రెండేళ్ళ పాలనలో రాష్ట్రం ఎటువైపు?

 రెండేళ్ళ పాలనలో రాష్ట్రం ఎటువైపు?

భూమిపుత్ర,ఆంధ్రప్రదేశ్:

సంక్షేమ పథకాలు వేరు,తాయిలాలు వేరు.వివిధ పథకాల పేరుతో ప్రజలకు నగదు బదిలీ చేయడమన్నది వారిని ప్రలోభాలకు గురిచేయడం తప్ప మరోటి కాదు. చంద్రబాబు హయాంలోనే ఇది మొదలు అయ్యింది. నేరుగా నగదు బదిలీ చేయడం అన్న పద్దతి సరైంది కాదు.దీంతో అభివృద్ది కుంటుపడుతుంది. ఎపిలో రెండేళ్ల పాలన పూర్తి చేసుకున్న సిఎం జగన్‌ పాలనపై ఇటీవలే ఓ పుస్తకాన్ని విడుదల చేశారు. తాను చేస్తున్న నగదు బదిలీ చర్యలను సంక్షేమ కార్యక్రమంగా సిఎం జగన్‌ సమర్థించుకోవచ్చు.నగదు తీసుకున్న వారికి కూడా బాగానే ఉంటుంది. తెలంగాణలో రైతుబంధు కింద భూమి ఉన్న వారికి ప్రతి వారికి ఎకరానికి పదివేల చొప్పున నగదు బదిలీ జరుగుతోంది.దీనితో ప్రజాధనం కోట్ల రూపాయలు దుర్వినియోగమవుతోంది. రైతులకు ఇప్పటికే ఉచిత విద్యుత్‌ అందుతోంది. వారిపై ప్రేమ ఉంటే ఆ డబ్బును ధాన్యం సేకరణకు వినియోగించాలి. అలాకాకుంటే అనర్హులను రైతుబంధు జాబితా నుంచి తొలగించాలి. వ్యవసాయ యోగ్యంగా లేని భూములకు సైతం వేలాదిమంది రైతుబంధు పొందుతున్నారు.

 కేంద్రం కూడా నగదు బదిలీ పథకాన్ని కొనసాగిస్తోంది. రైతుల ఖాతాల్లో నేరుగా నగదు వేస్తున్నారు. వీటన్నింటిని మించి ఎపిలో ప్రతి పథకం కింది ఆయా వర్గాలకు నగదు బదిలీ జరుగుతోంది. ఇది ఓటుబ్యాంక్‌ రాజకీయాలకు పనికి వస్తుందే తప్ప ప్రజల లేదా ఆయా వర్గాల అభివృద్దికి ఇసుమంత కూడా ఉపయోగపడదని గుర్తించాలి. ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి తన రెండేళ్ల పాలనలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు కేవలం రాజకీయంగా మరింత బలపడాలనే దృక్పథంతో తీసుకుంటున్న నిర్ణయాలుగానే చూడాలి. వీటిని వైకాపా లేదా లబ్దిదారులు సమర్థిస్తున్నట్లుగానే తీవ్రంగా వ్యతిరేకిస్తున్న వారు కూడా ఉన్నారు. యువకు డుగా ఉన్న వ్యక్తి సిఎం కావడం వల్ల కొత్త ఆలోచనలతో ఎపిని పరుగులు పెట్టిస్తారని అంతా భావించారు. అభివృద్ది,నిర్మాణాత్మక కార్యక్రమాలకు ఈ డబ్బును వెచ్చించి ఉపాధి రంగాన్ని బలోపేతం చేసివుంటే ఎపి దిశ మరోలా ఉండేది. సంక్షేమం పేరిట ప్రజాధనాన్ని పంచిపెడుతూ బలమైన ఓటు బ్యాంకును నిర్మించు కుంటున్న తీరు అభివృద్దికి విఘాతం కలిగిస్తోంది. అలాగే పాలనలో పారదర్శకత లోపించింది.

నిబంధనలు, చట్టాలకు అనుగుణంగా వ్యవహరించవలసిన అధికారులు అనవసరంగా కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తోంది. న్యాయస్థానాలు అడ్డుపడిన ప్రతి సందర్భంలోనూ తప్పులను సరిదిద్దుకోకపోగా ఎదురుదాడికి దిగుతున్నారు. ఇది పాలకులకు మంచి పని కాదని గుర్తించడం లేదు.అధికారులు కూడా ఏదేని నిర్ణయంలో పూర్వాపరాలు ఆలోచించడం లేదని అనిపిస్తోంది. నిజానికి పాలకులు అంతా కూడా తమకు ప్రజలు ఓట్లేసారని, ప్రజలకు జవాబుదారీ అంటూ ఇష్టారీతిన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇందుకు మోడీ కూడా మినహాయింపు కాదు. ఆయన కూడా ఇదే పద్దతిలో ప్రభుత్వ ఆస్తులను దోచిపెట్టే పనిలో ఉన్నారు. పాలన న్యాయబద్ధంగా, చట్టబద్ధంగా, రాజ్యాంగ బద్ధంగా సాగడం లేదు. అధికారులు సైతం ముఖ్యమంత్రిని లేదా ప్రధానమంత్రిని సంతృప్తిపరచడమే తమ ప్రథమ కర్తవ్యం అన్నట్టుగా ఉత్తర్వులు జారీ చేసి న్యాయస్థానాల్లో చిక్కులు ఎదుర్కొంటున్నారు. వివిధ రాష్ట్రాల సిఎంలు,కేంద్రంలో ప్రధాని మోడీ తీసుకుంటున్న అనేక నిర్ణయాలు కోర్టుల ముందు నిలవడం లేదు.

ఆయా రాష్ట్రాల హైకోర్టులు, సుప్రీంకోర్టు సైతం ప్రభుత్వ నిర్ణయాలపై అభ్యంతరాలు చెప్పడం, ఉత్తర్వులను నిలిపి వేయడం చూస్తూనే ఉన్నాం.పేదలకు మేలు చేయాలనుకుంటే కోర్టులు అడ్డుకుంటున్నాయని నిందిస్తున్నారు. కేవలం సంక్షేమం పేరుతో ప్రజల డబ్బును పందేరంగా చేస్తుంటే ఎప్పుడో ఒకప్పుడు కోర్టులు కూడా వీటిని అడ్డుకోక మానవని గుర్తించాలి. పాలకులు తమ రాజకీయ ఎజెండాను అమలు చేయడం కోసం ప్రజాధనాన్ని ఇలా విచ్చలవిడిగా ఖర్చు చేస్తూ దానినే అభివృద్దిగా చెబితే ప్రజలను నమ్మరని గత అనుభవాలు చెబుతున్నాయి. అన్నింటిని మించి ఎపిలో జగన్‌ ప్రభుత్వ ఈ పందేరాలకు ఇక స్వస్తి పలికి అభివృద్దిపై దృష్టి పెట్టాలి. ప్రజలకు ఉపాధి, ఉద్యోగాలు కల్పించే పనులు చేపట్టి కొత్త రాష్ట్రాన్ని మరింత ముందుకు తీసుకుని పోయేలా విప్లవాత్మక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాలి. అనేక వనరులున్న ఎపిని అభివృద్ది పట్టాలకు ఎక్కించగలిగితే జగన్‌ను మించిన నాయకుడు ఉండడు.

Related News

1 Comment

  • Good news on AP jagan/YSRCP 2yrs rule

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *