వరుసగా రెండో ఏడూ మారనున్న విద్యాసంవత్సరం!!

 వరుసగా రెండో ఏడూ మారనున్న విద్యాసంవత్సరం!!

భూమిపుత్ర ,అమరావతి:

కరోనా నేపథ్యంలో పాఠశాల విద్యాశాఖ అకడమిక్‌ క్యాలెండర్‌ మారిపోయింది. వరుసగా రెండో యేడు కూడా పిల్లలకు స్కూళ్లకు పోయే అవకాశం లేకుండా పోయింది. ప్రతీ ఏటా జూన్‌ 12న పాఠశాలలు ప్రారంభమవుతాయి. కరోనా వైరస్‌ సెకండ్‌వేవ్‌ వల్ల విధించిన కర్ఫ్యూతో ఈ ఏడాది క్యాలెండర్‌ అర్థాంతరంగా ముగిసింది. దీంతో పాఠశాలు ఎప్పుడు మొదలవుతాయా అని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఎదురుచూస్తున్నారు. జూన్‌ నాటికి సాధారణ పరిస్థితులు నెలకొంటే తప్ప పాఠశాలలు ప్రారంభించడం కుదరక పోవచ్చు. లేదంటే అకడమిక్‌ క్యాలెండర్‌ను ఈ ఏడాదికి మార్చాలని ప్రభుత్వం భావిస్తోంది. అయితే ఇప్పటికిప్పుడు పిల్లలను స్కూళ్లకు పంపేది లేదని తల్లిదండ్రులు కూడా భావిస్తున్నారు. పిల్లలను చదువు కోసం పంపి కరోనా బారిన పడేయలేమని అన్నారు. ఈ విద్యాసంవత్సరం ఆగస్టు 2021 నుంచి 2022 ఏప్రిల్‌ వరకు నిర్వహించాలని పలువురు సూచిస్తున్నారు. కరోనా కష్టాల కారణంగా పాఠశాల విద్యాశాఖ క్యాలెండర్‌ మార్పు తప్పకపోవచ్చు. అయితే ఎప్పటి నుంచి ఉంటుందో ప్రభుత్వమే నిర్ణయించాలని విద్యాశాఖ ఉన్నతాధికారులు చెబుతున్నారు. ప్రతి ఏటా ఈ సమయానికి పాఠ్య పుస్తకాలను ముద్రించి పాఠశాలలకు పంపించడం ప్రారంభమ లవుతుంది. కానీ వరుసగా రెండేళ్లుగా సంక్షోభంలో కొట్టుమిట్టాడాల్సి వస్తోంది. దీంతో అకడమిక్‌ క్యాలెండర్‌ మార్పు ఖాయమని కిందిస్థాయి అధికారులు భావిస్తున్నారు.

ప్రతి ఏటా జూన్‌ 12 నుంచి ఏప్రిల్‌ 24 వరకు సెలవులు పోనూ 220 పని దినాలు ఉండాని రాష్ట్రవిద్యా పరిశోధన మండలి (ఎస్‌సిఈఆర్‌టి) నిర్ణయించేది. ఆగస్టు నుంచి ఏప్రిల్‌ 30 వరకు ఉంటే దసరా, దీపావళి, సంక్రాంతి సెలవులతో పాటు రెండో శనివారం, ఇతర సెలవులను కూడా కుదించాల్సి వస్తుందని అధికారులు చెబుతున్నారు. అదేవిధంగా పనిదినాలు కూడా తగ్గించాల్సి వస్తుందని అంటున్నారు. దీనిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న తరువాతే తాము క్యాలెండర్‌ రూపొందించగలమని ఉన్నతాధికారులు చెబుతున్నారు. ప్రస్తతం కరోనా ఉధృతి తగ్గితే వచ్చే ఆగస్టులో మాత్రమే విద్యా సంవత్సరం మొదలు కావచ్చని అంటున్నారు. అదికూడా కరోనా తగ్గుదలను బట్టి, కేంద్రం ఇచ్చే ఆదేశాల మేరకు ఉండొచ్చంటున్నారు.

Related News

Leave a Reply

Your email address will not be published.