వదల బొమ్మాళి అంటున్న ఒమిక్రాన్

 వదల బొమ్మాళి అంటున్న ఒమిక్రాన్

భూమిపుత్ర,సంపాదకీయం:

మనమంతా మరింత అప్రమత్తంగా ఉండాలని కరోనా కొత్త వేరియంట్‌ మరోమారు మనలను హెచ్చరి స్తోంది. ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. నేను మళ్లీ బలపడి వస్తున్నానని మనలను హెచ్చరిస్తోంది. అజాగ్రత్తగా ఉంటే మింగేస్తానంటూ హుంకరిస్తోంది. కొత్త వేరియంట్‌ ఇప్పుడు ప్రపంచ దేశాలకు కునుకు లేకుండా చేస్తోంది. వైద్యనిపుణులు కూడా మరోమారు ప్రజలను తీవ్రంగా హెచ్చరిస్తున్నారు. మాస్కులు ధరించడం, భౌతికదూరం పాటించడం, సమూహాల్లో తిరగకపోవడం, శానిటైజ్‌ చేసుకోవడం వంటివి నిత్యకృత్యం కావాలని సూచిస్తున్నారు. పాశ్చాత్య దేశాల్లో విచ్చలవిడితనం మరోమారు మనలను అప్రమత్తం చేసిందని భావించాలి. ఈ రకమైన జాగ్రత్తలు తీసుకోకుంటే సెకండ్‌వేవ్‌ కన్నా దారుణంగా పరిస్థితులు పరిణమించినా ఆశ్చర్య పడాల్సిన పనిలేదు. ఈ క్రమంలో ప్రయాణాలను రద్దుచేసుకోవడం మంచిదని హచ్చరిస్తున్నారు. గతంలో కన్నా మరింత అప్రమత్తంగా ఉంటూ మనలను మనం కాపాడుకునే ప్రయత్నాలు చేయాలి.

ప్రభుత్వం కూడా మరోమారు బహిరంగ హెచ్చరికలు జారీ చేయాలి. ప్రజలను నిరంతరంగా హెచ్చరిస్తూ జాగ్రత్తగా ఉండే ప్రచారాలకు ప్రాధాన్యం ఇవ్వాలి. అప్పుడే ముప్పును కొంతయినా నివారించగలం. ఇకపోతే దక్షిణాఫ్రికాలో ఇటీవల వెలుగుచూసిన ’బీ.1.1.529’ వేరియంట్‌ శాస్త్రవేత్తలను కలవరపెడుతున్నది. ఇంతవరకూ చూడనటువంటి తీవ్రమైన వేరియంట్‌గా చెబుతున్న ఈ కొత్త రకం ఎక్కడ నుంచి వచ్చింది.. దీని ప్రభావమెంత.. వ్యాక్సిన్లకు లొంగుతుందా లేదా అన్న చర్చ సాగుతోంది. వేరియంట్‌ ఉందో లేదో తెలుసుకోడానికి నమూనాల జన్యు విశ్లేషణను ఇన్సాకాగ్‌ వేగిరం చేసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ చెప్పింది. తాజా పరిణామాల నేపథ్యంలో మళ్లీ దేశాల మధ్య దారులు మూసుకుపోతున్నాయి. రాత్రికిరాత్రే విమాన సర్వీసులు రద్దవుతున్నాయి. క్వారంటైన్‌ నిబంధనలు మళ్లీ మొదలవుతున్నాయి. తాజా పరిణామలతో శీతాకాలం ముంగిట కేసులు పెరుగుతూ ఉలికి పడుతున్న యూరోపియన్‌ యూనియన్‌ లోని దేశాలు.. మరింత అప్రమత్తం అవుతున్నాయి.

దక్షిణాఫ్రికా, నవిూబియా తదితర ఆఫ్రికా దక్షిణ ప్రాంతంలోని 11 దేశాల నుంచి విమానాలను నిలిపివేసే ప్రతిపాదనపై ఈయూ తమ సభ్య దేశాలతో చర్చిస్తోంది. విమానయాన సంస్థలు దక్షిణాఫ్రికా నుంచి తమ దేశస్థులను మాత్రమే తీసుకురావాలని, టీకా తీసుకున్నా, తీసుకోక పోయినా అక్కడి నుంచి వచ్చినవారు 14 రోజులు క్వారంటైన్‌లో ఉండాలని స్పష్టం చేస్తోంది. ఆఫ్రికా దేశాల్లో ఉన్నవారు తమ దేశానికి రావడాన్ని ఇటలీ నిషేధించింది. బ్రిటన్‌, సింగపూర్‌, మలేషియా, జపాన్‌, ఇజ్రాయెల్‌ ముందుజాగ్రత్తగా దక్షిణాఫ్రికా, బోట్స్వానా, నవిూబియా, జింబాబ్వే, ఎస్వతిని, లెసొతో దేశాల విమాన సర్వీసులపై తాత్కాలిక నిషేధాన్ని ప్రకటించాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ సాంకేతిక సలహా బృందం శుక్రవారం అత్యవసరంగా సమావేశమై కొత్తగా దూసుకుని వస్తోన్న బి.1.1.529 వేరియంట్‌కు ’ఒమైక్రాన్‌’ అని పేరుపెట్టింది. దాన్ని ’వేరియంట్‌ ఆఫ్‌ కన్సర్న్‌’గా ప్రకటించింది. బి.1.1.529 వేరియంట్‌ను నిశితంగా పరిశీలిస్తున్నామని సార్స్‌కొవ్‌`2పై భారత జీనోమిక్స్‌ కన్సార్షియం తెలిపింది. దక్షిణాఫ్రికాలో వెలుగుచూసిన కొవిడ్‌ కొత్త వేరియంట్‌ ప్రపంచ దేశాల వెన్నులో వణుకు పుట్టిస్తోంది. కొన్ని వారాలుగా దక్షిణాఫ్రికాలో రోజూ 200 పైచిలుకు కేసులు నమోదవుతున్నాయి.

అకస్మాత్తుగా ఈనెల 25న 2,465 కేసులు నిర్దారణ అయ్యాయి. కరోనా ఉధృతి ఎక్కువగా ఉన్న గ్వాటెంగ్‌ ప్రావిన్స్‌ పరిధిలోని రోగుల నుంచి శాంపిళ్లను సేకరించి పరీక్షించగా కొత్త వేరియంట్‌ను గుర్తించారు. ఇప్పటివరకు దక్షిణాఫ్రికాలో ఈ వేరియంట్‌ కేసులు 100 పైగా బయటపడగా, పొరుగుదేశం బోత్సవానాలో నలుగురికి సోకింది. దక్షిణాఫ్రికా నుంచి హాంకాంగ్‌కు వచ్చిన ఇద్దరు పర్యాటకుల్లోనూ గుర్తించారు. మరో ఆఫ్రికా దేశం మలావీ నుంచి వచ్చిన పౌరుడికి కొత్త వేరియంట్‌ సోకినట్లు నిర్దారణ అయిందని ఇజ్రాయెల్‌ ప్రకటించింది. బెల్జియంలోనూ ఓ కేసు తేలింది. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన భారత్‌.. దక్షిణాఫ్రికా, బోట్వ్సానా, హాంకాంగ్‌ నుంచి వచ్చే ప్రయాణికులకు పకడ్బందీగా స్క్రీనింగ్‌ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. విమానాశ్రయాల్లో పాజిటివ్‌ నిర్దారణ అయ్యే వారి శాంపిళ్లను జన్యుక్రమ విశ్లేషణ కోసం ఎప్పటికప్పుడు ల్యాబ్‌లకు పంపాలని నిర్దేశిస్తూ రాష్టాల్రు, యూటీలకు కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్‌ భూషణ్‌ లేఖ రాశారు. కొత్త వేరియంట్‌.. డెల్టా వేరియంట్‌ కంటే ప్రమాదకరమైందనే ప్రచారం జరుగుతోంది. అయితే మనదేశంలో ఈ వేరియంట్‌ కేసులు బయటపడలేదని చెప్పింది.

అంతర్జాతీయ ప్రయాణికుల్లో ఎవరికైనా పాజిటివ్‌ వస్తే అది కొత్త వేరియంటా కాదా అన్నది విశ్లేషించుకుని ముందుకు సాగాలి. ప్రస్తుత వ్యాక్సిన్లన్నీ వైరస్‌ స్పైక్‌ ప్రొటీన్‌ను లక్ష్యంగా చేసుకొని పనిచేసేవే. స్పైక్‌ ప్రొటీన్‌లో పెద్దసంఖ్యలో ఉత్పరివర్తనాలు జరిగిన ఈ కొత్త వేరియంట్‌ వ్యాక్సిన్ల కు లొంగని జగమొండిగా మారే అవకాశాలు ఉన్నాయా అనే కోణంలోనూ పరిశోధనలను ముమ్మరం చేశారు. ఇంకొన్ని వారాల తర్వాతే ఈవిషయమై స్పష్టత రావచ్చు. ఇప్పటివరకు తాము చూసిన వాటిలో ఈ వేరియంట్‌నే ప్రమాదకరమైనదిగా పేర్కొన్న యూకే.. అత్యవసర పరిశోధనలు చేస్తామని ప్రకటించింది. రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్న హెచ్‌ఐవీ రోగిలో ఈ కరోనా వేరియంట్‌ ఉత్పరివర్తనాలకు గురై ఉండొ చ్చని భావిస్తున్నారు. వ్యాప్తి వేగం ఎక్కువగా ఉండటం, స్పైక్‌ ప్రొటీన్‌లో ఎక్కువ సంఖ్యలో మ్యుటేషన్ల దృష్ట్యా అయివుండవచ్చని పరిశోధకులు భావిస్తున్నారు. ఈ క్రమంలో ఎలాంటి వేరియంట్‌ను అయినా మాస్కుతో నిరోధించవచ్చని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎన్ని వేరియంట్లు వచ్చినా మాస్కులు ధరించడం ద్వారా నిరోధించవచ్చన్నారు. ఈ క్రమంలో మనమంతా జాగ్రత్తలు తీసుకుంటే ప్రమాదం రాకుండా నిరోధించగలిగిన వారమవువుతాం. లేకుంటే కొత్తముప్పులో కొట్టుకుపోతాం.

Related News

Leave a Reply

Your email address will not be published.