శ్రీకాకుళంలో కదం తొక్కిన కార్మిక సంఘాలు

 శ్రీకాకుళంలో కదం తొక్కిన కార్మిక సంఘాలు

కేంద్ర ప్రభుత్వ విధానాలను సమీక్షించాలి

భూమిపుత్ర, శ్రీకాకుళం:

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ ప్రజావ్యతిరేక పాలనను ఎండగడుతూ దేశవ్యాప్త నిరసనోద్యమంలో భాగంగా గురువారం శ్రీకాకుళం ఏడురోడ్ల కూడలిలో సీఐటీయూ ఆధ్వర్యంలో నల్ల రిబ్బన్లు మెడలో వేసుకుని నిరసన చేపట్టారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చిన తరువాత కార్మికులకు, రైతులకు, ప్రజలకు తీవ్రమైన నష్టం కలిగించే విధానాలని అమలు చేస్తున్నారని విమర్శించారు. కేంద్రంలో నరేంద్ర మోడీ రెండోసారి ప్రధానమంత్రి అయిన తర్వాత పూర్తిగా కార్పొరేట్‌ శక్తులకు ప్రభుత్వరంగాన్ని కారుచౌకగా అమ్మేస్తున్నారని మండిపడ్డారు. ఈ విధానాలను అన్ని వర్గాల్లో విస్తృతంగా ప్రచారం చేసి ప్రజా ఉద్యమాలను బలోపేతం చేయడానికి జూన్‌ 1నుండి 10వ తేదీ వరకు గ్రామాల్లో, పట్టణాల్లో, కార్మిక వాడల్లో, పని ప్రదేశాల్లో బిజెపి అనుసరిస్తున్న పచ్చి ప్రజావ్యతిరేక విధానాలులను విస్తృతంగా ప్రచారం చేయడం జరిగిందని అన్నారు.

కార్మికవర్గం పోరాడి సాధించుకున్న 44 కార్మిక చట్టాలను నాలుగు లేబర్‌ కోడ్‌ లుగా మార్చి యజమానులకు కట్టుబానిసలుగా కార్మికవర్గాన్ని మార్చాలని కార్మిక చట్టాలల్లో మార్పులు తీసుకొచ్చి పారిశ్రామికవేత్తలకు ఊడిగం చేస్తున్న పరిస్థితి ఉందని అన్నారు. దేశంలో ఎటువంటి కార్మిక చట్టాలు ఇకవిూదట అమలు కాని పరిస్థితి ఏర్పడిందని, కార్మికులకు ఉద్యోగ భద్రత లేకుండా అభద్రతాభావంతో ఈ పని చేయవలసిన పరిస్థితి తీసుకువచ్చారని విమర్శించారు. మరోపక్క రైతాంగానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ప్రజా వ్యతిరేక చట్టాలను తీసుకు వచ్చి వ్యవసాయ రంగాన్ని పూర్తిగా కార్పొరేట్‌ వ్యవసాయం గా మార్చేందుకు, రైతులు సాధించుకున్న చట్టాలను సైతం రద్దు చేసిన పరిస్థితి ఏర్పడిందని విమర్శించారు.రైతాంగానికి కనీస మద్దతు ధర లేకుండా, మార్కెట్‌ యార్డులు లేకుండా, ప్రభుత్వం తన బాధ్యతల నుండి తప్పించుకునేందుకు దుర్మార్గమైన చట్టాలతో తీరని ద్రోహం చేశారన్నారు.

ఈ చట్టాలకు వ్యతిరేకంగా గత ఆరు మాసాలుగా రైతులు ఢిల్లీ కేంద్రంగా పోరాటం నిర్వహిస్తున్నా బిజెపి ప్రభుత్వం చలించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌ ధరలను, నిత్యావసర వస్తువుల ధరలు అదుపు చేయకుండా ఇష్టారాజ్యంగా మార్కెట్‌ శక్తులకు విడిచిపెట్టి ప్రజలపై విపరీతమైన భారాలు మోపుతున్నారని విమర్శించారు. కరోనా కష్టకాలంలో ప్రజలందరికీ ఉచిత వ్యాక్సిన్‌ అందించడంలో పూర్తిగా విఫలమయ్యాయని, వ్యాక్సిన్‌ అందక లక్షలాది మంది ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితి ఉందని అన్నారు. కరోనా కాలంలో వలసకార్మికులు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు గురయితే కనీసం పట్టించుకోవడం లేదని, ప్రజలందరికీ కావలసిన మౌలిక వసతులు కల్పించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని, టీకాల ఉత్పత్తి పెంచి, అందరికీ టీకాలు కేంద్రమే ఉచితంగా వేయాలని, రాబోయే 3వ దశకు సరిపడా బెడ్లు, ఆక్సీజెన్‌, మందులు మరియు ఆరోగ్య మౌలిక సదుపాయాలు ముందుగానే సిద్ధం చేయాలని డిమాండ్‌ చేశారు.

ఆరోగ్య రంగంలో ఉన్న ఫ్రంట్‌ లైన్‌ వర్కర్లకు,పారిశుద్ధ్య కార్మికులకు, ఆశాలు, అంగన్వాడీలతో సహా మిగిలిన వారికి రక్షణ పరికరాలు,50లక్షల భీమా సౌకర్యం కల్పించాలని డిమాండ్‌ చేశారు. కార్మికులను ఉద్యోగాల నుండి తొలగించకుండా, వేతనాలకు కోత విధించకుండా, అద్దె ఇంటినుంచి ఖాళీ చేయించకుండా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఆదాయ పన్ను పరిధిలో లేని కుటుంబాల ఖాతాలకు నెలకు రూ.7500/లు నగదు బదిలీ చేయాలని, రాబోయే 6నెలల కాలంలో ప్రతీ వ్యక్తికి నెలకు పదికిలోల ఉచిత ఆహార ధాన్యాలు అందించాలని డిమాండ్‌ చేశారు. కరోనా కాకుండా ఇతర జబ్బులతో బాధపడుతున్న రోగులకు ప్రభుత్వ ఆసుపత్రులలో పూర్తిస్థాయిలో వైద్య సహాయం అందించాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వరంగ సంస్థల ప్రైవేటీకరణ మరియు వాటిలో పెట్టుబడుల ఉపసంహరణ నిలుపుదల చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ విధానాలకు వ్యతిరేకంగా కార్మికుల, రైతులు, ప్రజలంతా భవిష్యత్‌ పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.

Related News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *