అనంత జిల్లాలో వైసీపీ జెడ్పీ పీఠ”ముడి”

 అనంత జిల్లాలో వైసీపీ జెడ్పీ పీఠ”ముడి”

భూమిపుత్ర,అనంతపురం:
అనంతపురం జిల్లా వైసీపీలో కొత్త పోరు ప్రారంభమైంది. ఎన్నికల ఫలితాలు ఇంకా రాకుండానే.. జడ్పీ చైర్‌పర్సన్‌ పీఠం చిచ్చు రాజేస్తోంది. కుర్చీని చేజిక్కించుకునేందుకు బలమైన సామాజికవర్గాలజ నువ్వా.. నేనా.. అంటూ పోటీ పడుతున్నాయి. జడ్పీ చైర్‌పర్సన్‌ పీఠం బీసీ మహిళకు రిజర్వ్‌ అయింది. దీంతో ఆయా సామాజికవర్గాల ప్రజాప్రతినిధులు, కుల సంఘాల నేతలు తమ వారిని పీఠమెక్కించేందుకు పావులు కదుపుతున్నారు. ఎవరికి వారు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఇది అటు తిరిగి ఇటు తిరిగి.. మంత్రి శంకర్‌నారాయణకు, ఇద్దరు ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలకు చుట్టుకుంది.పీఠం ఆశిస్తున్నవారిలో ఎవరికివారు వీరిని ఆకర్షించే పనిలో పడ్డారు. తమ వాదనను బలంగా వినిపిస్తూ జడ్పీ పీఠాన్ని కైవసం చేసుకునేందుకు ముమ్మరం చేశారు. అయితే.. అదే సమయంలో మరికొందరు మాత్రం..వైసీపీ అదిష్టానం పైనే ఆశలు పెట్టుకున్నారు. ఎందుకంటే.. స్థానిక, కార్పొరేషన్‌ పదవుల విషయంలో ఎంపీలు, ఎమ్మెల్యేలు ఎంత దెబ్బలాడుకున్నా అధిష్టానం నిర్ణయమే ఫైనల్‌ అయింది. జిల్లాలో అనంతపురం కార్పొరేషన్‌ మేయర్‌, మున్సిపల్‌ చైర్మెన్‌ పదవులు ఫలానా వారికే దక్కనున్నాయని బలంగా ప్రచారం సాగినా.. పంపకాల వద్ద కొచ్చేసరికి అధిష్టానం నిర్ణయమే ఫైనల్‌ అయిపోయింది.ఈ నె 8న పరిషత్‌కు పోలింగ్‌ నిర్వహించారు. కోర్టు ఆదేశాల మేరకు 10న జరగాల్సిన ఓట్ల లెక్కింపు ప్రక్రియను వాయిదా వేశారు. కోర్టు ఆదేశాలు ఎప్పుడు వస్తే.. అప్పుడు ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కానుంది. జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ పీఠం కోసం ఆది నుంచి వైసీపీలో ముగ్గురు ఆశావాహుల పేర్లు వినిపిస్తున్నాయి. ఆత్మకూరు నుంచి పోటీచేసిన బోయ గిరిజమ్మ, కూడేరు నుంచి పోటీలో ఉన్న అశ్వినీ హరీష్‌, తనకల్లు నుంచి జక్క జ్యోతి ఉన్నారు.తాజాగా గుత్తి మండం నుంచి పోటీ చేసిన ఎన్. రాధిక జడ్పీ చైర్‌పర్సన్‌ పీఠాన్ని ఆశిస్తున్నారు. జిల్లాలో ఈ నలుగురి పేర్లే ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎవరికివారు పీఠాన్ని దక్కించుకునేందుకు తీవ్రస్థాయిలో వైసీపీలో ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఎవరికివారు ఎంపీ, మంత్రి, ఎమ్మెల్యేలను కలిసి.. మద్దతు కోరుతున్నారు. దీంతో ఎవరినీ కాదనలేక వారంతా తర్జన భర్జన పడుతుండడం గమనార్హం.

Related News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *