్య కుట్ర భగ్నం చేసి ఇద్దరు నిందితులను అరెస్టు చేసి పిస్టల్ ను స్వాధీనం చేసుకున్న విషయంలో ఎస్పీ సత్య ఏసుబాబు ధర్మవరం డీఎస్పీ రమాకాంత్ ను,సీఐ కరుణాకర్ ను,సిబ్బందిని అభినందించారు.

Related News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *