భూమిపుత్ర దినపత్రిక – సాంస్కృతిక చైతన్య పుత్రిక

 భూమిపుత్ర దినపత్రిక – సాంస్కృతిక చైతన్య పుత్రిక

సాకే శ్రీహరి మూర్తి  అంకితభావం గల పాత్రికేయుడు మాత్రమే కాదు, ఆయన అంతకుమించి పర్యావరణ ప్రేమికుడు.రాయలసీమ జాగృతి మాస పత్రికను నడిపేవారు. దానికి ఐ.ఎస్.ఎస్.ఎన్ నెంబర్ కూడా ఉంది. దానిలో అనేకమంది పరిశోధక విద్యార్థులు, ప్రొఫెసర్స్, రచయితలు మంచి మంచి వ్యాసాలు రాశారు. జాగృతి మాస పత్రికలో రాయలసీమ కు సంబంధించిన చారిత్రక వాస్తవాలను దృశ్యాత్మక కథనాలతో ఎంతో అద్భుతంగా ప్రచురించేవారు. ఒక వ్యాసాన్ని వేస్తే దానికి సంబంధించిన అరుదైన ఫోటోలను సేకరించి వేయడం ఆ పత్రికలో కనిపించే గొప్ప ప్రత్యేకత. ఆ వ్యాసం చూసుకున్న రచయిత ఆ ఫోటోలను చూసి ఆశ్చర్యపోవడం వాళ్ళ వంతయ్యేది. జాగృతి మాస పత్రికలో నేను గమనించిన మరొక విశేషం ఏమిటంటే పర్యావరణానికి సంబంధించినవే దానికి కవర్ పేజీగా వేసేవారు. ఆ పత్రికను నడుపుతున్నప్పుడే ఒక దిన పత్రికను తీసుకురావాలని నాతో చెబుతుండేవారు. ఒకవైపు పెద్ద పెద్ద పత్రికలే మూసేస్తుంటే ‘ఈయనేంటి దినపత్రికను ప్రారంభిస్తా’నంటు న్నాడని అనుకునేవాణ్ణి. ఒక పత్రికను నిర్వహించాలంటే ఆర్థిక వనరులతో పాటు దాన్ని ప్రింట్ చేసి పంపిణీ చేయాలంటే ఎంతోమంది సిబ్బంది కూడా అవసరం. అన్నింటికీ మించి పత్రిక నిండా తగిన ప్రామాణికమైన వార్తలు రావాలంటే విలేకరులు కావాలి. ఇవన్నీ ఆలోచించుకుంటున్నారా? అని కూడా నాకు సందేహం వచ్చేది. ఇదే మాట నేను ఆయనతో అనలేకపోయేవాణ్ణి గానీ, నిర్వహణ సామర్ధ్యాన్ని దృష్టిలో పెట్టుకుంటున్నారా? లేదా? అని మాత్రం అడిగేవాణ్ణి. ఆయనా నవ్వుతూ సమాధానం చెప్పేవాడు. తాను పత్రికను నడిపినన్నాళ్ళూ తాను నడిపే ప్రయత్నం చేస్తానన్నారు. విలువలతో కూడిన వాస్తవాలను, ప్రజోపయోగ వార్తల్ని, ప్రజలకు అవసరమైన సమాచారాన్ని అందించవలసిన అవసరం ఉందని అనుకుంటున్నాననీ ఆయన అన్నారు. పత్రిక బాగుంటే, ప్రజల ఆదరణ ఉంటుందనీ, అప్పుడు ఆర్ధికపరమైన ఇబ్బందులను అధిగమించగలమనుకుంటున్నానని ఎంతో ఆత్మ విశ్వాసాన్ని వ్యక్తం చేసేవారాయన.
ఆయన అనుకున్న దాన్ని ఆచరణలో పెట్టారు. భూమిపుత్ర పేరుతో దాన్ని దినపత్రికగా తీసుకొస్తున్నారు. దాన్ని తొలుత నలుపు తెలుపులలో తీసుకువచ్చేవారు. తర్వాత అన్ని పేజీల్లోనూ మంచి నాణ్యత గల కలర్ ఫుల్ ఫోటోలు, న్యూస్ ఐటమ్స్, వ్యాసాల్లో సహా టైటిల్ని కలర్లో పెడుతున్నారు. భూమి పుత్ర పత్రిక చదువుతూ ఉంటే ఒక జాతీయ పత్రిక చదువుతున్నాననే భావనే నాకు కలుగుతూ ఉంటుంది. జాతీయ వార్తలకు ప్రధాన జీవన స్రవంతిలో ఉన్న పత్రికలు ఎలాంటి ప్రాధాన్యమిస్తున్నాయో భూమిపుత్ర పత్రికలో కూడా అలాంటి ప్రాధాన్యమే లభించడం చూసి ఆశ్చర్యానికి గురవుతుంటాను. నాకు ఈ పత్రికలు చూస్తూ ఉండగానే నాలుగు అంశాలను చూస్తాను. మొదటిది సంపాదకీయ వ్యాసం. రెండవది పతాక శీర్షిక. మూడవది ఏదైనా మంచి వ్యాసం వేశారా అని, నాల్గోది వైవిధ్య భరితమైన వార్తేమిటీ, సినిమా పేజీలో అందమైన చిత్రాలు చూస్తూ ఉంటాను. తర్వాత ఆ పత్రిక అంతా ఒకసారి అలా తిరిగేసి, నాకు కావలసిన వార్తల్ని చదువుతూ ఉంటాను. ప్రతిరోజూ మన మొబైల్లో ఉదయమే పత్రిక వాలి పోతూ ఉంటుంది. ఒక పావురం పిల్లలా దాన్ని నా చేతిలోకి తీసుకుంటూ ఉంటాను. ఒకవేళ అది ఇంకా రాకపోతే వెబ్సైట్ లో వాళ్ళు సైట్ కి వెళ్ళి చదివేదాకా మనసు ఊరుకోదు. భూమి పుత్ర దినపత్రిక ను ఇలా రోజూ చదవడం  అలవాటైపోయింది. కళ్ళకి హాయిని గొలుపుతూ చదవాలనే కుతూహలం కలిగిస్తూ హాయిగా సాగిపోయే అక్షరాలను ఎన్నుకోవడం ఈ పత్రికకే హైలెట్. ఈ పత్రిక ఎంత ప్రభావాన్ని కలిగించిందనేది ఒక ఉదాహరణ చెప్పి నా అభిప్రాయాన్ని ముగిస్తాను. కోవిద్- 19 వలన అనేకమంది జీవన్మరణ సమస్యల్ని ఎదుర్కొంటున్నారని మనం గమనిస్తూనే ఉన్నాం. ముఖ్యంగా ప్రైవేటు పాఠశాలల్లోను, కళాశాలల్లోను పని చేస్తున్నటువంటి వారి జీవన స్థితిగతులు మరీ దారుణంగా మారిపోయాయి. ఒక డాక్టరేట్ చేసిన సాహితీవేత్త, పేరు ప్రఖ్యాతులు పొందినటువంటి రచయిత కరోనా వల్ల ఉద్యోగాన్ని కోల్పోయాడు. తన కుటుంబాన్ని పోషించడం కోసం కూలి పనికి వెళుతున్న దృశ్యాన్ని భూమిపుత్ర పత్రికే మొట్టమొదటిసారిగా వార్తాకథనంగా ప్రచురించింది. నాకు తెలిసినంత వరకు ఆయన గురించి మొట్టమొదటిగా పట్టించుకున్నటువంటి పత్రిక భూమిపుత్ర దినపత్రిక మాత్రమే. అందులో వార్తాకథనం వచ్చిన తర్వాత మెయిన్స్ట్రీమ్ పత్రికలు అనుకున్నట్టు వంటి పత్రికల్లో ఆయన గురించి వార్తలు వచ్చాయి. టీవీ ల వాళ్లు కూడా ఆయన్ని ఇంటర్వ్యూలు చేశారు. ఆ తర్వాత ఆయన ఆర్థిక సమస్యలనుండి కొంతవరకూ బయటపడగలిగాడని తెలిసింది. ఎవరూ పట్టించుకోని ఒక సమస్యను బయటికి తీసుకొచ్చి, ఆ సమస్య పరిష్కారం కావడానికి ప్రయత్నం చేసినటువంటి గొప్ప విజయం చాలా తక్కువ సమయంలోనే భూమిపుత్ర దినపత్రిక సాధించింది. శ్రీహరి మూర్తి గారు పత్రిక ఎందుకు పెట్టారో నాకు అప్పుడు అర్థమైంది. కరోనా కష్టకాలంలో ప్రధాన జీవన స్రవంతిలో ఉన్నటువంటి పత్రికలు తమ జిల్లా ఎడిషన్స్ (టాబ్లాయిడ్స్) చాలావరకు తగ్గించేశాయి. దానివలన స్థానిక వార్తలు ప్రధాన జీవన స్రవంతి పత్రికల్లో రావడం గగనమైపోయింది. జిల్లా ఎడిసిన్స్ వచ్చిన తర్వాత ఆ జిల్లాకు సంబంధించిన వార్తలు కూడా జిల్లాలోని అన్ని ప్రాంతాలకు తెలియడం లేదు. జోన్ పద్ధతిలో వార్తలు రావడం వల్ల డివిజన్ లో కూడా జిల్లాలోని అన్ని వార్తలు తెలియని పరిస్థితి ఏర్పడుతోంది. దీనికి తోడు అంతర్జాలం లో పత్రికలు చూడాలనుకుంటే కూడా కొన్ని పత్రికలు వివిధ చందా టారిఫ్ లను పెట్టేశాయ్. ఈ పరిస్థితుల్లో స్థానిక పత్రికల అవసరం పెరిగింది. కరోనా సమయంలో స్థానిక పత్రికలు విస్తృతంగా రావడం కూడా ఈ అవసరాన్ని తెలియజేస్తున్నాయి. పత్రిక ప్రారంభించడం కంటే ఆ పత్రికను కొనసాగించడం, ప్రధాన జీవన స్రవంతి పత్రిక తో సమానంగా అనుభూతి చెందగలిగేటట్లు చేయడం చాలా కష్టం. అలాంటి పరిస్థితులలో భూమిపుత్ర దినపత్రిక చదువుతూ ఉంటే ప్రధాన జీవన స్రవంతి పత్రికను చదువుతున్న అనుభూతి కలుగుతుంది. ఇంటర్నెట్ లో తాజా వార్తలు కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తున్నారు. పాత పత్రికలను ఆర్కైవ్స్ ద్వారా చూసుకునే అవకాశాన్ని కూడా అందిస్తున్నారు. సాధారణంగా అంతర్జాలంలో ప్రత్యేకించి చదివేటప్పుడు కొన్ని ఇబ్బందులు ఉంటాయి. కానీ, భూమిపుత్ర దినపత్రికను చాలా సులభంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు, చదువుకోవచ్చు. దానికి అనుగుణమైనటువంటి సాంకేతికతను ఉపయోగించటం వలన అత్యధికులు ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకునే అవకాశం కూడా ఉందనుకుంటున్నాను. అయితే ఈ పత్రికలో సమకాలీన విషయాలను విశ్లేషిస్తూ రాసే మేధావుల వ్యాసాలు ప్రతిరోజు ఉండేలా చూసుకోవడం, సాహిత్యానికి కూడా వారంలో ఒకరోజు అయినా అవకాశం ఇచ్చి కవిత్వం, కథలు, వ్యాసాలు మొదలైన ప్రక్రియ లకు అవకాశం కలిగిస్తే పాఠకుల సంఖ్య కూడా పెరుగుతుందని అనుకుంటున్నాను. సాహిత్యానికి ప్రాధాన్యత ఇవ్వడం వలన సాంస్కృతిక చైతన్యానికి, శ్రీహరి మూర్తి గారి లక్ష్యాలకు మరింత చేరువ అవుతుందని అనుకుంటున్నాను. భూమిపుత్ర దినపత్రిక దినం దినం తాజా వార్తలతో ఒక సాంస్కృతిక చైతన్య కేంద్రంగా వర్ధిల్లాలని ఆకాంక్షిస్తున్నాను.

ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు, సెంట్రల్ యూనివర్సిటీ, హైదరాబాద్.

Related News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *