కరోనాతో పర్యావరణానికి ముప్పే!!

 కరోనాతో పర్యావరణానికి ముప్పే!!

భూమిపుత్ర, సంపాదకీయం:

కరోనాతో ప్లాస్టిక్‌ వాడకం కూడా పెరిగింది. కేన్సర్‌ వ్యాధి వ్యాప్తికి, వాతావరణం కాలుష్యానికి కారణమౌతున్న ప్లాస్టిక్‌పై ప్రభుత్వం నిషేధం విధించినా వాడకం మాత్రం ఆగడం లేదు. ఆస్పత్రుల్లో వ్యర్థాలు పెరిగాయి. ఇళ్లలో ప్లాస్టిక్‌ వాడకాలు పెరగడంతో గ్రామాల్లో కాలువల్లో కుప్పలుగా ప్లాస్టిక్‌ పేరుకుని పోతున్నది. కాలుష్య నివారణకు ప్రభుత్వాలు ఇన్నేళ్లుగా తీసుకున్న చర్యల కన్నా కరోనా హెచ్చరికలతోనే సత్ఫలితాలు వచ్చాయి. కరోనా లాక్‌డౌన్‌ కారణంగా కాలుష్యం తగ్గింది. నదీనదాలు స్వచ్ఛంగా కనిపించాయి. మొత్తంగా కరోనాతో మంచి ఫలితాలు వచ్చాయి. అంటే ప్రజలు బయటకు రాకుంటే కాలుష్యం తగ్గిందన్న లెక్కలు వచ్చాయి. అయితే మళ్లీ యధారాజా తథా ప్రజా అన్నందంగా మన పరిసరాలు తయారయ్యాయి. ప్రధానంగా కాలుష్య రహిత, ప్లాస్టిక్‌ రహిత భారత్‌ కోసం మనమంతా కృషి చేయాలి.

కరోనా కాలంలో ఇప్పుడు ఖాళీగా ఉండకుండా మొక్కలు నాటడంతో పాటు, ప్లాస్టిక్‌ నిషేధం కోసం మనమంతా కృషి చేయాలి. పౌరులుగా మనమంతా వ్యక్తిగత బాధ్యతతో ముందుకు సాగాలి. స్వచ్ఛభారత్‌ అమలు చేస్తున్నా గ్రామాల్లో ప్లాస్టిక్‌ వినియోగంపై నిషేధం అమలు కాకపోవడంతో తీవ్ర కాలుష్యం ఏర్పడుతోంది. ఎక్కడపడితే అక్కడ ప్లాస్టిక్‌ వ్యర్థాలను జారవిడుస్తున్నారు. దీంతో భూమిలో అది చేరి వాతావరణ కాలుష్యాన్ని పెంచుతోంది.భూసారాన్ని దెబ్బతీస్తున్న పాలిథిన్‌ వినియోగాన్ని తగ్గించాలని కోరుతున్నా అధికారులు క్షేత్రస్థాయిలో వాటి వినియోగాన్ని నియంత్రించలేక పోతున్నారు. ఇందుకు ఉద్యమ తరహా మార్పు అవసరమని పర్యావరణవేత్తలు అభిప్రాయపడుతున్నారు. గ్రామాల పరిధిలో ప్లాస్టిక్‌ వినియోగం రోజురోజుకూ పెరిగిపోతోంది. దీనికితోడు చిత్తశుద్ధి లోపించడంతో ప్రధాన రహదారుల్లో దుర్వాసన వెదజల్లుతోంది.

పట్టణ,పల్లె ప్రగతి కార్యక్రమాలు నిర్వహిస్తున్నా పెద్దగా మార్పు కానరావడం లేదు.పెళ్లిళ్లు, పండుగలు, పార్టీల్లో విచ్చలవిడిగా ప్లాస్టిక్‌ గ్లాసులు, కవర్లను వినియోగిస్తున్నారు. అయితే కరోనా దెబ్బకు ఈ సమస్య కూడా తగ్గిందనే చెప్పాలి. ఇప్పుడు శుభకార్యాలు పెద్దగా లేకపోవడంతో కొంతయినా ప్లాస్టిక్‌ వినియోగం తగ్గిందనే చెప్పాలి. రోజువారీ అవసరాల కోసం వినియోగిస్తున్న ప్లాస్టిక్‌ కవర్లను రహదారులు, ఖాళీ ప్రదేశాల్లో గుట్టలుగా పడేసి చేతులు దులుపు కుంటున్నారు. వాతావరణాన్ని కలుషితం చేసి మన ప్రాణాలను హరిస్తున్నాయన్న విషయం గుర్తించేలేక పోతున్నాం. గుట్టలు గుట్టలుగా పడిఉన్న ప్లాస్టిక్‌ వ్యర్థాలను ఆహారంగా భావించి తింటున్న పశువులు, జంతువులు మృత్యువాత పడుతున్నాయి. ప్లాస్టిక్‌ కవర్లు, గ్లాసులు, సీసాలను తరచూ వినియోగిస్తూ కేన్సర్‌ వ్యాధి సోకే లక్షణాలు అధికంగా ఉన్నాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

చిన్న పిల్లలకు కూడా సోకే అవకాశం అధిక శాతం ఉందని సూచిస్తున్నారు. వినియోగం విపరీతంగా పెరిగిపోవడంతో కాలువలు, డ్రెయిన్లు, ఖాళీ ప్రదేశాలు, డంపింగ్‌యార్డుల్లో గుట్టలు గుట్టలుగా ప్లాస్టిక్‌ కవర్లు పేరుకుని పోతున్నాయి. డిస్పోజల్‌ వస్తువుల అమ్మకాలు విపరీతంగా పెరిగినా వాటిని తగ్గించే ప్రయత్నాలు చేయడం లేదు. దీంతో పలువురు వ్యాపారస్తులు టన్నుల కొద్ది నిల్వ చేసి అమ్మకాలు సాగిస్తున్నారు. పలువురు వ్యాపారులు షాపుల ముందు, ఆరుబయట గుట్టలుగా పేర్చి విక్రయాలు నిర్వహిస్తున్నారు. ఆఖరుకు  కాఫీ హోటళ్లలో కూడా ప్లేట్లలో అరటి, ఇతర ఆకులకు బదులుగా ప్లాస్టిక్‌ కవర్లు వినియోగిస్తున్నారు. ఆహార పదార్ధాలు ప్యాకింగ్‌కు సైతం వీటిని వాడుతున్నారు. పర్యావరణానికి తీవ్ర విఘాతం కలిగిస్తున్న ప్లాస్టిక్‌ వస్తువుల నిషేధంపై జిల్లాస్థాయిలో అధికారాలు ఇచ్చారు.

అమ్మినా, కొనుగోలు చేసినా, వినియోగించినా, ఎక్కడబడితే అక్కడ వేసినా రూ.ఐదు వేల నుంచి రూ.25 వేల వరకూ జరిమానా విధిస్తారు. విక్రయ షాపులపై దాడులు చేసి వస్తువులను స్వాధీనం చేసుకోవడం, షాపులను సీజ్‌ చేయడం వారిపై కేసులు నమోదు చేసే అధికారం తహశీల్దార్లకు ఉంది. అయితే ముడుపులకు లొంగి చూసీచూడనట్లు వ్యవహ రించడం పరిపాటిగా మారిందని ప్రజలు ఆరోపిస్తున్నారు. మార్కెట్‌లో పేపర్‌ గ్లాసులు, పేపర్‌ కవర్లు, ప్లేట్లు దర్శనమిస్తున్నా వాడకం ఎక్కువగా ఉంటున్నా పట్టించుకోవడం లేదు. దీనిపై మరలా అధికారులు విస్తృత ప్రచారం చేయాల్సి ఉంది. ప్లాస్టిక్‌ నిషేధ ఆజ్ఞలు అమల్లో ఉన్నా అమలు కావడం లేదు. అధికారుల ఉదాశీనత, వినియోగదారుల అవగాహన లేమితో విచ్చలవిడిగా వినియోగం కొనసాగుతూ నే ఉంది. దీంతో టన్నుల కొద్దీ ప్లాస్టిక్‌ వ్యర్థాలు పేరుకుపోతున్నాయి. ఎక్కడ చూసినా కాలువలు, డ్రెయిన్లు వీటితో నిండి పోతున్నాయి. హరిత ఉద్యమంలాగే ప్లాస్టిక్‌ వ్యతిరేక ఉద్యమంగా సాగితే తప్ప నిషేధం అమలు జరగదని అంటున్నారు.

మొక్కల పెంపకం, అడవుల రక్షణపై ప్రభుత్వాలు పట్టుదలగా వ్యవహరిస్తేనే పర్యావరణానికి మేలు జరిగేది. దేశవ్యాప్తంగా మొక్కల పెంపకాన్ని, హరిత ఉద్యమంగా తీసు కోవాలి. అదే సందర్భంగా ప్లాస్టిక్‌ నిషేధంపైనా ప్రచారం సాగాలి. ఉన్న అడవులను అయినా రక్షించు కోవాల్సిందే. ఇష్టం వచ్చినట్లుగా అడవుల నరికివేత కారణంగా లక్షలఎకరాల అడవులు నాశనం అయ్యాయి. పోడు సమస్యకారణంగా అడవులు ఉనికి లేకుండా పోతున్నాయి. అడవులను నరకడం వల్ల పర్యావరణం దెబ్బతినడమే గాకుండా సర్వత్రా విపరీత పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తోంది. అడవులను, జంతువులను కాపాడుకుంటేనే మానవ మనుగడ సాధ్యం. లేకుంటే గాలీ,నీరు కూడా దక్కదు. అడవి జంతువులను కూడా కాపాడుకుంటే అడవులు కూడా పచ్చగా నిలబడతాయి. కలప స్మగ్లింగ్‌ను పూర్తిగా నిరోధించాలి. అడవుల నుంచి పూచికపుల్ల కూడా బయటికి పోకుండా చూడాలి. పర్యావరణ పరిరక్షణ ఉద్యమంలో ఈ విషయాలను గుర్తించి కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడిగా పనిచేస్తేనే భవిష్యత్‌ తరాలకు మంచి వాతావరణం అందగలదు.

Related News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *