మమతకు ముందున్నవన్నీ సవాళ్ళే

 మమతకు ముందున్నవన్నీ సవాళ్ళే

గెలుపు అనంతరం ప్రసంగిస్తున్న దీదీ

పక్కలో బల్లెంగా బీజేపీ

భూమిపుత్ర, కోల్‌కతా:

బెంగాల్‌ ఎన్నికలు మమతా బెనర్జీని మరోమారు ప్రజల్లో తిరుగులేని నేతగా నిలిపాయి. ప్రజల్లో ఆమెపట్ల విశ్వాసం చెక్కుచెదరలేదని నిరూపించాయి. మరోవైపు గత అసెంబ్లీ ఎన్నికలకంటే ఓ రెండు సీట్లు ఎక్కువనే కట్టబెట్టారు. అలాగే కమ్యూనిస్టులకు, కాంగ్రెస్‌ లకు కాలం చెల్లిందని మరోమారు నిరూపించారు. పశ్చిమ బెంగాల్‌లో సీపీఎం ప్రభుత్వం చేపట్టిన భూసేకరణకు వ్యతిరేకంగా పోరాడి మమతా బెనర్జీ ప్రజల్లో పట్టు సాధించారు. నందిగ్రామ్‌ పోరాటంతో ఆమె ప్రజల్లో మంచి నేతగా ఎదిగారు. ’మా.. మాటీ, మానుష్‌’ నినాదంతో జనంలోకి వెళ్లారు. బెంగాల్‌లో 34 ఏళ్లు అప్రతిహతంగా సాగిన సీపీఎం పాలనకు చెక్‌ పెడుతూ.. 2011లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 294 స్థానాకుగాను 184 సీట్లతో ఘన విజయం సాధించారు. 2016 ఎలక్షన్ల నాటికి పార్టీని బలోపేతం చేసి, ప్రజల్లో మరింత పట్టు సాధించారు.ఆ ఎన్నికల్లో ఏకంగా 44.9 శాతం ఓట్లతో 211 సీట్లు గెలుచుకున్నారు.

ఈ రెండు అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్డీయే కూటమి గెలుచుకున్నది 3 సీట్ల చొప్పున మాత్రమే. ఆ తర్వాత బెంగాల్‌లో వామపక్షాలు, కాంగ్రెస్‌ బాగా బలహీనపడి.. వాటి స్థానాన్ని బీజేపీ ఆక్రమించుకుంది. 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్లో బీజేపీ కూటమి 40 శాతంశాతం వద్ద ఓట్లతో 18 లోక్‌సభ సీట్లు గెలుచుకుంది. దీనిని అసెంబ్లీ సీట్ల లెక్కన చూస్తే.. సుమారు 120 స్థానాల్లో బీజేపీ పాగా వేసినట్టు. ఆ ఫలితాలతో ఆశలు పెంచుకున్న బీజేపీ బెంగాల్‌పై ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. కానీ ఆ ఆశపై మమతా బెనర్జీ నీళ్లు చల్లారు. బీజేపీ ఎంతగా ప్రయత్నించినా గతంలో కంటే మరిన్ని సీట్లు పెంచుకుని.. 213 సీట్లలో తృణమూల్‌ కాంగ్రెస్‌ను గెలిపించుకున్నారు. బీజేపీ వాళ్లు జైశ్రీరాం అంటే.. ఆమె బెంగాలీ ఇష్టదైవం ’జై కాళీమాత’అని నినదించారు. ఎలక్షన్ల సమయంలోనే మమతా బెనర్జీ అల్లుడు అభిషేక్‌ బెనర్జీ, టీఎంసీ సీనియర్‌ నేత మదన్‌ మిత్రా తదితరులపై కేంద్ర దర్యాప్తు సంస్థలు, ఐటీ, ఈడీ దాడులు జరిగాయి. ఇది టీఎంసీ కేడర్‌లో నిరుత్సాహం నింపుతుందని బీజేపీ భావించినా మమత ఈ దాడులను తమకు అనుకూలంగా మార్చుకోగలిగారు. వీటన్నిటినీ మమతా బెనర్జీ దీటుగా ఎదుర్కొన్నారు. బెంగాలీ ఆత్మగౌర వాన్ని దెబ్బతీసేందుకు బయటివారు ప్రయత్నిస్తున్నారు. బెంగాల్‌ కీ బేటీ కావాలా, బయటివారు కావాలా? అంటూ బెంగాలీల్లో సెంటిమెంట్‌ రగల్చడంలో మమతా బెనర్జీ విజయం సాధించారని ఫలితాలను బట్టి తెలుసుకోవాలి. అయితే ప్రతిపక్షంగా ఎదిగిన బిజెపితో మమతకు మున్ముందు చిక్కులు తప్పవు. అందువల్ల మమతా బెనర్జీ ప్రజల సంక్షేమం, అభివృద్దిపై మరింత దృష్టి పెట్టాల్సి ఉంటుంది. ఫిరాయింపులు ఓవైపు, బీజేపీ దూకుడు మరోవైపు టీఎంసీ శ్రేణుల్లో ఆందోళన రేపితే.. పార్టీ కేడర్‌లో ఉత్తేజం కలిగించేందుకు మమత రిస్క్‌ తీసుకుని మరీ నందిగ్రామ్‌ నుంచి పోటీకి సై అన్నారు. వాస్తవానికి ఆ నియోజకవర్గంలో తొలి నుంచీ సువేందు అధికారి కుటుంబానిదే ఆధిపత్యం, దానికితోడు బీజేపీ బలం, మోదీ, అమిత్‌షా అండదండలు అన్నీ కలిసివచ్చాయి. హోరాహోరీ పోటీలో మమత వెనుకబడ్డారు. మమతా బెనర్జీ సొంత నియోజకవర్గం కోల్‌కతా నగరంలోని భవానీపూర్‌ సీటు తృణమూల్‌కు కంచుకోట. అక్కడ మమతకు బదులుగా రంగంలోకి దిగిన పార్టీ అభ్యర్థి 22 వేల ఓట్లకుపైగా మెజార్టీతో గెలిచారు. అలా అత్యంత సులువుగా గెవగలిగే చోటును వదిలి మమత ధైర్యంగా నందిగ్రామ్‌లో పోటీకి దిగారు.

రాజకీయాల్లో అరంగేట్రంతోనే మమతా బెనర్జీ దూకుడుగానే వ్యవహరిస్తూ వచ్చారు. 1975 సమయంలో కాంగ్రెస్‌లో చేరిన ఆమె పార్టీలో వేగంగా ఎదిగారు. 1984లో బెంగాల్‌లోని జాదవ్‌పూర్‌ లోక్‌సభ స్థానంలో తొలిసారి పోటీచేసి.. సీనియర్‌ కమ్యూనిస్ట్‌ నాయకుడు సోమనాథ్‌ చటర్జీపై విజయంతో సంచలనం సృష్టించారు. 1989లో ఓడిపోయినా.. 1991 మధ్యంతర ఎన్నికల్లో గెలిచి పీవీ నరసింహారావు కేబినెట్‌లో కేంద్ర మానవ వనరులు, యువజన, క్రీడా శాఖ సహాయ మంత్రిగా పనిచేశారు. 1996 సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్‌ తరఫున ఎంపీగా గెలిచారు. అయితే కాంగ్రెస్‌ రాష్ట్ర నేతలతో విభేదాలు రావడంతో.. 1997లో ముకుల్‌ రాయ్‌తో కలిసి తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీని స్థాపించారు. మమతా బెనర్జీ 1998 డిసెంబర్‌లో మహిళా బిల్లుకు వ్యతిరేకంగా లోక్‌సభలో వెల్‌లోకి దూసుకెళ్లి ఆందోళన చేస్తున్న సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ దుర్గా ప్రసాద్‌ను కాలర్‌ పట్టి వెనక్కి లాగేయడం సంచలనంగా నిలిచింది. తర్వాత మమత వరుసగా 1998, 1999, 2004, 2009 సాధారణ ఎన్నికల్లో ఎంపీగా గెలిచారు. 2000లో ఎన్డీయే ప్రభుత్వంలో రైల్వే శాఖకు తొలి మహిళా మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 2004లో యూపీఏ సర్కారులో బొగ్గు, గనుల శాఖ మంత్రిగా పనిచేశారు. 2005 నుంచి బెంగాల్‌లో ప్రభుత్వ భూసేకరణకు వ్యతిరేకంగా రైతుల తరఫున ఉద్యమం ప్రారంభించారు. సింగూరు, నందిగ్రామ్‌ పోరాటాలను ముందుండి నడిపారు. 2011లో బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించారు. లోక్‌సభ సభ్యత్వానికి రాజీనామా చేసి.. బెంగాల్‌ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. 2016లో, తాజాగా మరోసారి తృణమూల్‌ను గెలిపించుకుని హ్యాట్రిక్‌ కొట్టారు. ఆమె సాదాసీదా జీవనం కూడా బెంగాలీలను ఆకట్టుకుంది. అందుకే కమ్యూనిస్టు కంచుకోటను బద్దలు కొట్టడమే గాకుండా వారికి ఉనికి లేకుండా చేశారు. ఈ సారి బిజెపి ప్రతిపక్షంగా ఎదిగినందున మరింత జాగరూకతతో ఉండాల్సిన అవసరం కూడా ఉంది.

Related News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *