ముంబై-హైదరాబాద్‌ బుల్లెట్‌ రైలు మార్గం కుదింపు

 ముంబై-హైదరాబాద్‌ బుల్లెట్‌ రైలు మార్గం కుదింపు

భూమిపుత్ర,ముంబై:

దేశ ఆర్థిక రాజధాని ముంబై, తెలంగాణ రాజధాని హైదరాబాద్‌ మధ్య ప్రతిపాదించిన బుల్లెట్‌ రైలు మార్గంలో స్వల్ప మార్పులు జరిగాయి. ఈ మార్పుల వల్ల ముంబై, హైదరాబాద్‌ మధ్య సుమారు 20 కిలోవిూటర్ల దూరం తగ్గిపోయింది. దూరం తగ్గడంతో ఈ ప్రాజెక్టు చేపట్టనున్న నేషనల్‌ హై స్పీడ్‌ రైల్వే కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఎన్‌హెచ్‌ఆర్‌సీఎల్‌)కు సుమారు రూ. 4 వేల కోట్లు ఆదా కానున్నాయి. దేశ ఆర్థిక రాజధాని ముంబైకి దేశంలోని ఇతర ప్రధాన నగరాలతో కనెక్టివిటీని మరింత పెంచేందుకు, ఆ ప్రాంతాలను చేరుకునేందుకు పట్టే సమయాన్ని తగ్గించేందుకు నేషనల్‌ హై స్పీడ్‌ రైల్వే కార్పొరేషన్‌ లిమిటెడ్‌ నడుం బిగించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ముంబై-హైదరాబాద్‌ మధ్య బుల్లెట్‌ రైలు ప్రాజెక్టు కోసం లైడార్‌ (లైట్‌ డిటెక్షన్‌ అండ్‌ రేంజింగ్‌ సర్వే) అధ్యయనం పనులు ఇదివరకే ప్రారంభించిన విషయం కూడా తెలిసిందే.

ప్రస్తుతం ప్రతిపాదనలో ఉన్న ముంబై-నాగ్‌పూర్‌, ముంబై-అహ్మదాబాద్‌, ముంబై`హైదరాబాద్‌ ఇలా మూడు వేర్వేరు ప్రాజెక్టుల పనుల వల్ల రవాణ వ్యవస్థ మెరుగుపడి దేశ ఆర్థిక రాజధాని ముంబై నగరం మరింత అభివృద్ధి చెందనుంది. దీంతోపాటు వేగవంతమైన రవాణా కూడా అందుబాటులోకి రావడంతో అనేక ప్రయోజనాలు కలిగే అవకాశముంది. అయితే, కరోనా కారణంగా ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్‌ దాదాపు అన్ని రైల్వే ప్రాజెక్టులపై ప్రభావం చూపింది. పనులన్నీ మందగించాయి. కానీ, ఇప్పుడు కరోనా వైరస్‌ తగ్గుముఖం పట్టడంతో ప్రాజెక్టుల పనులు ఇప్పుడిప్పుడే మళ్లీ వేగం పుంజుకుంటున్నాయి. తొలుత ప్రతిపాదించిన ముంబై-హైదరాబాద్‌ మధ్య బుల్లెట్‌ ట్రైన్‌ మార్గం 650 కిలోవిూటర్లు ఉండగా స్వల్ప మార్పుల జరిగిన తర్వాత ఈ దూరం 630 తగ్గింది. అంటే 20 కిలోవిూటర్ల దూరం తగ్గింది.

సాధారణంగా బుల్లెట్‌ ట్రైన్‌ కోసం కిలోవిూటరు మార్గం తయారు చేయాలంటే సుమారు రూ.200 కోట్లు ఖర్చవుతాయి. అలాంటిది ప్రస్తుత మార్పులతో ఏకంగా 20 కిలోవిూటర్ల దూరం తగ్గడం వల్ల నేషనల్‌ హై స్పీడ్‌ రైల్వే కార్పొరేషన్‌ లిమిటెడ్‌కు రూ. 4 వేల కోట్ల మేర ఆదా కానున్నాయి. ముందుగా ప్రతిపాదించిన ముంబై-హైదరాబాద్‌ బుల్లెట్ రైలు మార్గంలో థానే, న్యూ ముంబై, లోనావాలా, పుణె, బారామతి, పండరిపూర్‌, షోలాపూర్‌, గుల్బర్గా, జహీరాబాద్‌, వికారాబాద్‌ స్టేషన్లు ఉండేవి. కానీ, మార్పులు చేసిన దాని ప్రకారం థానే, న్యూ ముంబై, లోనావాల, పుణె, బారామతి, పండర్‌పూర్‌, షోలాపూర్‌, తాండూర్‌, వికారాబాద్‌ స్టేషన్లు ఉండబోతున్నాయి. దీంతో ఈ బుల్లెట్‌ రైలు మార్గం దూరం దాదాపు 20 కిలోవిూటర్ల మేర తగ్గిపోయింది.

Related News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *