రైతు చట్టాల రద్దు వెనుక రహస్యం

 రైతు చట్టాల రద్దు వెనుక రహస్యం

భూమిపుత్ర,సంపాదకీయం :

ఏడాదిన్నర కాలంగా రైతులు ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేస్తున్నారు. ఢిల్లీ ని ముట్టడించారు. ఆకలికి అలమటించారు. చలికి చనిపోయారు. లాఠీ దెబ్బలతో ఒళ్లు హూనం చేసుకున్నారు. అయినా, కేంద్రం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకునే వరకూ విశ్రమించేది లేదంటూ రైతులు ధర్నాలు చేస్తున్నారు. ఆందోళన చేస్తున్నదంతా దేశద్రోహులంటూ, కలిస్తాన్‌ ఉగ్రవాదులంటూ ఎదురుదాడి చేశారే కానీ, రైతులను కనీసం మనుషులుగా కూడా చూడలేదు కేంద్ర పాలకులు. అలాంటిది.. ఇప్పుడు సడెన్‌గా.. కార్తీక పౌర్ణమి ఉదయాన.. స్వయంగా మోదీనే దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడటం.. మూడు వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకుంటామని ప్రకటించడం.. పనిలో పనిగా క్షమాపణలు కూడా చెప్పడం ఒకింత ఆశ్చర్యమే. మోదీ దిగిరావడం వెనుక రహస్యం జరగబోయే ఎన్నికలేనని విశ్లేషకుల అభిప్రాయం.

త్వరలో జరగబోవు యూపీ, పంజాబ్‌తో సహా.. ఐదు రాష్ట్రాల ఎన్నికల భయమే మోదీ వెనకడుగు వేసేలా చేసిందంటున్నారు. సాగు చట్టాలే కాదు.. ఇటీవల ఎవరూ అడక్కపోయినా పెట్రోల్‌, డీజిల్‌ ధరలను తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు మోదీ. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో, పలు నియోజక వర్గాల్లో జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీకి చావు దెబ్బ తగలడంతో వెంటనే నష్ట నివారణకు పెట్రో ధరలు తగ్గించారని అన్నారు. ధరల ప్రభావం రాబోవు ఎన్నికల్లో పడకుండా అలా కాస్త మేనేజ్‌ చేశారని భావించారు. పెట్రో రేట్లు తగ్గించినా.. కేంద్రంపై, బీజేపీపై ప్రజావ్యతిరేకత ఏమాత్రం తగ్గలేదని నివేదికలు రావడంతో ప్రధాని మోదీ మరోమెట్టు దిగొచ్చారు. ఏడాదిగా రైతు ఆందోళనలను అణచివేస్తూ వస్తున్న ప్రభుత్వం.. ఆ రైతులకు క్షమాపణలు చెబుతూ.. మూడు వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకుంది.

ఇలా చేయకపోతే వచ్చే ఏడాది తొలినాళ్లలో జరగబోవు ఉత్తరప్రదేశ్‌, పంజాబ్‌, ఉత్తరాఖండ్‌, మణిపూర్‌, గోవా రాష్ట్రాల్లో ఘోర పరాభవం తప్పదనే భయంతోనే మోదీ ఇలా తలవంచారని చెబుతున్నారు. దేశంలోకే అతిపెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్‌. అక్కడి ఎన్నికల ప్రభావం ఢిల్లీ రాజకీయాలపై తీవ్రంగా ఉంటుంది. సంఖ్యా పరంగా యూపీలో ఎవరిది పైచేయి అయితే.. కేంద్రంలో ఆ పార్టీదే ఆధిపత్యం అంటారు. అయితే, లఖింపూర్‌ ఖేరీ ఘటన బీజేపీని ప్రజాబోనులో దోషిగా నిలబెట్టింది. కేంద్రమంత్రి అజయ్‌మిశ్రా తనయుడు ఆందోళన చేస్తున్న రైతులను కారుతో గుద్దేసి.. 8 మంది మరణానికి కారణమవడంపై అన్ని రాష్ట్రాల రైతులు బీజేపీపై ఆగ్రహంతో రగిలిపోతున్నారు. ఆ రైతులంతా కన్నెర్ర జేస్తే.. వచ్చే ఎన్నికల్లో బీజేపీ మాడిమసైపోతుందని మోదీ భయపడినట్టున్నారు. అందుకే, వ్యవసాయ చట్టాలపై వెనక్కి తగ్గారని భావిస్తున్నారు. ఢిల్లీ శివార్లలో దీక్ష చేస్తున్నదంతా పంజాబ్‌ రాష్ట్ర రైతులే.

మరికొన్ని నెలల్లోనే ఆ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. యూపీలోనూ ఈసారి అసెంబ్లీ సమరం హోరాహోరీగా సాగనుందని అంటున్నారు. ఇలా పంజాబ్‌, యూపీలో బీజేపీకి వ్యతిరేక గాలులు వీస్తుండటం.. ప్రధానంగా రైతుల వల్లే భారీ నష్టం రానుందని నివేదికలు చెబుతుండటంతో.. మోదీ నష్ట నివారణ చర్యలకు దిగారని తెలుస్తోంది. యూపీ, పంజాబ్‌ ఎన్నికల భయంతోనే అర్జెంటుగా వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నట్టు ప్రకటించారని చెబుతున్నారు. ఏడాదిగా ఎంత ఉధృతంగా రైతులు ఉద్యమిస్తున్నా ఏమాత్రం కనికరం చూపని కేంద్రం.. ఎలాంటి చర్చ జరగకుండా పార్లమెంట్‌లో సాగు చట్టాలను ఆమోదించారు. ఈ చట్టాలపై ఉత్తరాది రైతులు పోరుబాట పట్టారు.

ప్రాణాలను సైతం లెక్క చేయక వారు ఢిల్లీ శివార్లలోనే ఉన్నారు. వారిపై ఖలిస్థాన్‌ ముద్ర వేశారు. జీపులతో తొక్కించారు. వారికి కనీస అవసరాలు అందకుండా చేయాల్సినవనన్నీ చేశారు. అయినప్పటికీ వారు వెనక్కి తగ్గలేదు. ప్రాణాలు పోయినా తాము వెనక్కి తగ్గబోమని ప్రకటించారు. రైతుల ఆందోళనలతో దిగొచ్చిన ప్రభుత్వం.. మూడు సాగు చట్టాలను రద్దు చేసేందుకు నిర్ణయించింది. సరిహద్దుల్లో ఆందోళన చేస్తున్న రైతులందరూ ఉద్యమాన్ని విరమించి.. తిరిగి తమ ఇళ్లకు వెళ్లాలని కోరుతున్నానని.. ఇబ్బంది పెట్టినందుకు క్షమించాలని మోడీ విజ్ఞప్తి చేశారు. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో .. ఆ తర్వాత కూడా ఈ వ్యవసాయ చట్టాల ప్రభావం తీవ్రంగా ఉంటుందన్న సూచనలు రావడంతో మోడీ సాగు చట్టాలపై వెనక్కి తగ్గినట్లుగా తెలుస్తోంది. యూపీ, పంజాబ్‌ లాంటి చోట్ల బీజేపీ పరిస్థితి పడిపోతే.. అది వచ్చే పార్లమెంట్‌ ఎన్నికల్లో తీవ్ర ప్రభావం చూపుతుంది.

అదే జరిగితే బీజేపీ మళ్లీ అధికారంలోకి రావడం కల్ల. అందుకే ముందుకెళ్లడం కన్నా తగ్గడం మంచిదన్న అభిప్రాయంతో మోడీ వెనక్కి తగ్గినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఆ వ్యవసాయచట్టాలు అమల్లో లేవు. సుప్రీంకోర్టులో విచారణ సందర్భంగా అమలు వాయిదా వేస్తున్నట్లుగా ప్రకటించారు. ఎవరు ఎంత చెప్పినా కేంద్రం వినలేదు. హఠాత్తుగా మనసు మార్చుకోవడానికి ఎన్నికల ఫలితాల భయమే కారణమని అంచనా వేస్తున్నారు.ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలు వచ్చే సరికి.. ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన మూడు చట్టాలను తూచ్‌ అంటూ తీసిపారేయడం.. రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే అనేందుకు నిదర్శనం అంటున్నారు. ఈ సంఘటనలన్నింటినీ విశ్లేషించుకుంటే గెలిచింది రైతులు కాదు.. ఎన్నికలు ఓటర్లు మాత్రమే.

Related News

Leave a Reply

Your email address will not be published.