ఆరోగ్య అత్యయిక స్థితే మనకు శరణ్యమా!!

 ఆరోగ్య అత్యయిక స్థితే మనకు శరణ్యమా!!

భూమిపుత్ర, సంపాదకీయం:

దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లో కరోనా కారణంగా ప్రభుత్వాసుపత్రులన్నీ కిటకిటలాడుతున్నాయి. ఒకరిని డిశ్చార్జి చేస్తే తప్ప మరొకరిని చేర్చుకోలేని స్థితి ఇప్పుడు దేశమంతా కానవస్తోంది. ఇంతటి దయనీయ స్థితి ఏర్పడటం బాధాకరమే కాదు..గతంలో ఎప్పుడూ ఇలా జరిగి ఉండదు. గతేడాది కరోనా సంక్షోభంలోనూ ఇలాంటి దుస్థితి రాలేదు. పాశ్చాత్య ప్రపంచం ఎదుర్కొంటున్న రెండోదశ కరోనా ఇక్కడ రాదన్న అభిప్రాయం పాలకుల్లో ఏర్పడడమే మన దురదృష్టం. వారు ముందే గుర్తించి హెచ్చరికలు చేసివుంటే ఇంతటి దారుణాలు జరిగేవి కావు. చాలా మందిలో నిర్లక్ష్యం ఏర్పడటానికి, ముందు జాగ్రత్తలు విస్మరించటానికి ప్రభుత్వ నిర్లిప్తతనే దోహదపడింది. ఎన్నికలపై ఉన్న ప్రేమ ప్రజల ప్రాణాలపై పాలకులకు లేకుండా పోయిందనడానికి ప్రస్తుత విప్తతు నిదర్శనం. కనీసం ఇప్పుడైనా అందరూ సంయమనం పాటించాలి. సమష్టిగా దీన్ని ఎదుర్కొనేలా కార్యాచరణ రూపొందాలి. ఈ విషయంలో కేంద్రంలోని అధికార పక్షం చొరవ చూపడంలో పూర్తిగా విఫలమయ్యిందనే చెప్పాలి. ఇకపోతే సందట్లో సడేమియాలా.. కరోనా వైరస్‌ మాటున కొందరు కాసుల వేట కొనసాగిస్తున్నారు.

టెస్టుల పేరుతో దోపిడీ జరుగుతోంది. ప్రాణభయంతో వైద్యులు చెప్పినట్లుగా అప్పు చేసి సమర్పించుకుంటున్నారు. ఆక్సిజన్‌ కొరత కారణంగా ఎక్కడ పడితే అక్కడ బతిమాలాడుకోవాల్సి వస్తోంది. ల్యాబ్‌, ఎక్స్‌రే సెంటర్లు, స్కానింగ్‌ థియేటర్లు ఇలా పలు కేంద్రాల వద్ద వసూళ్లపర్వం విచ్చలవిడిగా జరుగుతోంది. దేశంలో కరోనా కేసులు పెరుగుతుండడంతో ప్రాణభయంతో జనం ఆసుపత్రుల వైపు పరుగు తీస్తున్నారు. ఇదే అదనుగా ప్రైవేటు అంబులెన్స్‌ నిర్వాహకులు అధిక వసూళ్లకు ప్పాడుతున్నారు.వంద సంఖ్యలో కొవిడ్‌ రోగులు ప్రైవేటు వాహనాలను ఆశ్రయిస్తున్నారు. శ్వాసకోశ సమస్యలు తలెత్తిన సందర్భాల్లో పట్టణాల్లోని కార్పోరేట్‌ ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారు. ఇదే అదనుగా పలువురు ప్రైవేటు అంబులెన్స్‌ నిర్వాహకులు విచ్చవిడిగా వసూళ్లు చేస్తున్నారు. రెండు నెలలకు ముందు కంటే ప్రస్తుతం మూడింతలకు పైగా వసూళ్లు చేస్తున్నారు. ధరలపై నియంత్రణ లేక పోవడంతో అంబులెన్స్‌ నిర్వాహకులకు డిమాండ్‌ పెరిగింది. హైద్రాబాద్‌లో అయితే ఏకంగా రూ. 20 వేల నుంచి రూ. 25 వేల వరకు వసూలు చేస్తున్నారు. కరోనా పాజిటివ్‌ వచ్చి చనిపోయిన వారి మృతదేహాన్ని తరలించడానికి రూ. 30 వేల పైనే డిమాండ్‌ చేస్తున్నారు. ఇప్పుడు మీడియాలో కనబడుతున్న అంకెల వెనక లక్షలాదిమంది జీవితాలున్నాయి. వారిపై ఆధారపడి జీవించే మరిన్ని లక్షల మంది వున్నారు. కరోనా పంజా నుంచి వీరంతా తప్పించుకుని మళ్లీ మామూలు మనుషులు కాలేకపోతే వారిని ఆలంబనగా చేసుకున్నవారి బతుకుల్లో చీకట్లు అలుముకుంటాయి. రెండో దశ కరోనా మొదయ్యాక పెరుగుతున్న కేసుల సంఖ్యను చూసి గుండెలు బాదుకుంటున్నవారికి మరణాల సంఖ్య మరింత భయపెడుతున్నాయి. కరోనా సెకండ్‌ వేవ్‌లో ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆక్సిజన్‌ కొరత వేదిస్తోంది. విదేశాల నుంచి తెచ్చుకునే దుర్భర పరిస్థితులు దాపురించాయి. గత కొన్ని రోజుగా ఆక్సిజన్‌ దొరక్క ఆసుపత్రులలో తిప్పలు పడుతున్న తీరుపై పాలకులు సరిగా స్పందించకపోవటం వల్లే వాతావరణం వేడెక్కిందని గుర్తించాలి. ఆక్సిజన్‌ లభ్యం కాక రోగులు చనిపోతున్న తీరు ప్రపంచాన్ని కూడా కన్నీరు పెట్టిస్తోంది. ఇటీవల ఇదే విషయమై ముంబై వైద్యురాలు కంటతడి పెడుతూ చెప్పిన మాటలను ప్రతి ఒక్కరూ గమనించే ఉంటారు. ఆక్సిజన్‌ కోసం అన్ని రాష్ట్రాలు ఆందోళనలో ఉన్నాయి. తాజాగా కేసులు, మరణాలు చూస్తుంటే ఇప్పుడు కరోనాతో కన్నా ఆక్సిజన్‌ కొరతతో మనం చస్తున్నామన్న విషయం అందరికీ అవగతమయ్యింది. అయితే చేతులు కాలాక ఆకు పట్టుకున్న చందంగా మొత్తానికి ఆక్సిజన్‌ లోటుపై పాలకులతో సహా అందరూ ఇప్పుడు దృష్టి సారించారు. వాటిని ఉచితంగా అందజేసేందుకు కొందరు పారిశ్రామికవేత్తలు ముందుకొచ్చారు. ఆక్సిజన్‌ కొరత వున్న రాష్ట్రాలు వైమానిక దళం సాయం తీసుకోవటం ప్రారంభమైంది. తమిళనాడులోని తూత్తుకుడిలో స్టెరిలైట్‌ కర్మాగారం తెరిచే విషయంలో వివాదంలో చిక్కుకున్న వేదాంత సంస్థ అక్కడ తాము ఆక్సిజన్‌ ఉత్పత్తి చేయడానికి అనుమతించమని చేసిన అభ్యర్థనను సుప్రీంకోర్టు ఆమోదించటం కూడా కొరతను దృష్టిలో వుంచుకునేనని గుర్తించాలి. కరోనా వైరస్‌ మహమ్మారి బారిన పడినవారి, దానికి బలైనవారి గణాంకాలు వెల్లడవుతూ ప్రజానీకాన్ని భయోత్పాతంలో ముంచెత్తుతున్న తీరుతో అయినా పాలకులు కఠినంగా వ్యవహరించడం లేదు. ప్రైవేట్‌ ఆస్పత్రుల దోపిడీని అరికట్టడం లేదు. సుప్రీంకోర్టు, ఆయా రాష్ట్రాల హైకోర్టుల హెచ్చరికలను బేఖాతరు చేస్తున్నారు. హఠాత్తుగా కరోనా బారిన పడి మృత్యుముఖంలోకి వెళుతున్న వారిని తలచుకుని ఆయా కుటంబాలు కన్నీటి పర్యంతం అవుతున్నాయి. రానున్న రోజుల్లో ఢిల్లీ, హరియాణా, రాజస్థాన్‌, తెలంగాణల్లో కేసుల సంఖ్య అధికంగా వుండొచ్చని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారంటే పరిస్థితి తీవ్రత అర్థమవుతుంది. ఈ క్రమంలో ప్రజలను మభ్య పెట్టడం కాకుండా కచ్చితంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారో వివరించడం పాలకుల బాధ్యత. అది కేవలం ఆ విమర్శలకు జవాబు చెప్పడంగా కాకుండా ఖచ్చితమైన నిర్ణయంగా ఉండాలి. ప్రజల్లో ఉన్న సందేహాలను, భయాలను తీర్చేలా, వాస్తవ పరిస్థితిని కళ్లముందుంచేలా కృషి చేయాలి. అప్పుడు సహజంగానే అంతా సర్దుకుంటుంది. ప్రధాని నరేంద్ర మోదీ ప్రజలనుద్దేశించి మాట్లాడుతున్నా.. ఖచ్చితంగా భరోసా ఇవ్వలేక పోతున్నారు. సెకండ్‌వేవ్‌ను గుర్తించి అధికారులను అప్రమత్తం చేసి, తక్షణ చర్యు తీసుకోవడంలోనూ, ఆక్సిజన్‌ కొరతను గుర్తించడంలోనూ విఫలమయ్యారు. విపత్కర పరిస్థితుల్లో పాలకులు ఎలా స్పందించారన్నదే ఇక్కడ ముఖ్యం. పాలకుల నాయకత్వ లక్షణాలు అప్పుడే తెలుస్తాయి. కానీ మనం పూర్తిగా విఫలం అయ్యామనే చెప్పాలి. అందుకు కారణాలు వెతుక్కోవడమే గాకుండా ప్రస్తుత సంక్షోభం నుంచి ప్రజలను గట్టెక్కించే సత్తాను చాటి ప్రజల్లో ధైర్యం నింపగగాలి.పరిస్థితులు చేయిదాటిపోయి రేపటినుంచి కర్ణాటక లో విధిస్తున్న లాక్డౌన్ నుంచి మిగతా రాష్ట్రాలు కూడా పాఠాలు నేర్చుకోవలసి ఉంది. ఈ సంక్షోభ నివారణకు ఆరోగ్యఅత్యయిక స్థితి  విధించినట్లయితే పరిస్థితులు మెరుగుపడవచ్చని పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Related News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *