ఈటల రాజీనామా ఆమోదం

 ఈటల రాజీనామా ఆమోదం

వేడెక్కనున్న హుజురాబాద్ రాజకీయం

తెలంగాణా రాష్ట్రంలో తొలిసారి ఎమ్మెల్యే రాజీనామా

భూమిపుత్ర,హైదరాబాద్‌ :

మాజీమంత్రి ఈటల రాజేందర్‌ రాజీనామాను శాసనసభ సభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఆమోదించారు. హుజూరాబాద్‌ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ శనివారం ఉదయం తన శాసనసభ్యత్వానికి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను స్పీకర్‌ కార్యాలయంలో సమర్పించారు. ఆ సమయంలో స్పీకర్‌ అక్కడ లేరు. అయితే రాజీనామా చేసిన తరవాత వెంటనే ఆయన రాజీనామాను ఆమోదిస్తున్నట్లు స్పీకర్‌ కార్యాలయం ప్రకటించింది. రాజీనామా లేఖను ఆమోదిస్తూ స్పీకర్‌ నిర్ణయం వెలువరించారు.ఈ క్రమంలో హుజూరాబాద్‌ సీటు ఖాళీ అయినట్లు అసెంబ్లీ కార్యదర్శి ఈసీకి సమాచారం ఇచ్చారు. అంతకు క్రితమే భూకబ్జా ఆరోపణలతో ఈటలను మంత్రి పదవినుంచి ప్రభుత్వం బర్తరఫ్‌ చేసిన సంగతి తెలిసిందే.

బర్తరఫ్‌ చేయడంతో టీఆర్‌ఎస్‌ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి ఈటల రాజీనామా చేశారు. మాసాయిపేట, దేవరయాంజల్‌, రావల్‌కోల్‌లో అసైన్డ్‌ భూములు, దేవాదాయ భూములను ఆక్రమించుకున్నట్లుగా ఈటలపై ఆరోపణల దరిమిలా ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ఈ క్రమంలో ఈటెల ఎమ్మెల్యే పదవి కూడా రాజీనామా చేశారు. మాజీమంత్రి ఈటల రాజేందర్‌ ఎమ్మెల్యే పదవికి మూడోసారి రాజీనామా చేశారు. ఆయన రాజీనామాతో హుజూరాబాద్‌ రాజకీయాలు మరింత వేడెక్కాయి. ఈటల రాజీనామాపై స్పీకర్‌ పోచారం శ్రీనివాసరెడ్డి వేగంగా స్పందించారు. శనివారం ఉదయం 11:30 గంటలకు అసెంబ్లీ లో కార్యదర్శికి ఈటల రాజీనామా పత్రాన్ని ఇచ్చారు. కేవలం గంటన్నర వ్యవధిలో ఈటల రాజీనామాను స్పీకర్‌ ఆమోదించారు.

హుజురాబాద్‌ నియోజకవర్గం ఖాళీ చూపుతూ అసెంబ్లీ కార్యదర్శి నోటిఫికేషన్‌ విడుదల చేశారు. సమాచారాన్ని కేంద్ర ఎన్నికల సంఘానికి అసెంబ్లీ కార్యదర్శి ఇచ్చారు.తెలంగాణ ఏర్పాటు తరువాత ఏడేళ్లల్లో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన తొలి టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌గా నిలిచారు. పదవీకాలం ఉండగానే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడం ఇది మూడోసారి. టీఆర్‌ఎస్‌ స్థాపించిన తర్వాత ఏడాదికి ఆ పార్టీలో చేరి ఉద్యమస్పూర్తిని ప్రదర్శిస్తూ పార్టీ అధినేత కేసీఆర్‌కు నమ్మినబంటుగా ఈటల ఎదిగారు. హైదరాబాద్‌, గజ్వేల్‌ ప్రాంతాల్లో ఉద్యమాల్లో పనిచేస్తున్న ఆయనను స్వంత నియోజకవర్గమైన కమలాపూర్‌కు వెళ్ళి పార్టీ బాధ్యతలను చేపట్టాల్సిందిగా కేసీఆర్‌ ఆదేశించారు. ఆమేరకు తన సొంత నియోజకవర్గమైన కమలాపూర్‌కు వచ్చిన ఈటల రాజేందర్‌ టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా 2004లో అక్కడి నుంచి పోటీ చేశారు.

మాజీ మంత్రి ముద్దసాని దామోదర్‌రెడ్డిని ఓడించి జిల్లాలోనే కాకుండా రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారారు.ఆ తర్వాత ఉద్యమ సందర్భాల్లో పార్టీ ఆదేశాల మేరకు 2008, 2010లో రాజీనామాచేసి ఉప ఎన్నికల్లో పోటీచేసి మరోసారి ఎమ్మెల్యేగా విజయాన్ని సాధించారు. ఆ తర్వాత 2009లో శాసనసభ నియోజకవర్గాల పునర్విభజన జరిగి కమలాపూర్‌ నియోజకవర్గం రద్దయింది. కొత్తగా హుజూరాబాద్‌ కేంద్రంగా నియోజకవర్గం ఏర్పడిరది. అప్పటి నుంచి వరుసగా నాలుగు సార్లు హుజురాబాద్‌ శాసనసభ్యుడిగా గెలుపొందారు. వరుసగా ఆరుసార్లు అసెంబ్లీకి ఎన్నికైన రికార్డును సాధించిన ఈటల రాజేందర్‌ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014లో కేసీఆర్‌ మంత్రివర్గంలో ఆర్థిక, పౌరసరఫరాల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత 2019లో కేసీఆర్‌ రెండో మంత్రివర్గంలో వైద్య ఆరోగ్యశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు.

Related News

Leave a Reply

Your email address will not be published.