సీబీఐ డైరెక్టర్‌ ఎంపికలో ప్రభుత్వానికి చుక్కెదురు

 సీబీఐ డైరెక్టర్‌ ఎంపికలో ప్రభుత్వానికి చుక్కెదురు

ఆరుమాసాల లోపు సర్వీసు ఉన్నవారిని పదవిలో నియమించరాదన్న సుప్రీంకోర్టు

భూమిపుత్ర, న్యూఢిల్లీ:

సీబీఐ డైరెక్టర్‌ ఎంపికలో మెలిక పడినట్టు తెలుస్తున్నది. ప్రభుత్వం రూపొందించిన తుది జాబితాలో ఇద్దరి పేర్లు తొలగించాని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ సూచించినట్టు అధికార వర్గాల ద్వారా తెలుస్తున్నది. సోమవారం సాయంత్రం ప్రధాని అధ్యక్షతన జరిగిన ఎంపిక కమిటీ సమావేశంలో ఇది జరిగింది. ఆరుమాసాల లోపు సర్వీసు మాత్రమే మిగిలి ఉన్నవారిని సీబీఐ డైరెక్టర్‌ పదవిలో నియమించరాదని సుప్రీంకోర్టు గతంలో ఏర్పరచిన నిబంధనలను జస్టిస్‌ రమణ ప్రస్తావించారు. విపక్ష ప్రతినిధిగా అధీర్‌ రంజన్‌ చౌధరి ఈ త్రిసభ్య కమిటీలో ఉన్నారు. జస్టిస్‌ ఎన్వీ రమణ అభ్యంతరాన్ని చౌదరి సమర్థించడంతో దానికి మెజారిటీ ఏర్పడినట్టు అయింది.

బీఎస్‌ఎఫ్‌ చీఫ్‌ రాకేశ్‌ ఆస్థానా ఆగస్టు 31న రిటైర్‌ అవుతున్నారు. ఎన్‌ఐఏ చీఫ్‌ వైసీ మోదీ మే 31న రిటైర్‌ అవుతున్నారు. వీరు ప్రభుత్వం ఏరికోరి జాబితాకు ఎక్కించిన అభ్యర్థులు. జస్టిస్‌ రమణ అభ్యంతరంతో ఈ ఇద్దరి పేర్లు తొలగించాల్సి వచ్చింది. గత ఫిబ్రవరి నుంచి సీబీఐ డైరెక్టర్‌ కుర్చీ ఖాళీగా ఉంది. నాలుగు నెలు ఆలస్యంగా సోమవారం ప్రధాని నివాసంలో కమిటీ సమావేశం జరిగింది. 90 నిమిషాల సమావేశం అనంతరం కమిటీ మూడు పేర్లను ఖరారు చేసింది. మహారాష్ట్ర మాజీ డీజీపీ సుబోధ్‌కుమార్‌ జైస్వాల్‌, సశస్త్ర సీమా బల్‌ (ఎస్‌ఎస్‌బీ) డైరెక్టర్‌ జనరల్‌ కేఆర్‌ చంద్ర, హోంశాఖ ప్రత్యేక కార్యదర్శి వీఎస్కే కౌముది, ఈ ముగ్గురిలో ఒకరు అంతిమంగా సీబీఐ డైరెక్టర పదవి చేపడతారు. కాగా ప్రభుత్వం ఆదరాబాదరాగా జాబితాలు తయారు చేసిందని విపక్ష సభ్యుడు, కాంగ్రెస్‌ నేత అధీర్‌ రంజన్‌ చౌధరీ అసంతృప్తి వ్యక్తం చేశారు.

Related News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *