తృతీయ శక్తిగా తృణమూల్ కాంగ్రెస్

 తృతీయ శక్తిగా తృణమూల్ కాంగ్రెస్

కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలను అవకాశంగా మలుచుకుంటున్న దీదీ

భూమిపుత్ర, జాతీయం:

కాంగ్రెస్‌ పార్టీలో చీలికలు కొత్త కాదు. నిజానికి కాంగ్రెస్‌ పార్టీ ఎన్నిసార్లు చీలిపోయిందో, ఆ అమ్మ కడుపులోంచి ఎన్ని పిల్ల కాంగ్రెస్‌ లు పుట్టుకొచ్చాయో,అందులో ఎన్ని బతికి బట్టకట్టాయో, ఎన్ని మళ్ళీ మాతృ సంస్థలో విలీనం అయ్యాయో.. అదంతా పాత చరిత్ర. నిజానికి ప్రస్తుతం భారత జాతీయ కాంగ్రెస్‌ పార్టీగా చెలామణి అవుతున్న సోనియా గాంధీ సారధ్యంలోని కాంగ్రెస్‌ పార్టీ కూడా, 1969లో మాతృ సంస్థ నుంచి, బహిష్కరణకు గురైన, అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ పెట్టిన పిల్ల కాంగ్రెస్‌ పార్టీనే. సరే, ఆతర్వాత న్యాయ,రాజకీయ పోరాటంలో విజయం సాధించి ఇందిరా గాంధీ, విజయేందిర నిలిచారు. భారత్‌ జాతీయ కాంగ్రెస్‌ పార్టీని సొంతం చేసుకున్నారు. అది వేరే విషయం.అయితే, గతంలో ఎప్పుడూ కూడా, తల్లి పేగు తెంచుకుని బయటకు వెళ్లి పోయిన పిల్ల కాంగ్రెస్‌ వచ్చి, ‘నాదే నిజమైన కాంగ్రెస్‌, విూరు బయటకు దయ చేయండి’ అని, తల్లి కాంగ్రెస్‌ పార్టీని రాజకీయ యవనిక నుంచి బయటకు పొమ్మని అనలేదు. కానీ, ఇప్పుడు తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినాయకురాలు, పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, మాత్రం కాంగ్రెస్‌ పార్టీని ‘యుద్ధంలో అలసిపోయిన కురువృద్ధ పార్టీ’గా అభివర్ణించారు.

అర్ధశతాబ్దికి పైగా, దేశాన్ని పాలించిన పార్టీని గుడ్డొచ్చి పిల్లను ఎక్కిరించినట్లు దేశంలో ప్రధాన ప్రతిపక్షంగా తన పాత్రను నిర్వర్తించడంలో కాంగ్రెస్‌ పార్టీ విఫలమైందని, తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎక్కిరిస్తోంది. అంతే కాదు, తామే ‘నిజమైన కాంగ్రెస్‌’ అని తృణమూల్‌ అధికార పత్రికలో ప్రకటించుకుంది. సొంత రాతలు రాసుకుంది. నిజమే రాహుల్‌ గాంధీ పుణ్యాన కాంగ్రెస్‌ పార్టీ బలహీన పడింది. అది నిజం. కాంగ్రెస్‌ పార్టీ చరిత్రలో ఏనాడు లేని విధంగా వరసగా రెండు సార్లు ఎన్నికల్లో ఓడిపోవడమే కాకుండా, రెండు సార్లు రెండంకెల స్థానాలకే పరిమితం అయింది. అయినా, ఈనాటికి కూడా, దేశంలో కాంగ్రెస్‌ పార్టీకి 20 శాతం వరకు ఓటు షేర్‌ ఉంది. బీజేపీ తర్వాత ఎక్కువ రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీ, బీజేపీ పాలిత రాష్ట్రాలతో పాటుగా, ప్రాంతీయ పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలలోనూ ఎక్కువ రాష్ట్రలలో ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్న పార్టీ కూడా కాంగ్రెస్‌ పార్టీనే. అయినా, తృణమూల్‌ కాంగ్రెస్‌, విపక్షాలకు నాయకత్వం వహించే అంశంపై దేశంలో జరుగుతున్న చర్చలో, కాంగ్రెస్‌ పాత్రను చిన్నగా చేసి చూపేందుకు, చులకన చేసేందుకు ప్రయత్నిస్తోంది. బాహాటంగానే విమర్శిస్తోంది. వరసగా మూడవ సారి అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన ఉత్సాహంలోనో, లేక ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత కిశోర్‌ వ్యూహంలో భాగంగానో, కొత్త పిచ్చోడు పొద్దెరగడు అన్నట్లుగా బీజేపీ తో పోరాడే శక్తి తమకు మాత్రమే ఉందని తృణమూల్‌ సొంత పత్రిక సొంత విశ్లేషణ చేసింది.

ఈ మేరకు పార్టీ అధికార పత్రిక ‘జాగో బంగ్లా’లో ప్రచురించిన వ్యాసంలో విపక్షాలను ముందుకు తీసుకెళ్లే అంశంలో ప్రధాన ప్రతిపక్షంగా కాంగ్రెస్‌ పాత్ర అసమర్థంగా ఉంది’ అని మమత పార్టీ రచయితలు పేర్కొన్నారు. .’’కేంద్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్‌.. బీజేపీ జోరును ఆపగలగాలి. కానీ.. అంతర్గత కుమ్ములాటలు, కక్షలతో ఆ పార్టీ నలిగిపోతోంది. అయితే కాలం ఎవరి కోసం ఎదురుచూడదు. బీజేపీని ఎదుర్కొనేందుకు మరొకరు ముందుకు రావాలి. టీఎంసీ ఆ బాధ్యతను నిర్వర్తిస్తుంది. ఇదే నిజమైన కాంగ్రెస్‌’’ అంటూ జాగో బంగ్లా సంపాదకీయ కథనంలో పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం, ప్రధాని నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు సాగిస్తున్నపోరాటంలో రాహుల్‌ గాంధీ కంటే, మమతా బెనర్జీయే కీలకంగా మారారని కూడా ‘జాగో బంగ్లా’ పేర్కొంది అంతేగాక విపక్షంగా తాము అన్ని పార్టీలను కలుపుని వెళ్లాలని టీఎంసీ కోరుకుంటోందని వెల్లడించింది. ఫలితంగా కాంగ్రెస్‌ – టీఎంసీ మధ్య సంబంధాలు మరింత దెబ్బతిన్నాయి.మేఘాలయల సహా పలు రాష్ట్రాలలో కాంగ్రెస్‌ నాయకులను తమ వైపుకు తిప్పుకుంటోంది. మేఘాలయలో మాజీ ముఖ్యమంత్రి ముకుల్‌ సంగ్మా నేతృత్వంలోని 17 మంది ఎమ్మెల్యేలలో 12 మంది ఇటీవల టీఎంసీలో చేరారు. పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ప్రభుత్వాన్ని నిలదీసేందుకు కాంగ్రెస్‌తో కలసి పనిచేసేందుకు టీఎంసీ ఆసక్తి చూపించలేదు.ఆసక్తి చూపించక పోవడమే కాదు, కాంగ్రెస్‌ పార్టీని, ఓ అనామక, అర్భక పార్టీ అనే ముద్ర వేసేందుకు ప్రయత్నిస్తోంది. మరో వంక కాంగ్రెస్‌ పార్టీకి సీనియర్‌
నేతలు చాలా వరకు దూరం కావడంతో, తృణమూల్‌ దూకుడుకు కళ్ళెం వేసే నాయకులు కరువయ్యారని, కాంగ్రెస్‌ అభిమానులు ఆవేదన చెందుతున్నారు.

Related News

Leave a Reply

Your email address will not be published.