విశాఖ హెచ్‌పీసీఎల్‌లో భారీ అగ్నిప్రమాదం

 విశాఖ హెచ్‌పీసీఎల్‌లో భారీ అగ్నిప్రమాదం

దట్టంగా అలుముకున్న పొగతో ప్రజల ఆందోళన

భూమిపుత్ర, విశాఖపట్టణం:

విశాఖ హెచ్‌పీసీఎల్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. మంటలు పెద్దఎత్తున ఎగసిపడ్డాయి. హెచ్‌పీసీఎల్‌ పరిసరాల్లో దట్టంగా పొగలు అలుముకున్నాయి. మంటలు ఎగసిపడుతుండటంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. ప్రమాద సమయంలో మూడు సార్లు హెచ్చరికలు జారీ చేశారు. మరోవైపు ముందస్తు చర్యల్లో భాగంగా హెచ్‌పీసీఎల్‌ పరిసర ప్రాంత ప్రజల్ని పోలీసులు ఖాళీ చేయించారు. ఇదిలా ఉంటే, మంటలను అదుపులోకి తీసుకొచ్చినట్టు తెలుస్తోంది. ప్రమాద సమయంలో అక్కడ 100 మంది ఉద్యోగులు ఉన్నారని వారంతా క్షేమంగా ఉన్నారని సమాచారం. ఎటువంటి ప్రాణహాని, గాయాలు జరగకపోవడం అంతా ఊపిరి పీల్చుకున్నారు. అయితే సేప్టీ సైరన్‌ మోగడంతో ఉద్యోగులు పరుగు తీశారు. భారీ శబ్దం రావడంతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు.

హెచ్‌పీసీఎల్‌ నుంచి సాధారణం కంటే దట్టంగా పొగలు వ్యాపించాయి. పరిస్థితిని ఫైర్‌ సిబ్బంది అదుపులోకి తెచ్చారు. హెచ్‌పీసీఎల్‌ ప్రమాద స్థలానికి మంత్రి అవంతి శ్రీనివాస్‌, సీపీ మనీష్‌ కుమార్‌ చేరుకున్నారు. ఓర్‌హెడ్‌ పైప్‌లైన్‌లో లీకేజి వల్ల ప్రమాదం జరిగిందని కలెక్టర్‌ వినయ్‌చంద్‌ తెలిపారు. సీడీయూ మూడో యూనిట్‌లో ప్రమాదం జరిగిందన్నారు. ఓవర్‌ హెడ్‌ పైప్‌లైన్‌ దెబ్బతినడం వల్ల ప్రమాదం జరిగిందని కలెక్టర్‌ వివరించారు. యూనిట్‌ మొత్తాన్ని షట్‌డౌన్‌ చేశారని పరిస్థితి అంతా అదుపులోనే ఉందన్నారు. ఎవరూ భయపడాల్సిన అవసరం లేదన్నారు. ప్రమాదం జరిగిన 15 నిమిషాల్లోనే సమాచారం వచ్చిందని వెంటనే అంతా అప్రమత్తమయ్యామని తెలిపారు.ఐదారు గంటలలో పరిస్థితి పూర్తి అదుపులోకి వస్తుందని కలెక్టర్‌ చెప్పారు.

Related News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *