మహిళలపై ఆగని దాడులు

 మహిళలపై ఆగని దాడులు

భూమిపుత్ర,సంపాదకీయం:

లేడిపిల్ల ఒంటరిగా ఉంటే తోడేళ్లుపైనపడి చంపి తింటాయి. ఇక్కడ తోడేళ్ల ఆకలి తీర్చుకోవడానికి మాత్రమే దాడి చేస్తాయి.సమాజంలోని మనిషి ముసుగు కప్పుకున్న తోడేళ్ళు బాలికలు, యువతులపై చేస్తున్న లైంగికదాడులు, ఆపై హత్యలు, నిందితులకు శిక్షలు పడకుండా రక్షించుకొస్తున్న వ్యవస్ధల దౌష్ట్యం వెరశి తీవ్ర ఆవేదనను కలిగిస్తున్నాయి. పసి కందుల నుంచి పండు ముదుసలి వరకు స్త్రీలపై జరుగుతున్న అసంఖ్యాక దారుణాలు సమాజాన్ని భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి.

‘’గుండెలపై గాయాలు, మెదడుపై దెబ్బలు, చర్మమంతా వాతలు,

చితికిపోయిన శరీరం, అరవడానికి గొంతు పెగలదు
ఇరుగు పొరుగులు నుంచుని చూస్తూ ఉంటారు
సహాయం కోసం ఎంత ఏడ్చినా అక్కడ ఎవరూ లేరు’’

కొన్ని దశాబ్దాల పూర్వం, నీనా నెహ్రా రాసిన కవిత ఇప్పుడు గుర్తుకొస్తున్నది. కాదు కాదు సమాజాన్ని ప్రశ్నిస్తున్నది.కేవలం ఆహారం కోసం జరిగే పోరాటంలో ఒక జంతుపుకు ఇంకో జంతువు బలవుతుంది. కాని అడవిలో జంతువులకు, సమాజంలో మనుషులకు చాలా తేడా ఉండాలి కదా! జంతువులకు లేని జ్ఞానం మనుషులకుండాలి! వాటికిలేని జ్ఞానం మనుషులకుండాలి. ఏది మంచో, ఏది చెడో విచక్షణ ఉంటుంది. కాని మనిషికి అన్నీ తెలిసినా కొన్ని సందర్భాలలో కొందరు మృగానికన్నా ఘోరంగా తయారవుతున్నారు. వయసుతో సంబంధం లేకుండా మహిళ అయితే చాలు కబళిస్తున్నారు. రాష్ట్ర రాజధాని నడిబొడ్డున ఆరేండ్ల చిన్నారి విూద పొరుగునే ఉండే ఒక దుర్మార్గుడు లైంగిక దాడి చేసి, హత్య చేశాడంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్ధంచేసుకోవచ్చు.

మహిళలకు పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలు, రోడ్లు, రైళ్ళు, పనిప్రదేశాలు.. ఎక్కడా భద్రత లేకుండా పోయింది. గొంతు పిసికి, బ్లేడుతో చీల్చి, కత్తితో కోసి, గొడ్డలితో నరికి, చున్నీతో ఉరేసి, యాసిడ్‌ను కుమ్మరించి, పెట్రోల్‌ చల్లి తగలబెట్టడం వంటివి ఈ దుర్యోధన దుశ్యసన దుర్వినీతి లోకంలో రోజువారి సంఘటనలుగా మారిపోతుంటే,ఈ విశాల సమాజానికి, వారి భద్రతకు పూచీపడాల్సిన వ్యవస్థలకు ఈ జీవించే హక్కునే హరించి వేస్తున్న దృశ్యాలు కనపడడంలేదా? ఘటనలు జరిగినప్పుడు కొద్ది రోజులు సంచలన వార్తగా ఉండి ఆ తర్వాత పాతబడి అందరూ మరిచి పోయే సంఘటనగా మాత్రమే ఘాతుక చర్య ఎందుకు మిగిలిపోతోంది? ఎందుకని సమాజం బలంగా స్పందించడంలేదు?ఏవరు నేరస్తులు? అనేది మనందరం వేసుకొవాల్సిన ప్రశ్న.స్త్రీలపై ఈ పైశాచిక కృత్యాలకు దోహదం చేస్తున్నవేమిటి? ఒక వైపు భూస్వామ్య వ్యవస్థ తాలూకు అదుపు, ఆధిపత్యం కొనసాగుతూ ఉండడం, మరోవైపు పెట్టుబడిదారీ వ్యవస్ధ అందించిన విష సంస్కృతి దాడిని నియంత్రించలేకపోవడం. ఎలక్ట్రానిక్‌ ప్రసార సాధనాలు, డబ్బు, సెక్స్‌, అధికారాన్ని గ్లామరైజ్‌ చేస్తున్నాయి. ఆనందానికి అవే మూల హేతువులని ప్రచారం చేస్తున్నాయి.

స్త్రీలపై తమ అధికారాన్ని స్థిరీకరించుకోవడానికి, తమ ఆధిపత్యాన్ని నిలుపుకోవడానికి, పురుషులు లైంగిక దాడులకు పాల్పడటానికి ఇది ప్రేరణగా నిలుస్తుండం ఒక కారణం. స్త్రీలను కేవలం మానవ సంపదను ఉత్పత్తి చేసే యంత్రంగా భావించే పురుషులు స్త్రీలపై తమకు సహజంగానే హక్కు ఉన్నదనే భ్రమలో ఉంటారు. ఫలితంగా మహిళలపై హింస, లైంగిక దాడులు వ్యవస్థీకృతమవుతుండటంతో మహిళల రక్షణ కోసం ఎన్ని చట్టాలున్నా బాధితులకు న్యాయం జరగడం లేదు. ఇది అడుగడుగునా రుజువవుతూనే ఉంది. నిర్భయ ఘటన నుంచి చేసిన చట్టాల వలన కలిగిన ప్రయోజనాలు ఏమిటి? అవే సక్రమంగా జరిగి ఉంటే మొన్న హత్రాస్‌ ఘటన, ఆ తరువాత జరిగిన దిశ ఘటన, నిన్న రాష్ట్ర నడిబొడ్డున చైత్ర ఘటనలు జరిగి ఉండేవా? అనేది ప్రభుత్వాలు ప్రశ్నించుకోవాలి.ఆయా ఘటనల్లో ఉరిశిక్షలు, ఎన్‌కౌంటర్లే వీటికి పరిష్కారం అయితే.. మరోసారి ఈ దారుణాలు చోటుచేసుకునేవి కావు. కానీ, ఇవి నిత్యకృత్యం అయ్యాయి అంటే చేయాల్సింది కొత్తకొత్త చట్టాలు కాదు.

వ్యవస్థలో చైతన్యం కల్గించడం. విద్యా సంస్థలలో వీటిపై అవగాహన కల్గించడం చేయాలి. మోడీ ప్రభుత్వానికి దేశాన్ని కాషాయీకరించే తాపత్రయమే తప్ప పురుషులలోని పితృస్వామ్య భావజాల చెత్తను ఊడ్చి పారేయాలన్న ఆలోచన కాని, చిత్తశుద్ధి కాని ఏకోశానా లేవు? ఆరు నెలల పసిగుడ్డు నుండి తొంభై ఏండ్ల వద్ధురాలి వరకు లైంగిక దాడులకు గురవుతుంటే.. మహిళలు ధరించే దుస్తులే ఈ లైంగిక దాడులకు కారణమనే దుష్ప్రచారం ఏలినవారి అనుచరగణం దేశ వ్యాప్తంగా చేస్తున్నారు. అశ్లీల సినిమాలను, టీవీ కార్యక్రమాలను అనుమతిస్తూ, ఇంటర్‌నెట్‌లో అశ్లీలసైట్లను నిషేధించకుండా జరుగుతున్న పరిణామాలకు మహిళలను బాధ్యులను చేయడం పాలక వర్గాలలోని పితృస్వామ్య భావజాలానికి నిదర్శనం. నేటి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల సమస్యలను గాలికి వదిలి పెట్టుబడిదారుల కొమ్ము కాస్తున్నాయి. మహిళలపై హింసకు, లైంగిక దాడులకు మూలాలు వ్యవస్థలోనే ఉన్నాయని గుర్తించి నూతన ప్రజాస్వామిక వ్యవస్థను నిర్మించుకోవాలి.

Related News

Leave a Reply

Your email address will not be published.