మైనారిటీకి పడిపోతున్న శ్వేతజాతీయులు

 మైనారిటీకి పడిపోతున్న శ్వేతజాతీయులు

భూమిపుత్ర,అంతర్జాతీయం:

అగ్రరాజ్యమైన అమెరికాకు సంబంధించిన ఏ విషయమైనా యావత్‌ ప్రపంచానికి ఆసక్తికరమే. ఎంత కాదనుకున్నా అగ్రరాజ్య పరిస్థితులు ఆయా దేశాలపై ఎంతో కొంత ప్రభావం చూపించే మాట వాస్తవం. అందువల్ల అక్కడి సామాజిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితులను అంతర్జాతీయ సమాజం ఆసక్తిగా గమనిస్తుంటుంది. తాజాగా అగ్రరాజ్య అమెరికా జనాభాకు సంబంధించిన వెలుగులోకి వచ్చిన లెక్కలు ఒకింత ఆశ్ఛర్యం కలిగించిన మాట నిజం. సహజంగా ఏ దేశంలో అయినా అక్కడి స్థానిక జనాభా పెరుగుతుంటోంది. ఇతర వర్గాల జనాభా తగ్గుతూ ఉంటుంది. కానీ అమెరికా పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉండటం ఆసక్తి కలిగిస్తోంది.తాజాగా అమెరికా సెన్సస్‌ బ్యూరో విడుదల చేసిన లెక్కల ప్రకారం ఆ దేశంలోని తెల్లవారి జనాభా తగ్గింది. అదే సమయంలో ఇతర వర్గాల జనాభా పెరుగుతుండటం సరికొత్త పరిణామం.

1790 నుంచి అమెరికాలో జనాభా లెక్కలను సేకరిస్తున్నారు. సరికొత్త లెక్కల ప్రకారం దేశంలో శ్వేత జాతీయుల సంఖ్య తగ్గింది. 2010లో వారి జనాభా 19.6 కోట్లుండగా ఇప్పుడు 19.10 కోట్లకు తగ్గింది. శాతాలవారీగా చూస్తే 63.7 నుంచి 5.8 శాతానికి తగ్గింది. మొత్తం జనాభాలో తెల్లవారి సంఖ్య తగ్గినప్పటికీ ఆధిక్యం మాత్రం వారిదే కావడం గమనార్హం. అదే సమయంలో అమెరికాయేతర ప్రజల సంఖ్య పెరుగుతుండటం ఆసక్తికరం. ఆసియన్లు, స్పానిష్‌, మెక్సికో మూలాలున్న వారి సంఖ్య రోజురోజుకు అధికమవుతోంది. జనాభాలో 18.7 శాతం మంది హిస్పానిక్‌ లే. వీరి సంఖ్య రమారమి 6.21 కోట్లు. ఆసియా వాసుల సంఖ్య గత దశాబ్ద కాలంలో మూడొంతులు పెరిగింది. వీరు 2.4 కోట్ల మంది ఉంటారని అంచనా.మొత్తం అమెరికా జనాభా 33.14 కోట్లుగా తేలింది. చైనా, భారత్‌ ల తరవాత అతిపెద్ద జనాభా గల దేశంగా అగ్రరాజ్యం అమెరికా గుర్తింపు పొందింది.

చాలామంది తాము ఏదో ఒక జాతివారమని చెప్పుకోవడానికి ఆసక్తి చూపడం లేదు. తాము బహుళ జాతీయులమన్నది వారి భావన. అలాంటి వారి సంఖ్య 4.99 కోట్ల మంది వరకు ఉండవచ్చని అంచనా. గత పదేళ్లలో పల్లెల జనాభా తగ్గుతుండగా పట్టణాలు, నగరాల జనాభా పెరుగతుండటం మరో ఆసక్తికర పరిణామం. జనాభా పెరుగుదల మెట్రోపాలిటన్‌ నగరాల్లో మరీ ఎక్కువగా ఉంది. బతుకుదెరువు కోసం తట్టాబుట్ట సర్దుకుని ప్రజలు భారీగా వలస రావడమే ఇందుకు కారణం. జానాభా వద్ధి రేటు తగ్గడం వల్ల దాని ప్రభావం పిల్లలపైన పడుతోంది. 18 ఏళ్లున్న వయసున్న పిల్లల సంఖ్య పదేళ్ల క్రితం 7.42 కోట్లుండగా ఇప్పుడు ఆ సంఖ్య 7.31 కోట్లకు పడిపోవడమే ఇందుకు నిదర్శనం.1.4 శాతం మేర తగ్గుదల కనిపిస్తోంది. అమెరికా జనాభాలో పిల్లల శాతం 22గా ఉంది. అదే సమయంలో పెద్దల జనాభాలో పెరుగుదల కనిపిస్తోంది.

దశాబ్దం క్రితం వారి జనాభా 23.7 కోట్లుండగా ఇప్పుడు ఆ సంఖ్య 26.1 కోట్లకు పెరిగింది. శాతాలవారీగా చూస్తే 76 నుంచి 78 శాతానికి పెరగడం గమనార్హం. అగ్రరాజ్యంలో శ్వేతజాతీయులు లేదా తెల్లజాతీయుల జనాభా వేగంగా తగ్గిపోతోంది. గత దశాబ్ద కాలంలో మొదటిసారిగా నల్లజాతీయులతో పోలిస్తే వీరి జనాభా గణనీయంగా తగ్గింది. తాజా అమెరికా జనాభా లెక్కలను ఆ దేశ సెన్సస్‌ బ్యూరో గురువారం విడుదల చేసింది. 2010లో 63.8 శాతం ఉన్న శ్వేతజాతీయుల జనాభా 2020 నాటికి 59.7 శాతానికి పడిపోయిందని యూఎస్‌ సెన్సస్‌ బ్యూరో తెలిపింది. మొత్తంగా 2010 నుంచి తెల్లజాతీయుల జనాభా 8.6శాతం తగ్గిందని తెలిపింది. అమెరికాలో తెల్లజాతీయుల జనాభా ఇంత వేగంగా పడిపోవడం ఇదే తొలిసారి. శ్వేతజాతి ప్రజలు ఆలస్యంగా వివాహాలు చేసుకోవడం, తక్కువ మంది పిల్లలను కనడంతో ఈ ధోరణి కనిపిస్తోందని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి.

యూఎస్‌ సెన్సస్‌ డేటా ప్రకారం ఐరోపా, పశ్చిమాసియా‌ మూలాలు ఉన్న తెల్లజాతి అమెరికన్ల జనాభా 2010లో 19.6 కోట్లు ఉండగా.. 2020 నాటికి 19.1 కోట్లకు తగ్గింది. హిస్పానిక్‌ జనాభా కాలిఫోర్నియాలో 37.6 శాతం నుంచి 39.4 శాతానికి పెరిగింది. అయితే ఈ ప్రాంతంలో శ్వేతజాతీయుల జనాభా మాత్రం 40.1 శాతం నుంచి 34.7 శాతానికి పడిపోయింది. 2020 నాటికి దేశవ్యాప్తంగా హిస్పానిక్స్‌ సంఖ్య 6.2 కోట్లగా నమోదైంది. అయితే బహుళజాతులకు చెందిన వారి సంఖ్య పెరుగుదలే ఈ గణాంకాలపై ప్రభావం చూపించిందని నిపుణులు పేర్కొంటున్నారు. 2010లో వీరి జనాభా 90 లక్షలు ఉండగా.. 2020కి ఆ సంఖ్య 3.3 కోట్లకు చేరింది. ప్రస్తుతం ఉన్న అమెరికా జనాభాలో 10 శాతం వీరే ఉన్నారు.అమెరికాయేతర ప్రజల సంఖ్య పెరగడానికి ప్రధాన కారణం అక్కడి ప్రభుత్వం వలసలను ప్రోత్సహించడమే. విద్యా, ఉద్యోగ రంగా ల్లో విద్యార్థులను, ఉద్యోగుల రాకను అగ్రరాజ్యం ప్రోత్సహిస్తోంది. దీనివల్ల నాణ్యత గల మేథస్సు, ప్రతిభ తమ దేశానికి వస్తుందని, ఇది దేశ ప్రగతికి దోహదపడుతుందన్నది అమెరికా విధాన నిర్ణేతల భావన. దేశానికి వలస వచ్చని వారిలో కొందరు అక్కడే పౌరసత్వం తీసుకుని స్థిరపడిపోతున్నారు. దేశంలో అమెరికాయేతర పౌరుల సంఖ్య పెరగడానికి ఇది ఒక ప్రధాన కారణంగా విశ్లేషకులు పేర్కొంటున్నారు.

Related News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *