రాజకీయాలకు దూరంగా రాజనరసింహ

 రాజకీయాలకు దూరంగా రాజనరసింహ

భూమిపుత్ర, హైదరాబాద్‌:

కాంగ్రెస్‌ పార్టీ తో ఐదు దశాబ్దాల అనుబంధం దామోదర రాజనర్సింహది. తండ్రి వారసత్వంగా రాజకీయల్లోకి వచ్చిన ఆయన అనేక పదవులు చేపట్టారు. కానీ కొంత కాలంగా కాంగ్రెస్‌ లో నిశ్శబ్దంగా ఉంటున్నారు. పార్టీ కార్యక్రమాలకు కూడా పూర్తిగా దూరంగా ఉంటున్నారు. తన నియోజకవర్గంలో కూడా పెద్దగా పర్యటించడం లేదు. కాంగ్రెస్‌ లో జరుగుతున్న పరిణామాలు ఆయనను కలచి వేశాయని కొందరు సన్నిహితులు చెబుతున్నారు.దామోదర రాజనర్సింహ మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. రెండు సార్లు మంత్రిగా పనిచేశారు. నల్లారి కిరణ్‌ కుమార్‌ రెడ్డి హయాంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ లో ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారు. దళిత నేతగా పేరున్న దామోదర రాజనర్సింహ వరసగా రెండు పర్యాయాలు ఓటమి పాలయ్యారు. తనకు పట్టున్న నియోజకవర్గమైన ఆంథోల్‌ నుంచి ఆయన వరస పరాజయాలు ఇబ్బంది పెట్టాయంటున్నారు.మరోవైపు కాంగ్రెస్‌ పరిస్థితి కూడా రాష్ట్రంలో ఏమాత్రం బాగా లేదు.

ఏ ఎన్నిక జరిగినా ఓటమి తప్ప విజయం అన్నది దక్కడం లేదు. అందుకే దామోదర రాజనర్సింహ ఇటీవల జరిగిన నాగార్జున సాగర్‌ ఉప ఎన్నిక ప్రచారానికి కూడా దూరంగా ఉన్నారని తెలిసింది. కాంగ్రెస్‌ లో సీనియర్‌ అయిన తనను పట్టించుకోవడం లేదన్న అసంతృప్తితో దామోదర రాజనర్సింహ ఉన్నారు. పీసీసీ అధ్యక్ష పదవి విషయంలోనూ తన పేరు వినపడక పోవడం ఆయనను మరింత అసంతృప్తికి గురిచేసింది.గత ఎన్నికల సమయంలో ఆయన సతీమణి బీజేపీలోకి వెళ్లడం, తిరిగి రావడం కూడా దామోదర రాజనర్సింహను రాజకీయంగా ఇబ్బంది పెట్టాయని చెప్పకతప్పదు. అందుకే దామోదర రాజనర్సింహ రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. రాజకీయాలకు పూర్తిగా స్వస్తి చెప్పడమే మేలని ఆయన భావిస్తున్నట్లు తెలిసింది. జానారెడ్డి బాటలోనే దామోదర రాజనర్సింహ కూడా రాజకీయ సన్యాసం తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలుస్తోంది.

Related News

Leave a Reply

Your email address will not be published.