ఆధునిక వైద్యానికి ప్రత్యామ్నాయం ఉందా?

 ఆధునిక వైద్యానికి ప్రత్యామ్నాయం ఉందా?

భూమిపుత్ర,ఆరోగ్యం:

ప్రపంచంలో ఉన్న వైద్యాలన్నింటినీ అధ్యయనం చేసి వడకట్టినదే గదా ఆధునిక వైద్యం.ఇంకా అనేక అధ్యయనాలు చేయాలి.కొత్త జబ్బులు విసిరే సవాళ్లు ఎప్పుడూ వుంటూనే వుంటాయి.చరకుడు రాసిన చరక సంహిత ,శుశ్రుతుడు రాసిన “శుశ్రూత సంహిత” లనూ ఆయుర్వేద,సిద్ధ,యునానీ మందుల మీద ప్రభుత్వం ఆధ్వర్యంలో మరింత పరిశోధనలు జరగాలి.రాన్రానూ ఇంగ్లీషు వైద్యం ఖరీదైపోతున్నది.అందుకే ఆయుర్వేద,సిద్ధ,యునానీ,హోమియో,ఎలక్ట్రో హోమియో,రేకీ,నాటు వైద్యం వంటి పేర్లతో నడుస్తున్న వైద్యాలను ప్రోత్సహించక తప్పదనే వాదన బలంగా వినబడుతున్నది . చరకుడు రాసిన “చరక సంహిత”, శుశ్రుతుడు రాసిన ‘ శుశ్రూత సంహిత ‘ లనూ ఆయుర్వేద,సిద్ధ,యునానీ మందుల మీద ప్రభుత్వం ఆధ్వర్యంలో మరింత పరిశోధనలు జరగాలి.

ముక్కు తెగిపోయిన వారికి మళ్ళీ ముక్కును అమర్చే ప్లాస్టిక్ సర్జరీ చేస్తుంటారు.క్రీస్తు పూర్వం మన దేశంలో “శుశ్రుతుడు” చేసిన ఈ శస్త్రచికిత్స ఇండియన్ ఫోర్‌హెడ్ రినో ప్లాస్టీగా ప్రపంచమంతటా ఇప్పటికీ ప్రాచుర్యంలో ఉంది.ఇంగ్లీషు వైద్యం లేదా అల్లోపతీ అనే దాన్ని ఒక వైద్య విధానంగానూ మిగతావన్నీ ప్రత్యామ్నాయ వైద్య విధానాలని వ్యవహరిస్తున్న మనకు 500 సంవత్సరాల క్రితం వరకు మానవుడి శరీర నిర్మాణం ఎలా ఉంటుందో ఎవరికీ తెలీదు.మృతదేహాలను కోసి చూసిన తరువాతే దేహనిర్మాణ శాస్త్రం ( ఎనాటమీ ) మనకు అర్థం అయింది.దాని రిశోధనల అనంతరం దేహ ధర్మాలైన జీర్ణక్రియ,శ్వాసక్రియ,మెదడు గుండెల పని తీరు వగైరాలన్నీ ( ఫిజియాలజీ ) అర్ధం అయ్యాయి . కాలక్రమేణా పరిశోధనలు మరింతగా ముందుకు సాగి,రోగాల సమయంలో శరీరంలో ఏయే మార్పులు వస్తుంటాయో కూడా ( పేథాలజీ ) తెలిశాయి.గాలిలో సూక్ష్మజీవులు ఉన్నాయని తెలిసింది 160 సంవత్సరాల క్రితమే.వాటి ద్వారా వచ్చే జబ్బులు రాకుండా ఏమి చేయాలో వస్తే ఏం చేయాలో తెలిసింది.ఆ తర్వాతే సూక్ష్మజీవుల అధ్యయన శాస్త్రం ఆవిర్భవించింది.

పెన్సిలిన్ సంశ్లేషణ

వందేళ్ళ క్రితం వరకూ యాంటీబయాటిక్స్ అనే మందులే లేవు. మొట్ట మొదటి యాంటీబయాటిక్ పెన్సిలిన్ ను 1942 లో ఉపయోగించారు.ఇప్పుడు మనం వాడే మందులన్నీ ఆ తర్వాత కనిపెట్టినవే ( ఫార్మకాలజీ ) ఇంగ్లీషు వైద్యం అనబడే ఈ వైద్యానికి ముందు మన వాళ్ళు మందులేమి వాడలేదా?వాడితే ఏం వాడారు ?ఏ దేహధర్మాల ఆధారంగా వాడేవారు? పరిణామ క్రమంలో మనిషి పుట్టినప్పటి నుండి బాధలు,జబ్బులు ఉండే ఉంటాయి కదా? తలనొప్పి,వంటి నొప్పి,దగ్గు,జ్వరం,దేహానికిదెబ్బలు,కాళ్ళు -చేతులు విరగడాలు అన్నీ ఉంటాయి గదా!!ఇంత ఎక్కువగా కాకపోయినా గుండెపోటు,షుగర్లు,బీపీలు,క్యాన్సర్లు కూడా పేర్లు వేరైనా – ఉండే ఉంటాయి.మరి వీటన్నింటినీ భరిస్తూ సుదీర్ఘ కాలం చూస్తూ ఊరుకోరు కదా. ఏదో ఒక వైద్యం చేసుకోకుండా బాధలు పడరు కదా!!

మొట్ట మొదటి మనిషే మొదటి వైద్యుడు.మొట్ట మొదటి ఆడమనిషే.మొదటి నర్స్అప్పటినుండీ మానవుల బాధలను తగ్గించడానికి తమకు తెలిసిన కనిపెట్టిన వైద్య విధానాలను ప్రక్రియలను ఉపయోగిస్తూనే ఉన్నారు.గ్రీకులు,రోమన్లు,చైనా వారు,అరబ్బులు,భారతీయలు ఎక్కడి సమూహాలు అక్కడ వారివారి అనుభవంలో నేర్చుకొన్న విధానాల ఆధారంగా మనుషుల బాధలను తగ్గించడానికి వైద్యం చేసుకుంటూనే ఉన్నారు.యూరప్ లో గేలన్ ( 130–215 ఎ.డి ) అనే ఆయన ప్రతిపాదించిన వైద్య సిద్ధాంతం ఆధారంగా 1500 సంవత్సరాల పాటు వైద్యం జరిగింది.వెసాలియస్ అనే శాస్త్రవేత్త దేహ నిర్మాణాన్ని ( ఎనాటమీ ) విలియం హార్వే అనే ఇంకొక శాస్త్రవేత్త దేహ ధర్మాల్ని ( ఫిజియాలజీ ) శాస్త్రీయంగా అధ్యయనం చేసే వరకూ గేలన్ సిద్ధాంతం ప్రకారమే వైద్యం జరిగింది.మానవుడి ఆయుర్దాయం 100-110 సంవత్సరాలు.అయితే వంద సంవత్సరాల క్రితం వరకూ సగటు ఆయుర్దాయం 30-40 సంవత్సరాల మధ్యనే ఉండేది.

ఈ రోజు అభివృద్ధి చెందిన దేశాలలో సగటు ఆయుర్దాయం 80 సంవత్సరాలకు పైగా ఉంటే మన దేశం లాంటి వాటిలో 69 సంవత్సరాలకు పైగా ఉంది.ఆయుర్దాయం’తో పాటు శిశు మరణాల రేటు వంటి అనేక ఆరోగ్య సూచికలన్నింటిలో ఇంత అభివృద్ధికి కారణం ఎందరెందరో శాస్త్రజ్ఞుల కృషే. అన్ని దేశాల వివిధ కాలాల పాత వైద్యాలలోని ఉపయోగపడే అంశాలన్నిటిని ప్రయోగ నిరూపణ పూర్వకంగా మిళితం చేసుకున్నదే ఆధునిక వైద్యము.భారత దేశ వైద్యంలో ‘సర్పగంధి” మొక్క వేళ్ళను కొన్ని శతాబ్దాల నుండి ఉపయోగిస్తున్నారు.ఈ వేళ్ళు నమిలితే కొంతమందికి ఆరోగ్యం మెరుగ్గా అనిపించేది.అలా ఎందుకనిపిస్తుందో తెలుసుకోవాలని 70 సంవత్సరాల క్రితం ప్రయోగశాలలో పరీక్షలు చేశారు.ఆ వేళ్ళలో 16 రకాల ఆల్కలాయిడ్స్ అనే రసాయనాలు ఉన్నాయి.వాటిలో ఒకటి అయిన “5 సరన్ ” అనే ఆల్కలాయిడ్ తీసుకున్న వారికి అధికంగా ఉన్న రక్తపోటు తగ్గుతోంది.

మిగిలిన 15 ఆల్కలాయిడ్లకు దేహానికి ఉపయోగపడే ప్రభావం ఏమీ లేదని తేలింది.ఈ పరిశోధనల తర్వాత కూడా అందరికీ సర్పగంధి వేళ్ళు మంచివి,అందరూ నమలండి ” అని సలహా ఇస్తామా లేదు కదా. అధిక రక్త పోటు ఉన్న వారికి మాత్రమే ఆ వేళ్ళలో నుంచి తీసిన ‘ రిసర్బిన్ ‘ అనే రసాయనాన్ని ఇస్తాము. అనేక అనవసర రసాయనాలు కలిగిన సర్పగంధి వేళ్ళను నమిలించినందుకు ప్రాచీన వైద్యాన్ని వెక్కిరించవలసిన అవసరం లేదు.ఆ కాలానికి వారికి తెలిసిన జ్ఞానాన్ని బట్టి కొన్ని బాధలకు కొన్ని వేళ్ళో ఆకులో,పూలో,కాయలో వాటి నుంచి వచ్చిన కషాయాలో ఇచ్చేవారు.కాలక్రమేణా దేహ నిర్మాణం,దేహ ధర్మం,రసాయన శాస్త్రం మనకు ఇంకా బాగా అర్ధం అయినప్పుడు రోగాలకు సరైన కెమికల్స్ ను సరైన మోతాదులో ఇస్తున్నారు.ఈ నేపథ్యంలో శాస్త్రీయ అధ్యయనంతరువాత మాత్రమే దేనినైనా ప్రత్యామ్నాయ వైద్యంగాస్వీకరించగలము.

Related News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *