ప్రాణాలు పోతున్నా పాఠాలు నేర్వకపోతే ఎలా?

 ప్రాణాలు పోతున్నా పాఠాలు నేర్వకపోతే ఎలా?

భూమిపుత్ర, సంపాదకీయం :

భారత్‌లో కరోనా వైరస్‌ విసిరిన మృత్యుపాశం ఎందరో కుటుంబాల్లో విషాదం నింపింది. వేలాది కుటంబాలు తీరని విషాదంలో ఉన్నాయి. బంధువులను,అయినవారిని కోల్పోయిన వారు ఎందరో ఉన్నారు. పిల్లలను ఒంటరిగా విడిచిపోయిన తల్లిదండ్రుల కారణంగా వారంతా అనాధలుగా మారారు. వారి కోసం తక్షణ కార్యాచరణ తీసుకోవాలని సుప్రీం గట్టిగానే కేంద్రాన్ని హెచ్చరించింది. నివేదిక ఇవ్వాలని కోరింది. పిఎం కేర్స్‌ నుంచి తక్షణ సాయంతో పాటు వారి భవిష్యత్‌కు భరోసా దక్కింది. ఇకపోతే లాక్‌డౌన్‌ నిబంధ నలు సడలించడంతో మహమ్మారి విలయతాండవం చేసింది. పాజిటివ్‌ కేసులు, మరణాలు శరవేగంగా పెరిగిపోయి ఎందరో మృత్యువాత పడ్డారు. తాజా సడలింపులతో రోడ్డెక్కిన ప్రజలు కావాలనే మృత్యు కౌగిలిని ఆహ్వానిస్తున్నారు. మనవద్ద కరోనాను ఎదుర్కొనే సన్నద్దత లేకుండా పోయిందని ఇటీవలి మరణాలు నిరూపించాయి.

కరోనా నివారణకు మందులు అస్సలు లేవు. ఆస్పత్రుల్లో సదుపాయాలు లేవు. అయినా ప్రజలు విచ్చలవిడిగా తిరగడం వల్ల ఊహించని ఉపద్రవం ఎదుర్కొన్నాం. దీనిని గుర్తించక పోవడంతో కరోనా మనపై స్వైర విహారం చేస్తోంది. దేశంలో కరోనా భూతం అడుగుపెట్టాక దాదాపు పదిహేను నెలల్లో అనేక కేసులు, మరణాలు వెలుగుచూడడంతో వేలాది కుటుంబాలు ఛిద్రమయ్యాయి. రికార్డుస్థాయిలో కేసులు, మరణాలు సంభవిస్తుండడంతో కరోనా ప్రభావిత దేశాల్లో భారత్‌ రెండో స్థానానికి చేరింది. దీనికితోడు మన ఆస్పత్రుల తీరు డొల్లగా ఉంది. స్వయంగా సుప్రీం కోర్టు దీనిని తీవ్రంగా మండిపడింది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో కరోనా రోగులతో వ్యవహరిస్తున్న తీరు దారుణంగా ఉందని సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో దీంతో అర్థమవు తోందని వ్యాఖ్యానించింది.

కరోనా పేషెంట్లకు చికిత్స అందించే విషయంలో ఆసుపత్రుల్లో తక్షణమే దిద్దుబాటు చర్యలు తీసుకోవాల్సి ఉంది. దవాఖానాల్లో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, రోగులకు అన్ని సదుపాయాలు కల్పించాలని ఆయా రాష్ట్రాల హైకోర్టులు ఆదేశించాయి. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కూడా పరిస్థితులు ఇందుకు భిన్నంగా లేవు. ఈ అనుభవాలతో ప్రభుత్వాలు చర్యలకు ఉపక్రమించాలి. థర్డ్‌వేవ్ భయం వెన్నాడుతున్న నేపథ్యంలో ఇప్పుడు ఆస్పత్రులపై ప్రభుత్వాలు సవిూక్ష చేసుకోవాలి. బ్లాక్‌ పంగస్‌ కూడా మరోవైపు భయపెడుతోంది. ఈ క్రమంలో వైద్యరంగాన్ని సంస్కరించుకోవాలి. అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగుల వివరాలు, వారికి అందిస్తున్న చికిత్స ఇతర సౌకర్యాల వివరాలు, వైద్య సిబ్బంది, మౌలిక వసతుల వివరాలను ప్రకటించాలి. ఇక ఇప్పటి వరకు కరోనాతో చనిపోయినవారి మృతదేహాల ఖననం, దహనం విషయాల్లో కూడా చర్యలు లోపభూయిష్టంగా ఉంది.

ఇలాంటి దుస్థితి ఇకముందు రాకుండా ఖచ్చితమైన ప్రణాళిక రూపొందించాల్సి ఉంది. ఈ విషయంలో కేంద్రం జారీ చేసిన నిబంధనలను పాటించడం లేదని మండిపడింది. మృతదేహాలకు ఆసుపత్రులు కనీస గౌరవం కూడా ఇవ్వడం లేదు. దేశంలో తక్కువ సంఖ్యలో కరోనా నిర్దారణ పరీక్షలు జరపడాన్ని కూడా కోర్టులు అనేక సందర్భాల్లో ప్రశ్నిస్తూ వచ్చాయి. సెకండ్‌వేవ్‌లో పరిస్థితి అత్యంత భయంకరంగా, దారుణంగా, దయనీయంగా ఉందని పరిస్థితులు నిరూపించాయి. నిజానికి ఈ దశలో అందరూ అప్రమత్తంగా ఉండాల్సి ఉన్నా ఎవరు కూడా నిబంధనలు పాటించడం లేదు. రాజకీయ నాయకులు అస్సలు పట్టించుకోవడం లేదు. అలాగే ఆస్పత్రుల్లో వసతులు పెంచలేదు. రోగులను నిజంగానే హీనంగా చూస్తున్న ఘటనలను చూశాం. చనిపోయిన వారిపట్ల కనీస మర్యాద పాటించలేదు. అంతెందుకు కరోనా పేషెంట్‌ అంటేనే ఛీత్కారంగా చూస్తున్నారు.

మన బాధ్యతగా మనం ఎంత జాగ్రత్తగా ఉంటున్నామన్నది కూడా ముఖ్యమే. మందులేని కరోనా రోగానికి ముందు జాగ్రత్తలే మందని పదేపదే ప్రచారం చేసినా ప్రజలు పెడచెవిన పెట్టిన ఫలితమే దేశంలో కరోనా సెకండ్‌వేవ్‌ విజృంభణకు కారణంగా చెప్పుకోవాలి. కరోనా పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పదేపదే వైద్యులు చెప్పారు. ప్రస్తుతం కరోనా కేసులు పెరుగుతున్నా, జాగ్రత్తలు పాటిస్తే కొన్ని నెలల్లోనే ఈ వైరస్‌ను అంతం చేయవచ్చని చెప్పినా పట్టించుకోలేదు. ఆ దిశగా ప్రజలందరికి అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. ప్రతి వ్యక్తి ఫిజికల్‌ డిస్టెన్స్‌ పాటిస్తూ మాస్కులు వాడితే కరోనా వైరస్‌ ను అరికట్టలేమని గుర్తించాలి. ఇప్పుడు ఎలాంటి లక్షణాలు కనిపించకుండానే వైరస్‌ వ్యాపిస్తోంది. ప్రజలు అదేపనిగా బయటకు వెళ్లడం వల్ల ఎవరి నుంచో వైరస్‌ అంటుకుని మన ఇంట్లో ఉండే వృద్దులకు, పిల్లలకు సోకే ప్రమాదం ఏర్పడుతోంది. అందుకే ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.

కాలంతో నిమిత్తం లేకుండా ప్రజల్లో భయాందోళనలు చివరికి మనిషికి ప్రాణాంతకం అవుతున్నాయి. అంతేకాకుండా ఇతరత్రా కూడా ప్రభావం పడుతోంది. అత్యున్నత వైద్య స్థాయి పరిశోధనలలో కరోనా ప్రభావంతో మనిషి జీవించే కాలం కనీసం 7 నుంచి 25 సంవత్సరాలు తగ్గుతుందని వెల్లడైంది. అంటే కరోనా సోకినా సోకకపోయినా వైరస్‌ వచ్చి ఏదో చేసేసి పోతుందనే తీవ్రస్థాయి భయాందోళనలతో గడిపేవారికి ఈ ఆయుర్థాయం తగ్గే ముప్పు ఉందని వెల్లడైంది. శారీరకంగా బాగా ఉండే వారిలో మానసిక స్థయిర్యం ఉండాలనే సూత్రం ఏదీ లేదు. జనాభాలో అత్యధిక సంఖ్యలో వైరస్‌ భయాలు ఎక్కువగా మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయి. దీని ప్రభావంతో చాలా కాలంగా ఈ మానసిక అపనమ్మకపు స్థితిని అనుభవించిన వారు వారి జీవితకాలం కన్నా ముందుగానే చనిపొయ్యే అవకాశం ఉందని నిర్థారించారు. అందువల్ల ప్రజలు వ్యక్తిగత భద్రత తీసుకుంటే తప్ప ప్రమాదాన్ని అరికట్టలేమని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Related News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *