మహిళలు మెచ్చే చిత్రంగా ’వకీల్‌ సాబ్‌’

 మహిళలు మెచ్చే చిత్రంగా ’వకీల్‌ సాబ్‌’

మళ్లీ మంచి నటనను అందించిన పవన్‌ కళ్యాణ్‌
భూమిపుత్ర,సినిమా:

పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ మూడేళ్ళ తర్వాత ’వకీల్‌ సాబ్‌’ సినిమాతో తెరపైకి వచ్చాడు. అమితాబ్‌ బచ్చన్‌ హిందీ చిత్రం ’పింక్‌’కు ఇది రీమేక్‌. అయితే… ఇదే సినిమాను ఇప్పటికే అజిత్‌ తమిళంలో ’నేర్కొండ పార్వై’ పేరుతో రీమేక్‌ చేశాడు. పల్లవి (నివేద థామస్‌), జరీనా (అంజలి), దివ్య (అనన్య) వేర్వేరు నేపథ్యాలకు చెందిన మహిళలు. ఈ వర్కింగ్‌ ఉమెన్స్ ముగ్గురూ హైదరాబాద్‌ లోని ఓ ప్లాట్‌ లో రెంట్‌ కు ఉంటారు. ఒకరోజు రాత్రి పార్టీకి వెళ్ళి తిరిగి వస్తుంటే… ఓ ఊహించని సంఘటన చోటు చేసుకుంటుంది. దాంతో వారి జీవితాలు అతలాకుతలం అయిపోతాయి. వ్యవహారం పోలీసు కేసు, అరెస్టు వరకూ వెళుతుంది. అవతలి వ్యక్తి ఎం.పీ కొడుకు కావడంతో సమస్య జటిలంగా మారుతుంది. నిస్సహాయతతో దిక్కుతోచకుండా ఉన్న వీళ్ళకు వకీల్‌ సాబ్‌… సత్యదేవ్‌ (పవన్‌ కళ్యాణ్‌) తోడుగా నిలుస్తాడు. తన వాదనా పటిమతో ఈ కేసును ఎలా గెలిచాడన్నదే సినిమా కథ. మన దేశంలో అబ్బాయిలకంటే అమ్మాయిలకే ఆంక్షలు ఎక్కువ. రాత్రిపూట అయితే ఒంటరిగా వెళ్ళకూడదు. తెలిసిన వ్యక్తిని కూడా చనువుతో టచ్‌ చేయకూడదు. అలా చేస్తే వేరే వేరే అర్థాలు వచ్చేస్తాయి. వాళ్ళ క్యారెక్టర్‌ ను ఎసాసినేషన్‌ చేసేస్తారు. ఈ అంశాలనే ’వకీల్‌ సాబ్‌’ మూవీలో చూపించారు. మహిళలను, వారి ఇష్టాయిష్టాలను ఖచ్చితంగా గౌరవించాల్సిందేనని, అందుకు వారి సామాజిక, ఆర్థిక నేపథ్యం ఎంతమాత్రం ప్రధానం కాదని స్పష్టం చేశారు. ఒక మహిళకు తనకు నచ్చని విషయాన్ని నచ్చలేదని గట్టిగా చెప్పే స్వేచ్ఛను గురించి, ఒకవేళ ఎదుటి వ్యక్తి నచ్చని పని చేయమని ఒత్తిడి చేస్తే… దానిని ఏ రకంగానైనా తిరస్కరించవచ్చనే విషయాన్ని నొక్కి చెప్పారు. దాంతో ఇది ప్రతి మహిళా మెచ్చే చిత్రంగా నిలిచింది. ప్రధానంగా వర్కింగ్‌ ఉమెన్‌ ఎదుర్కొంటున్న సమస్యలను ఈ మధ్య కాలంలో ఇంత చక్కగా చూపించిన సినిమా మరొకటి లేదు. వకీల్‌ సాబ్‌ సత్యదేవ్‌ పాత్రలో పవన్‌ కళ్యాణ్‌ పూర్తి గా ఒదిగిపోయాడు. సినిమా ప్రారంభం నుండి చివరి సీన్‌ వరకూ అదే గంభీరాన్ని పాత్రోచితంగా ప్రదర్శించాడు. ఇక ద్వితీయార్థంలోని కోర్టు సీన్స్‌ లో చెలరేగిపోయాడు. యాంగ్రీ లుక్‌ తో, డైలాగ్‌ మాడ్యులేషన్‌ తో ఆకట్టుకున్నాడు. పవన్‌ నోట తెలంగాణా యాస వినడానికి కాస్తంత కొత్తగా అనిపించింది. ఇక పవన్‌ భార్య పాత్రలో శ్రుతీహాసన్‌ ఎందుకో అంతగా ఆకట్టుకోలేకపోయింది. కీలక పాత్ర పోషించిన ముగ్గురమ్మాయిలలో ఎక్కువ మార్కులు నివేదా, అంజలి లకే పడతాయి. వీరిద్దరూ కొన్ని సన్నివేశాలలో కంట తడిపెట్టించారు. అలానే అనన్య నాగళ్ళ కూడా ఉన్నంతలో బాగానే చేసింది. క్రిమినల్‌ లాయర్‌ నందగా ప్రకాశ్‌ రాజ్‌ మరోసారి తన నట విశ్వరూపం చూపించాడు. పవన్‌ కళ్యాణ్‌, ప్రకాశ్‌ రాజ్‌ మధ్య సాగే కోర్ట్‌ సీన్స్‌తో ద్వితీయార్థం మూవీ గ్రాఫ్‌ అమాంతంగా పెరిగిపోయింది. సినిమాటిక్‌ డైలాగ్స్‌ తో ఆ డ్రామా మరింత రక్తి కట్టించింది. న్యాయమూర్తిగా కెమెరామేన్‌, డైరెక్టర్‌ విూర్‌, పవన్‌ సంరక్షకుడు గా సమ్మెట గాంధీ, ఎంపీగా ముకేశ్‌ రుషి, అతని అనుచరుడుగా దేవ్‌ గిల్‌, శుభలేఖ సుధాకర్‌, షాయాజీ షిండే తదితయి ఇతర పాత్రు పోషించారు. తమన్‌ స్వరపరిచిన ’మగువ మగువ…’ పాట సినిమాకు ప్రాణంగా నిలిచింది. చాలా సన్నివేశాలకూ అదే ట్యూన్‌ ను తమన్‌ ఉపయోగించారు. రామజోగయ్య శాస్త్రితో పాటు సుద్దాల అశోక్‌ తేజ రాసిన ’కదులు కదులు’ గీతం కూడా ఉత్తేజ భరితంగా ఉంది. పవన్‌ కళ్యాణ్‌ ఇమేజ్‌ ను దృష్టిలో పెట్టుకుని చేసిన మార్పు కొంతవరకూ ఓకే. మహిళలు మెచ్చే మహిళా సాధికారత గురించి ఇందులో ఉంది. మాస్‌ మెచ్చే యాక్షన్‌ సీన్స్‌ అన్నీ ఇందులో ఉన్నాయి.

Related News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *