చర్చలు లేకుండానే చట్టాలు చేయడం దురదృష్టకరం

 చర్చలు లేకుండానే చట్టాలు చేయడం దురదృష్టకరం

సంచలన వ్యాఖ్యలు చేసిన చీఫ్‌ జస్టిస్‌ ఎన్‌వి రమణ ఆవేదన

సుప్రీకోర్టులో జాతీయ జెండా ఆవిష్కరణ

భూమిపుత్ర, న్యూ ఢిల్లీ:

పార్లమెంట్‌ పనితీరుపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. చట్టాలను రూపొందించే సమయంలో చర్చలపై కాకుండా ఆటంకాలు సృష్టించడంపైనే ఎక్కువ దృష్టి సారిస్తున్నారని ఆయన అన్నారు. 75వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా సుప్రీంకోర్టులో జాతీయ పతాకాన్ని ఎగురవేసిన అనంతరం సీజేఐ ఎన్వీ రమణ మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్లమెంట్‌లో చట్టాలు చేస్తున్న తీరుపై విచారం వ్యక్తం చేశారు. చట్టాలపై లోతైన చర్చ జరగపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. నాణ్యమైన చర్చ లేకుండా చట్టాలు చేస్తే న్యాయపరమైన చిక్కులు ఏర్పడతాయని సీజేఐ అభిప్రాయపడ్డారు. ఏ చట్టం ఎందుకు చేస్తున్నారో, ఆ చట్టం ఉద్దేశం ఏమిటో తెలియకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. చట్ట సభల్లో న్యాయవాదులు, మేధావులు ఎక్కువగా లేకపోవడం వల్లే చట్టాలపై లోతైన చర్చ జరగడం లేదని సీజేఐ వ్యాఖ్యానించారు.

చట్టాల్లో ఎన్నో లోపాలుంటున్నాయని, దీంతో కోర్టుల్లో వ్యాజ్యాలు పెరుగుతున్నాయని చెప్పారు. ఇలాంటి లోపభూయిష్ట చట్టాలు ప్రజలకు, ప్రభుత్వానికి భారంగా మారుతాయన్నారు. పార్లమెంట్‌లో ఒకప్పుడు న్యాయదిగ్గజాలు సభ్యులుగా ఉండేవారని, గతంలో చర్చల నాణ్యత అద్భుతంగా ఉండేదని తెలిపారు. పారిశ్రామిక వివాదాల చట్టంపై గతంలో పార్లమెంటులో జరిగిన చర్చను తాను స్వయంగా చూశానని, అప్పట్లో తమిళనాడుకు చెందిన సీపీఐ(ఎం) సభ్యుడు రామ్మూర్తి ఎంతో విపులంగా ఆ బిల్లును విశ్లేషించారని జస్టిస్ట్‌ ఎన్వీ రమణ గుర్తు చేశారు. కార్మికులు, వివిధ రంగాలపై ఆ బిల్లు చూపే ప్రభావాన్ని ఎంపీ రామ్మూర్తి లోతుగా విశ్లేషించి చెప్పారని, ఇప్పుడు అలాంటి లోతైన విశ్లేషణ పార్లమెంట్‌లో కరువైందని సీజేఐ ఎన్వీ రమణ అభిప్రాయపడ్డారు. ఒకప్పుడు సభలో మొత్తం లాయర్లే ఉన్న సమయంలో పార్లమెంట్‌ ఎంతో హుందాగా నడిచేదని సీజేఐ అనడం గమనార్హం. అందుకే న్యాయ వ్యవస్థలోని వాళ్లు ప్రజాసేవపైనా దృష్టి సారించాలని పిలుపునిచ్చారు.

ప్రస్తుతం పార్లమెంట్‌ పనితీరు తీవ్ర నిరాశజనకంగా ఉన్నదని, అసలు సరైన చర్చే జరగడం లేదని విమర్శించారు. చట్టాలపై స్పష్టత లేదు. అసలు చట్టం ప్రయోజనం ఏంటో తెలియకపోవడంతో ప్రజలకు తీవ్ర నష్టం కలుగుతోంది. లాయర్లు, మేధావులు సభలో లేనప్పుడు ఇలాగే జరుగుతుంది అని రమణ అనడం గమనార్హం. స్వాతంత్య సమరయోధులను చూడండి. వాళ్లలో చాలా మంది న్యాయ వ్యవస్థకు సంబంధించిన వాళ్లే. మొదటి లోక్‌సభ, రాజ్యసభలో మొత్తం లాయర్లే ఉన్నారు అని ఎన్వీ రమణ గుర్తు చేశారు. ఇప్పుడు పార్లమెంట్‌ లో జరుగుతున్న పరిణామాలు దురదృష్టకరం. అప్పట్లో సభల్లో చర్చలు నిర్మాణాత్మకంగా జరిగేవి. ఆర్థిక బిల్లులపై చర్చలు జరిగేవి. ఎంతో నిర్మాణాత్మక అంశాలను లేవనెత్తేవాళ్లు. చట్టాలను చర్చించేవాళ్లు.

ప్రతి ఒక్కరికీ చట్టంలోని శాసన వ్యవస్థపై అందరికీ స్పష్టత ఉండేది అని ఎన్వీ రమణ అన్నారు.అందుకే లాయర్లకు నేను ఒకటే చెబుతున్నాను. విూరు కేవలం న్యాయ సేవలకే పరిమితం కావద్దు. ప్రజా సేవ కూడా చేయండి. విూ జ్ఞానాన్ని, తెలివిని దేశం కోసం ఉపయోగించండి అని సీజేఐ రమణ పిలుపునిచ్చారు. 75వ స్వాతంత్య దినోత్సవాన మనం సాధించిన విజయాలు, విధానాలను పునః సవిూక్షించుకోవాలని ఆయన అన్నారు. మన సంతృప్త స్థాయులు పతనం అంచుకు చేరాయి. మా చిన్నతనంలో ఇండిపెండెన్స్‌ డే నాడు చిన్న బెల్లం ముక్క, జెండా ఇచ్చేవారు. ఇప్పుడు ఎంతో ఉన్నా.. మనం సంతోషంగా లేము అని రమణ అనడం గమనార్హం. న్యాయవాదులు కూడా ప్రజాజీవితంలోకి, చట్ట సభలకు రావాలని సీజేఐ ఎన్వీ రమణ పిలుపునిచ్చారు. న్యాయవాదులకు సంపాదనే పరమావధి కాకూడదని చీఫ్‌ జస్టిస్‌ ఎన్వీ రమణ హితవు పలికారు.

Related News

1 Comment

  • Excellent conceptual speach of CJI .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *