బహుముఖ ప్రజ్ఞావంతుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం

 బహుముఖ ప్రజ్ఞావంతుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం

గాయకుడిగా, నటుడిగా విశ్వరూప ప్రదర్శన

జయంతి సందర్బంగా ఆయనకు జననివాళి

భూమిపుత్ర,సినిమా:

ఎస్పీ బాలసుబ్రమణ్యం తెలుగు చిత్రసీమకు వరం. ఆయన గాత్రంతోనే కాదు,నటనతో అలరించి తెలుగువారికి దగ్గరయ్యారు. ఆయన 75వ జయంతి సందర్భంగా చిత్రసీమతో పాటు, తెలుగు జాతి ఘనంగా నివాళి అర్పించుకుంది. నటన, పాటలతో అలరించారు. అందరితో మంచివాడనిపించుకున్నారు. గతేడాది కరోనాబారి పడి మృతి చెందిన బాలు జ్ఞాపకాలు ఇప్పటికీ మదిలోనే ఉన్నాయి. పాటల పూదోటలో బాలు తీరేవేరు. ఆయన గొంతు అన్ని స్వరాలనూ పలికిస్తుంది. అప స్వరాన్ని తప్ప అన్న గుర్తింపు తెచ్చుకున్నారు గాన గంధర్వుడు ఎస్‌.పి.బాలసుబ్రహ్మణ్యం. పాటకి, మాటకి, మంచి వ్యక్తిత్వానికి మారుపేరుగా నిలిచారు. నేపథ్య గాయకుడిగా చలనచిత్ర పరిశ్రమలో 45 వసంతాలు పూర్తి చేసుకున్న ఆయన గత ఏడాది కరోనాతో పోరాడి పరమపదించారు.

శ్రీపతి పండితారాధ్యుల వంశంలో పుట్టిన బాల సుబ్రహ్మణ్యాన్ని తెలిసిన వారంతా ’బాలు’ అని పిలుస్తుంటే, ఆప్తమిత్రులు మాత్రం ’మణి’ అని పిలుస్తుండేవారు. నాటకాలలో వేషాలు వేస్తూ, స్టేజీ విూద పాటలు పాడుతూనే ఉండేవారాయన. ఒక విధంగా మద్రాస్‌ జీవితమే బాలు జీవితాన్ని మలుపు తిప్పిందని చెప్పవచ్చు. మద్రాసులో మిత్రులతో కలిసి పాటలు పాడుతూ, పోటీలతో పాల్గొంటూ, తనకు తెలియకుండానే తన జీవిత సౌభాగ్యానికి పునాదులు వేసుకున్నారు. కోదండపాణి ఎస్‌పీబీని 18 ఏళ్ల వయసులో అప్పుడు ’శ్రీశ్రీశ్రీ మర్యాదరామన్న’ చిత్రం తెరకెక్కిస్తున్న సమయమది. పద్మనాభం బాలు పాట విని గొంతు నచ్చిందన్నారు. దాంతో మర్యాదరామన్న చిత్రంలో పాడే ఛాన్స్‌ ఇచ్చారు.

ఆ సినిమాకు సంగీతదర్శకుడు కోదండపాణి. అందులో సుశీలతో కలిసి ’ఏమి ఈ వింత మోహము’ అనే పాట పాడారు. ఆ పాట కోదండపాణితోపాటు అందరికీ నచ్చింది. ఆనాడే బాలు గొప్ప గాయకుడు అవుతాడని ఊహించారు.పువ్వు పుట్టగానే పరిమళించిందన్నట్టు పుట్టుకతో బాలూకి స్వరకళ అబ్బిందని చెప్పుకోవాలి. సినిమా రంగానికి వస్తే ’కన్యాకుమారి’ తర్వాత ’కెప్టెన్‌ కృష్ణ’, ’రారా క్రిష్ణయ్య’ చిత్రాలకు సంగీతం అందించారు. ఆ తర్వాత ’తూర్పు వెళ్లే రైలు’ ఆయనకు సంగీత దర్శకుడిగా పేరు తీసుకొచ్చింది. సంగీత దర్శకుడిగా బాలూని బాపు,రమణలు ఎంతో ప్రోత్సహించారు. అలాగే, బాలు`జంధ్యాల కలయికలో ’పడమటి సంధ్యారాగం’, ’వివాహ భోజనంబు’, ’నీకూ నాకూ పెళ్లంట’ చిత్రాలు వచ్చాయి. ఆర్‌. నారాయణమూర్తి హీరోగా నటించిన ’సంగీత’, గొల్లపూడి రాసిన నాటకం ఆధారంగా తీసిన ’కళ్లు’ చిత్రాలకు ఆయనే సంగీత దర్శకుడు.

’మయూరి’కి సంగీత దర్శకుడిగా నంది పురస్కారం అందుకున్నారు. సంగీత దర్శకులు ఎమ్మెస్‌ విశ్వనాథన్‌, ఇళయరాజా స్వరపరిచిన పలు గీతాలను ఎస్పీబీ ఆలపించారు. ’ఆనందభైరవి’ విజయోత్సవానికి అగ్రదేశం వెళ్లినప్పుడు జంధ్యాల దర్శకత్వంలో ప్రవాసాంధ్రులు ఓ సినిమా నిర్మించాలని సంకల్పించారు. అదే ’పడమటి సంధ్యారాగం’. ఆ టైటిల్‌ సూచించింది బాలూనే. యాదృచ్ఛికంగా అప్పటికప్పుడు తనతో కచేరి చేయడానికి అమెరికా వచ్చిన వాద్య బృందంతో ’పిబరే రామరసం…’ గీతానికి కొత్త హంగులు అద్ది వాషింగ్టన్‌ డి.సి.లోని ఒమేగా స్టూడియోలో రికార్డు చేశారు. ఈ తరం అగ్ర హీరోలు చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్‌… నలుగురి తోనూ తెరను పంచుకున్నారు. ’పవిత్ర బంధం’లో వెంకటేశ్‌కి తండ్రి పాత్ర ఆయనకు బాగా నచ్చినది. అదే పాత్ర తమిళం, కన్నడలోనూ ఆయనే చేశారు.

’ప్రేమికుడు’లో ప్రభుదేవాకి తండ్రిగా చేసిన పాత్ర తనకు నచ్చిందన్నారు. ’వివాహ భోజనంబు’లో సంగీత ప్రియుడైన పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌గా సంగీతాన్ని పలికిస్తూ, వినోదాన్ని పండించారు.చిరంజీవి ’ఇంద్ర’లో నిజజీవిత పాత్ర పోషించారు. అతిథి పాత్రలో ఎస్పీబీగా కనిపించారు. అలాగే… ’కళ్లు’, ’చెన్నపట్నం చిన్నోళ్లు’, ’రూమ్మేట్స్‌’ చిత్రాల్లో అతిథిగా నిజజీవిత పాత్రల్లో కనిపించారు. ’గొప్పింటి అల్లుడు’లో బాలకృష్ణకి, ’రాక్షసుడు’లో నాగార్జునకి, ’ప్రేమదేశం’లో టబుకి, ’ఆరో ప్రాణం’లో వినీత్‌కి, ’మనసు పడ్డాను కానీ’లో రాశీకి తండ్రిగా నటించారు. ఆయన నటించిన చిత్రాల్లో ’మైనా’ (1996) విడుదల కాలేదు. తనికెళ్ల భరణి దర్శకత్వంలో నటించిన ’మిథునం’ మరో ఎత్తు. అందులో అప్పదాసుగా చిరస్థాయిగా నిలిచే నటన కనబరిచారు. ఇలా నటనతో పాటు, పాటలతో మనలను అలరించిన బాలు నిజంగా చిరంజీవియే.

Related News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *