అక్షయ తృతీయ అంటే బంగారం కొనడమేనా?

 అక్షయ తృతీయ అంటే బంగారం కొనడమేనా?

ఆచార వ్యవహారాలను మరుగున పర్చిన వ్యాపార దృక్పథం

భూమిపుత్ర, అనంతపురం :

దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తుండటంతో దాదాపుగా 15 రాష్ట్రాల్లో లాక్‌డౌన్‌ ఆంక్షలు అము చేస్తున్నారు. దీంతో ప్రజలు ఇళ్లకే పరిమితం అయ్యారు. ప్రతి ఏడాది అక్షయ తృతీయ రోజున గోల్డ్‌ షాపులు వినియోగదారులతో కళకళలాడేవి. కానీ, ఈ ఏడాది గోల్డ్‌ షాపులు కరోనా కారణంగా వెలవెలబోతున్నాయి. మరోవైపు ధరలు కూడా విపరీతంగా పెరిగిపోవడం, ప్రజల ఆదాయం పడిపోవడంతో కూడా కొనుగోళ్లపై ప్రభావం పడింది. ఆంధ్రప్రదేశ్‌లో మద్యాహ్నం 12 గంటల వరకే షాపులు తెరిచి ఉండటంతో వినియోగదారులు పెద్దగా కొనుగోలు చేసేందుకు షాపులకు రావడంలేదని బంగారం షాపుల యజమానులు చెబుతున్నారు. గతేడాది పూర్తిస్థాయి లాక్‌డౌన్‌ కారణంగా అమ్మకాలు జరగలేదు.

ఈ ఏడాది కరోనా ప్రభావంతో అక్షయ తృతీయ సందడి కనిపించడం లేదని బంగారం వ్యాపారులు చెబుతున్నారు. కొనుగోలు దార్లలో ఎక్కువ మంది వివాహం కోసమే కొనుగోలు చేస్తున్నట్టు వ్యాపారులు చెబుతున్నారు. అక్షయ అంటే తరిగిపోనటువంటిది. తాము చేసే పుణ్యకార్యాల ఫలం అక్షయం చేస్తూ తరగిపోకుండా చేయమని చేసే వ్రతమే అక్షయ తృతీయ వ్రతం. ప్రత్యేకంగా అక్షయ తృతీయ నాడు దేవతా ప్రీతి కర్మలు, జపదాన, హోమాలు క్షయం కానంత మంచి ఫలితాన్నిస్తాయి. ఈ రోజు చేసే దానాలు అనుష్టానపరులకు, యోగ్యులకు చేసినట్లయితే శ్రీ మహావిష్ణువు సంతృప్తి చెంది అనుగ్రహిస్తాడని శాస్త్రాలు చెబుతున్నాయి. అయితే బంగారం కొనడం అన్నది ఒక వ్యాపార ప్రయోజనం మాత్రమే. ఈ రోజు పరశురామ జయంతిగా కూడా కొలుస్తారు. క్లిష్ట సమస్యకు పరిష్కారం కావాలనుకునేవారు ’పరశురామ స్తుతి’ ఈ రోజునుంచి మండల కాలం పారాయణ చేసినట్లయితే అద్భుత ఫలితాలు కలుగుతాయని‌ నమ్మకం.

రోజంతా ఉపవసించి రాత్రి సమయంలో స్త్రీలు లక్ష్మీదేవిని పూజించి కనకధారా స్తోత్రం, శ్రీ సూక్తం, అష్టలక్ష్మీ స్తోత్రం మొదలైనవి పారాయణ చేసినట్లయితే సౌభాగ్యవంతులై వారి కుటుంబాలు సుఖసంతోషాలతో వర్థిల్లుతాయని పెద్దల మాట. సకల పితృదేవతలను సూర్యభగవానునిలో దర్శించవచ్చును. అక్షయ తృతీయ శుభకాలంలో పితృదేవతలను తచుకుంటూ అన్నం, నెయ్యి, పప్పు కలిపిన చిన్న ముద్దను ఎండు కొబ్బరిలో నిక్షిప్తం చేసి ఆహుతి చేసినట్లయితే వంశపారంపర్యంగా శుభఫలితాలు పొందవచ్చునని జ్యోతిష్య పండితులు చెబుతారు. అక్షయ తృతీయ నాడు శ్రీ మహావిష్ణువుకి చందనం సమర్పిస్తే విశ్వమంతా చల్లగా సుభిక్షంగా వుంటుంది. దేవాలయాలలో ధవళ వర్ణానికి అధిక ప్రాధాన్యమిస్తారు. అయితే ఈ ఆచారాలను పక్కన పెట్టి, ఆచార వ్యవహారాలు మరుగున పడిపోయేలా చేసి నేడు బంగారం కొనుగోలు చేయడమే అక్షయ తృతీయగా ప్రచారం చేయడం విడ్డూరం.

Related News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *