సిబిఐలో డ్రెస్‌ కోడ్‌ అమలు

 సిబిఐలో డ్రెస్‌ కోడ్‌ అమలు

ఫార్మల్‌ దుస్తులు ధరించాలని డైరెక్టర్‌ ఆదేశాలు

భూమిపుత్ర,న్యూఢిల్లీ:

భారత ప్రతిష్టాత్మక దర్యాప్తు సంస్థ సెంట్రల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌ సీబీఐ తమ సిబ్బంది మొత్తానికి డ్రెస్‌కోడ్‌ ప్రకటించింది. జీన్స్‌, టీ షర్టులు, స్పోర్ట్స్‌ షూస్‌ను నిషేధించింది. విధి నిర్వహణలో ఫార్మల్‌ దుస్తులు మాత్రమే ధరించాలని స్పష్టం చేసింది. ఈ మేరకు సీబీఐ డైరెక్టర్‌ సుబోధ్‌ కుమార్‌ జైస్వాల్‌ తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. సీబీఐ ప్రతిష్టను, సామర్థ్యాన్ని మరింత పెంచే ఉద్దేశ్యంతోనే సంస్థ నూతన డైరెక్టర్‌ సుబోధ్‌ కుమార్‌ జైస్వాల్‌ ఈ నిర్ణయం తీసుకున్నట్టు కనిపిస్తోంది. సీఐఎస్‌ఎఫ్‌ డైరెక్టర్‌గా ఉన్న జైస్వాల్‌ మే 26న సీబీఐ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. ఇకపై తమ అధికారులు విధి నిర్వహణలో జీన్స్‌ వంటి క్యాజువల్‌ దుస్తులు, స్పోర్ట్స్‌ షూస్‌ ధరిస్తే సహించేది లేదని సీబీఐ చీఫ్‌ని ఉటంకిస్తూ ఓ ఆంగ్ల దినపత్రిక కథనం వెల్లడించింది.

ఈ కథనం మేరకు పురుష అధికారులు షర్టులు, ఫార్మల్‌ ఫ్యాంటులు, ఫార్మల్‌ షూస్‌ మాత్రమే ధరించాలి. తప్పనిసరిగా షేవింగ్‌ చేసుకుని విధులకు రావాలి. ఇక మహిళా సిబ్బంది కేవలం చీరలు, సూట్లు, ఫార్మల్‌ షర్టులు, ట్రౌజర్స్‌ ధరించాలని సీబీఐ సూచించింది. జీన్స్‌, టీ షర్టులు, చెప్పులు సహా క్యాజువల్‌ వస్తువులేవీ ధరించకూడదు. అని సీబీఐ ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న సీబీఐ బ్రాంచిల్లో సైతం ఈ డ్రెస్‌కోడ్‌ను తప్పనిసరిగా అమలు చేయాలంటూ అక్కడి విభాగాధిపతులను సీబీఐ ఆదేశించింది. కాగా ఫార్మల్‌ డ్రెస్సింగ్‌ అనేది ఎప్పుడూ అనుసరించే ప్రోటోకాలేనని సీబీఐ అధికారులు చెబుతున్నారు. కాకపోతే కొన్నేళ్లుగా కొందరు జీన్స్‌, టీషర్టులు వంటి క్యాజువల్‌ దుస్తులు ధరించడం మొదలు పెట్టారు. ఎవరూ దాన్ని ఆపలేదని ఓ అధికారి వెల్లడించారు.

Related News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *