వైద్యారోగ్య సిబ్బందిని కాపాడుకోవాలి!!

 వైద్యారోగ్య సిబ్బందిని కాపాడుకోవాలి!!

భూమిపుత్ర, సంపాదకీయం:

కరోనా తీవ్రంగా వ్యాప్తి చెందుతోంది. అయితే వివిధ రాష్ట్రాలు చేపట్టిన లాక్‌డౌన్‌, కర్ఫ్యూల వల్ల పరిస్థితి చక్కబడుతోంది. కేసుల సంఖ్యతో పాటు మరణాలు తగ్గుతున్నాయి. ఈ క్రమంలో థర్డ్‌వేవ్‌ కూడా ఉందన్న హెచ్చరికలు ఆందోళన కలిగిస్తున్నాయి. మరోవైపు సామాన్యుల జీవితాలు అగమ్యగోచరంగా మారాయి. అన్నింటిని మించి వైద్యారోగ్య సిబ్బంది ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయి. కరోనా వ్యాధి వ్యాప్తిని అరికట్టే ప్రయత్నంలో వైద్యులు, వైద్య సిబ్బంది, పోలీసులు ప్రతి ఒక్కరూ తీవ్రంగా కృషి చేస్తున్న దశలో వీరంతా కరోనా బారిన పడడం ఆందోళన కలిగిస్తోంది. ఎందరో ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. వారియర్స్‌ కరోనా బారిన పడితే ఇక కరోనా వచ్చిన సామాన్యులకు చికిత్స అందించడం దుర్లభం కానుంది.

ఈ క్రమంలో ఇటీవలి మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. వీరిని జాగ్రత్తగా చూసుకునేందుకు ఎంత ఖర్చయినా వెచ్చించకుంటే మొత్తం సమాజంలో కరోనా వ్యాప్తి మరింత తీవ్రం కావడమే గాకుండా దేశం అల్లకల్లోలం కాగలదు. వైద్యం చేయడానికి వైద్యులు, సిబ్బంది రాకపోతే సమస్య తీవ్రం కావడం ఖాయం. వార్తలను కవరేజ్‌ చేసే క్రమంలో జర్నలిస్టులు సైతం కరోనా బారిన పడుతున్నారు. ఇప్పటికే ఎందరో ప్రాణత్యాగం చేశారు. త్వరగా వార్తను అందించాలన్న ఆదుర్దాలో ఎంత జాగ్రత్తలు తీసుకున్నా కరోనా కాటుకు బలికాక తప్పడం లేదు.అందరినీ ఫ్రంట్ లైన్ వారియర్స్ గా గుర్తిస్తున్న ప్రభుత్వాలు పాత్రికేయులను గుర్తించకపోవడం దురదృష్టకరం. ఈ దశలో కరోనాపై యుద్దంలో ముందు వరుసలో ఉన్న వారిని కాపాడుకునేందుకు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు యుద్ద ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలి. వారి కుటుంబాలకు అండగా నిలవాలి.

వైద్యులు, వైద్య సిబ్బంది, పోలీసులు, పారిశుధ్య సిబ్బంది, జర్నలిస్టుల ఇలా ముందున్న వారిని సరిగా చూసుకుని వారిని కాపాడుకోవాలి. వారి కుటుంబాలను భరోసా ఇవ్వాలి. ఇకపోతే ఇంతకాలం లాక్‌డౌన్‌తో రోడ్లపైకి జనం ఇష్టం వచ్చినట్లుగా రాకుండా పోలీసులు చేసిన కృషి వల్లనే కరోనాను కట్టడి చేయగలిగాం. ఇప్పటికీ వారు గతంలో కన్నా మరింత అప్రమత్తంగా తమ విధులను నిర్వహిస్తున్నారు. రోడ్డువిూద పోలీసులు, ఆస్పత్రుల్లో వైద్యులు, ఇతర పారామెడికల్‌ సిబ్బంది చేస్తున్న కృషిని మనమంతా అభినందించాలి. అయితే ఇప్పుడు ఈ రెండు విభాగాల సిబ్బందిని గుర్తించి ప్రభుత్వాలు వారికి అన్ని రకాలు సౌకర్యాలు కల్పించాలి. పిపిఇ కిట్లు, మాస్కులు, రక్షణ కవచాలు, తగిన వసతులు కల్పించాలి. వైద్యరంగానికి అసవరమైన ఏర్పాట్లు చేయాలి. ఆస్పత్రులను బలోపేతం చేయాలి. అదే క్రమంలో ప్రైవేట్‌ ఆస్పత్రుల దోపిడీపై కేంద్ర రాష్ట్రాలు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు.

వైద్యులు వరుస డ్యూటీలతో తీవ్రంగా అలసి పోతున్నారు. అలాగే వారికి సేదదీరే సమయం ఇవ్వాలి. వంతుల వారీగా డ్యూటీలు వేయాలి. వైద్యులు మరీ అలసిపోకుండా చూసు కోవాలి. వారికి సమయానికి ఆహారం, నిద్ర అందేలా చూడాలి.పోలీస్‌, వైద్య విభాగాలు అలసిపోకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. అయితే ఇదే దశలో వారు కరోనా బారిన పడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి. మహారాష్ట్ర, తెలంగాణ,ఎపి సహా అనేక రాష్ట్రాల్లో వైద్యులు, పోలీసులు కరోనా బారిన పడ్డారు. వందలాదిమంది మరణించారు. ఈ ఘటనలు ఆందోళన కలిగించేవిగా ఉన్నాయి. లాక్‌డౌన్‌ సడలింపులతో ప్రజలు గుంపులుగా తిరగడం వల్ల ఒకరినుంచి మరొకరికి సంక్రమిస్తున్నందున దూరం పాటించాలని కోరుతున్నా జనంలో ఇంకా చైతన్యం రావడం లేదు.

జనం మార్కెట్లపై ఎగబడేందుకు అదేపనిగా బయటకు రాకుండా చూసుకోవాలి. ఇకపోతే కరోనా అన్నది కనీవినీ ఎరుగని కొత్త వైరస్‌ కావడంతో దీని వ్యాప్తి జరగకుండా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు అనుగుణంగా మనం నడచుకోవాలి.భూకంపమో సునావిూయో వరదలో క్షామమో అయితే దాని ప్రభావం కొన్ని ప్రాంతాలకే పరిమితం అవుతుంది. తరవాత కేవలం సహాయక చర్యలతో సరిపోతుంది. కానీ కరోనా మనిషి నుంచి మనిషికి తెలియకుండా వ్యాప్తి చెందే మహమ్మారి కనుక నిర్లక్ష్యం వహిస్తే ఊళ్లకు ఊళ్లు శ్మశానాలుగా మారిపోయే ప్రమాదం ఉంది. గతంలో వచ్చిన గత్తర, మశూచి లాంటి ప్రమాదాల కంటె ఇది భిన్నమైనదే గాకుండా ప్రమాదకరమైనది కావడంతోనే ఇంతగా అప్రమత్తంగా ఉండాల్సిన ఆగత్యం ఏర్పడిరది.

ఇది లోకాన్ని మొత్తంగా తుడిచిపెట్టేసే మహమ్మారి. అభివృద్ధి చెందిన దేశాలనే అల్లల్లాడిస్తోంది. మూడో దశలోకి భారతదేశం ప్రవేశించకుండా చూడాలని కేంద్ర ప్రభుత్వం, వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు తీవప్రయ త్నాలు చేస్తున్నాయి. ఆ దశలోకి ప్రవేశించడం అంటూ జరిగితే, దానంత దుస్థితి భారతదేశానికి మరొకటి ఉండదన్న హెచ్చరికలు ఉన్నాయి.రెండోదశలో ఉన్న దశలో ఇప్పుడు దానిని అదుపు చేసేందుకు తీవ్రంగా కృషి జరుగుతోంది. దేశమంతా వ్యాపించిన ఈ దశలో నివారణకు మాత్రమే మార్గాలు ఉన్నాయి. అందువల్ల అటు వైద్యులు, ఇటు పోలీసులు కృషిని అభినందిస్తూ వారికి మద్దతుగా మనమంతా జాగ్రత్తలు పాటించాలి. కరోనా వైరస్‌ను విశ్వవ్యాప్త మహమ్మారిగా పరిగణిస్తూ ప్రపంచ ఆరోగ్యసంస్థ ఇప్పటికే ప్రకటించింది. పకడ్బందీ చర్యలు అవసరని, అప్రమత్తంగా ఉండాలని ప్రపంచ దేశాలను ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది.

ఇంతటి తీవ్రతలోనూ రక్షణ చర్యలు తీసుకుంటే ఫర్వాలేదు. కానీ విచ్చలవిడిగా తిరిగితే ఇక ఆదుకునేందుకు ప్రభుత్వం కూడా ముందుకు రాకపోవచ్చు. వైద్యం చేయడానికి ఆస్పత్రులు, డాక్టర్లు సరిపోకపోవచ్చని ఇటీవలి వ్యాప్తి రుజువు చేసింది. బెడ్డు దొరకడం అన్నది గగనంగా మారింది. ఈ దశలో కరోనాతో పోరాడుతున్న వైద్యులు, సిబ్బంది ,పోలీసుల ప్రాణాలకు మాత్రమే ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంటుంది. కరోనా కట్టడి ఒక ఎత్తయితే వైద్య పరంగా ప్రభుత్వాలు మరిన్ని చర్యలు తీసుకుని వైద్యరంగాన్ని బలోపేతం చేయాలి.

Related News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *