ప్రహసనంగా పరిణమిస్తున్న పార్లమెంట్ సమావేశాలు!!

 ప్రహసనంగా పరిణమిస్తున్న పార్లమెంట్ సమావేశాలు!!

భూమిపుత్ర,సంపాదకీయం :

దేశం అనేకానేక సమస్యలతో సతమతమవుతోంది. ప్రజలు అన్నమో రామచంద్రా అంటూ ఆందోళన చెందుతున్నారు. కరోనా థర్డ్‌వేవ్‌ రూపంలో ఒమిక్రాన్‌ భయపెడుతోంది. నిరుద్యోగులు ఉద్యోగమెలా అని ఎదురుచూస్తున్నారు. ధరలు స్వారీ చేస్తున్నాయి. ఆసుపత్రులు దోపిడీ చేస్తున్నాయి. ఔషధ ధరలు రెట్టింపు అయ్యాయి. రూపాయి బేలగా చూస్తోంది. ఏ ఒక్క ఆసరా దొరికినా చాలు ..అన్నచందంగా ప్రజలు ఆశగా చూస్తున్నారు. ఈ క్రమంలో దేశంలో ప్రజల సమస్యలను నెత్తికెత్తుకోవాల్సిన మన నేతలు ఎప్పటిలాగే పార్లమెంట్‌ సమావేశాల్లో తమ నైజాన్ని కొనసాగిస్తూ ప్రజలను దగా చేస్తున్నారు. ఏదో రకంగా సమస్యలను చర్చించి ప్రజలకు అండగా నిలవాలన్న బుద్ది లేదా జ్ఞానం లేదా..సోయి విపక్షాలకు లేదు. విపక్షాలను విశ్వాసంలోకి తీసుకుని సమస్యలను చర్చించి ప్రజల పక్షాన నిలవాలన్న పెద్దమనసు అధికార కమల నాధులకు కూడా లేకుండా పోయింది.

పార్లమెంట్‌ సమావేశాల తీరు చూస్తుంటే వీరిని ఎందుకు ఎన్నుకున్నామా అని ప్రజలు ఆలోచన చేయాలి. చిన్నిచిన్న విషయాలపైనా పట్టుదలకు పోయి పార్లమెంట్‌ సమావేశాలను, కాలాన్ని వృధా చేయడమెలా అన్న ఆలోచన చేస్తున్నారు. రాజ్యసభలో 12మంది సభ్యులను సస్పెండ్‌ చేస్తూ ఛైర్మన్‌ వెంకయ్యనాయుడు నిర్ణయించారు. వారు క్షమాపణలు చెబితే సస్పెన్షన్‌ ఎత్తివేస్తా మన్నా వీరు క్షమాపణలు చెప్పరు. ఆయన సస్పెన్షన్‌ ఎత్తేయరు. ఈ క్రమంలో ఈ ఇద్దరికీ పోయిందేవిూ లేదు. సర్వం కోల్పోతున్నవారంతా ప్రజలే అన్నది వారికి తెలియంది కాదు. ఇక అధికార పార్టీ తక్కువేవిూ తినలేదు. ఎంతగా రచ్చ జరిగితే అంతగా సమావేశాలు జరగకుండా పోతాయి. సంజాయిషీ ఇచ్చుకునే బాధా పోతుంది. అందుకే సభ జరగాలని ఘనత వహించిన బిజెపి పెద్దలు కోరుకోవడం లేదు. ఇలా ఇద్దరు కలసి ప్రజలను వంచిస్తున్నారు. ప్రజలకు అండగా నిలవాల్సిన అధికార, విపక్షాలు ప్రజలు ఎంతకాలం మోసం చేస్తారన్నది గమనించాలి. పార్లమెంట్‌ సమావేశాల్లో అన్ని అంశాలపై చర్చకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించిన ప్రధాని మోడీ కూడా పార్లమెంట్‌ సమావేశాలు సజావుగా సాగాలని కోరుకోవడం లేదు.

ప్రతిపక్షాలు లేవనెత్తిన అన్ని ప్రశ్నలకు సమాధానం ఇస్తామని ప్రకటించిన పెద్దమనిషి ఈ డ్రామాను కళ్లప్పగించి చోద్యం చూస్తున్నారు. పార్లమెంటులో సాగుచట్టాలను వెనక్కు తీసుకునే బిల్లును ప్రభుత్వం కేవలం నాలుగు నిమిషాల్లో ఆమోదింపచేసింది. దాదాపు ఏడాది పాటు అన్నదాతల నిరసన ప్రదర్శనలకు, 750 మంది రైతుల మరణాలకు, అనేక దురదృష్టకరమైన సంఘటనలకు కారణమైన సాగు చట్టాలను ఉపసంహరించుకునే నిర్ణయాన్ని ప్రభుత్వం ఎందుకు తీసుకుందో తెలుసుకునే హక్కు పార్లమెంట్‌ కు లేకుండా పోయింది. అలాగే సాగుచట్టాల ప్రయోజనాలను రైతులకు వివరించలేక పోయానన్న ప్రధాని కూడా దీనిపై చర్చించలేదు. సాగుచట్టాలను తీసుకుని వచ్చి..రద్దు చేసాక జరిగిన నష్టం..ప్రాణనష్టం ఎవరి ఖాతాలో వేయాలో ప్రధాని చెప్పలేదు. సాగు చట్టాలను ప్రధానే వెనక్కు తీసుకున్నారు కదా, ఇంకా చర్చ అవసరం ఏమిటని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్‌ జోషి సెలవిచ్చారు. సాగుచట్టాలను తీసుకుని వచ్చినప్పుడు..వెనక్కి తీసుకున్నప్పుడు కూడా గప్‌చుప్‌గా వ్యవహారమంతా జరిగిపోయింది. సభలో ఎలాంటి చర్చా సాగలేదు. రైతులకు ఎలాంటి ప్రయోజనాలు చేకూర్చాలనుకున్నారో కూడా చెప్పలేక పోయారు. సభలో కాకుండా కీలక నిర్ణయాలను సభ వెలుపలే ప్రకటిస్తున్నారు.

దేశం అన్నది ఒకటున్నదన్న విషయం మరిచారు. వారిగురించే ఈ పార్లమెంట్‌ ఉన్నదని..వారి సమస్యలు చర్చించాలన్న స్పృహ లేని నేతలు పార్లమెంటులో..ప్రశ్నించేవారు బయట ఉంటున్నారు. విపక్షాలు కూడా తమ నిరసనలు తెలపాలన్న పట్టుదలకు పోయి కేవలం పార్లమెంటును స్తంభింప చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నాయి. నిజానికి 12మంది రాజ్యసభ ఎంపిలు క్షమాపణలు చెప్పి సభకు హాజరుకావడం ద్వారా తాము లేవనెత్తాలనుకున్న అంశాలపై చర్చకు దిగివుంటే ప్రజలు మెచ్చేవారు. కానీ సాగదీయడమే వారి లక్ష్యం. రచ్చచేయడం విపక్షాలకు అలవాటుగా మారింది. మొహం చాటేయడం ప్రధాని మోడీ నేతృత్వంలోని నేతలకు రివాజుగా మారింది. మనమంతా కలసి ప్రజలను మోసం చేస్తున్నామని వారు గుర్తించడం లేదు. గతంలో పార్లమెంట్‌లో ఎంతో హుందాగా నడిచిన సందర్బాలను విస్మరిస్తున్నారు. ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిన నేతలు తమ పబ్బం గడుపుకునే ప్రయత్నాలుచేస్తున్నారు. విపక్షాలు నిజానికి వ్యూహాత్మకంగా ఉంటే అధికార పక్షం దిగివచ్చేది. ఇకపోతే పార్లమెంట్‌లో ఏ చర్చకైనా సిద్ధమని ప్రధానమంత్రి పైకి చెబుతున్నారు. అయితే చర్చలు జరిగితే అనేక అంశాలపై ఇబ్బందికరమైన సమాధానాలు ఇవ్వవలసి వస్తుందని ముఖం చాటేస్తున్నారు.

మరో రెండు నెలల్లో ఉత్తరప్రదేశ్‌, పంజాబ్‌ తదితర రాష్టాల్ల్రో ఎన్నికలు జరుగుతున్న సమయంలో పార్లమెంట్‌ నుంచి తమకు వ్యతిరేక సంకేతాలు వెళ్లడం కూడా వారికి ఇష్టం ఉండకపోవచ్చు. అందుకే చర్చలు జరగకుండా చూడడానికే రకరకాల వ్యూహాలు అవలంబిస్తున్నారని అనుకోవాల్సి ఉంటుంది. సాగు చట్టాలు లేదా..కరోనా కష్టాలు..ఆర్థిక నష్టాలు..ఇలా అనేక విషయాల్లో ప్రజల బాధను గుర్తించడంలో పార్లమెంట్‌ విఫలం అయ్యింది. ఉన్నత ప్రమాణాలు నెలకొల్పిన అత్యున్నత సభలో ఇలా మొహం చాటేసే వారు ప్రజలకు అవసరమా అన్నది ప్రజలు గుర్తించాలి దేశాన్ని, ప్రజలను మరచిన వారిని గెలిపించినందుకు ఎవరికి వారు ఆత్మపరిశీలనచేసుకోవాలి. జవాబుదారీ ఉండే నేతలను ఎన్నుకోవాలి.మానసికంగా సిద్దం కావాలి. మనం వేసిన ఓటు వృధా కాకుండా చూసుకోవాలి. అప్పుడే పార్లమెంట్‌ జవాబుదారీగా ఉంటుంది. ప్రజల సమస్యలపై చర్చ సాగుతుంది.

Related News

Leave a Reply

Your email address will not be published.