సంపూర్ణంగా తాలిబన్ల వశమైన ఆప్ఘనిస్థాన్‌ !!

 సంపూర్ణంగా తాలిబన్ల వశమైన ఆప్ఘనిస్థాన్‌ !!

భూమిపుత్ర,సంపాదకీయం:

అఫ్ఘనిస్తాన్‌లో తాలిబన్ల తుపాకులు మాత్రమే ఇక గర్జించ నున్నాయి. వారి బూట్ల చప్పుడు మాత్రమే ఇక అక్కడ వినిపించనుంది. వారి అదుపాజ్ఞలు మాత్రమే ఇక చెల్లుబాటు అవుతాయి. వారు చెప్పిందే వేదం..చేసిందే శాసనం..తీసిందే ప్రాణం అన్న తీరుగా వారి పాలన సాగనుంది. అదే సమయంలో ప్రజల హాహాకారాలు కూడా వినిపించనున్నాయి. రెండు దశాబ్దాలుగా తన గుప్పిట ఉన్న అఫ్ఘాన్‌ను అమెరికా సైన్యం వదిలి వెళ్లడంతో తాలిబన్లు సంబరాలు చేసుకున్నారు. తమకు స్వేచ్ఛా స్వాంత్య్రాలు లభించాన్న ఆనందంలో బాణాసంచాకాల్చారు. ఈ క్రమంలో అక్కడ ఇప్పుడు ఏదో తెలియని నిశ్శబ్దం అది తప్పకుండా శ్మశాన నిశ్శబ్దం లాంటిదే. సాయుధ తాలిబన్ల పహారాలో భీతావహ నిశ్శబ్దం తాండవిస్తోంది. మొన్నటి దాకా జనంతో కిటకిటలాడిన కాబూల్‌ విమానాశ్ర యంతో పాటు అక్కడి రోడ్లు ఇప్పుడు నిర్మానుష్యంగా దర్శనమిస్తున్నాయి.తాలిబన్ల తుపాకీ చప్పుల్లే వినిపిస్తున్నాయి. అఫ్గాన్‌ను పూర్తిగా విడిచివెళ్ళడానికి అమెరికన్‌ సైనిక బలగాలు పెట్టుకున్న ఆగస్టు 31 తుది గడువు ముగియడానికి ఆరు గంటల కన్నా తక్కువ సమయం ఉన్న పరిస్థితుల్లో అమెరికా దళాలు తమ స్వదేశానికి తిరుగు ప్రయాణం కట్టాయి.

ఇక తాలిబన్ల గుప్పిట్లోకి పూర్తిగా వశమైన ఈ దేశంలో అంతటా అనిశ్చితి నెలకొంది. ఎప్పుడేం జరుగుతుందో తెలియని భయం ఆవరించింది. ఇప్పటికే అఫ్గాన్‌లో ఆర్థిక సంక్షోభం. బ్యాంకులు మూతబడ్డాయి. ధరలు కొండెక్కాయి. తిండి దొరక్క మానవతావాదులిచ్చే ఆహారం కోసం పిల్లలు, పెద్దలు ఎగబడుతున్న దృశ్యాలు గుండెలను పిండేస్తున్నాయి. మానవీయ కోణం పక్కకు పెట్టి, భౌగోళిక రాజకీయాల పరంగా చూసినా ఇది అఫ్గాన్‌కే పరిమితమైన సంక్షోభంగా చూడరాదు. తీవ్రవాద ముప్పు, వేల మంది శరణార్థుల వ్యవహారం కాబట్టి, ప్రపంచ సంక్షోభంగానే పరిగణించాలి. ఇరవై ఏళ్ళ క్రితమే వ్యూహాత్మక తప్పిదం చేసిన అమెరికా సహా అంతర్జాతీయ సమాజం ఇప్పుడిలా మూల్యం చెల్లించాల్సి వస్తోంది. ఇది ఇప్పుడిప్పుడే ఆరని రావణకాష్ఠంలా కనిపిస్తోంది. మరోపక్క అమెరికా వెంటాడి వేటాడిన ఒసామా బిన్‌ లాడెన్‌ మాజీ అంగరక్షకుడు అల్‌ఖైదా కమాండర్‌ అఫ్గాన్‌కు తిరిగి రావడంతో, తీవ్రవాదంలో పరాకాష్ఠకు చేరిన ’ఇస్లామిక్‌ స్టేట్‌ ఖొరసాన్‌’ (ఐఎస్‌`కె) సహా అనేక తీవ్రవాద సంస్థలకు మళ్ళీ అప్గాన్‌ అడ్డాగా మారినట్టయింది.

ఒకపక్క భయపెడుతున్న తాలిబన్ల హింసాత్మక పాలన మరోపక్క వివిధ తీవ్రవాద వర్గాల ఆత్మాహుతి దాడులతో అక్కడి అమాయక అఫ్గాన్‌ ప్రజల్లోనూ తీరని వేదన కనిపిస్తోంది. వారి పరిస్థితి ఇప్పుడు అడకత్తెరలో పోక చెక్కలా తయారయ్యింది. దాదాపు 180 మంది అప్గాన్లు, 13 మంది అమెరికన్‌ సైనికులను బలిగొన్న ఆగస్టు 26 ఆత్మాహుతి దాడుల నుంచి సోమవారం ఉదయం విమానాశ్రయం లక్ష్యంగా సాగిన రాకెట్‌ దాడుల తరవాత అమెరికా దళాల నిష్కమ్రణ తరవాత ఇప్పుడు అక్కడ కనిపించని భయం ఆవరించింది. ఎప్పుడు తాము ఏ రాక్షసుడి తుపాకీ గుళ్లకు బలైపోతామో అన్న బెంగ పట్టుకుంది. అడవిలో చేరిన సింహాల్లా, తోడేళ్లలా తాలిబన్లు కాచుకుని కూర్చున్నారు. తీవ్రవాదంపై పోరు పేర నాటో సేనలతో కలసి అమెరికా 20 ఏళ్ళు చేసిన పోరాటం వృధానే అన్న సంగతి ఇప్పుడు తెలిసి వచ్చింది. ఈ 20 ఏళ్లలో ప్రపంచంతో కలసి పనిచేసిన, తమ స్వేఛ్చను కలసి పంచుకున్న ప్రజలకు ఇప్పుడా అవకాశం లేదు, ఉండదు.రాదు కూడా.

సైనిక ఉపసంహరణతో కథ మళ్ళీ మొదటికే వచ్చింది. తాలిబన్లు తమ రాక్షస కృత్యాలకు పనిచెప్పే సమయం కోసం ఎదురుచూస్తున్నారు. ఇకపోతే దాదాపు 1.14 లక్షల మందిని అప్గాన్‌ నుంచి అమెరికా తరలించింది. తమ దేశమే అయినా అక్కడ ఉండే స్వేచ్ఛ లేదనుకున్న ఎందరో ఇప్పటికీ కొన్ని వందల మంది అక్కడి నుంచి బయటపడేందుకు బేలగా నిరీక్షిస్తున్నారు. అగ్రరాజ్యానికి ఇప్పటి దాకా బాసటగా నిలిచినందుకు ఇప్పుడు ప్రాణాల విూదకు తెచ్చుకున్న అఫ్గాన్ల పరిస్థితి ఏమిటో తెలీదు. మరోపక్క శరణార్థుల తరలింపు కోసం కాబూల్‌లో ఉంచిన వైమానిక దళ విమానాలను భారత్‌ వెనక్కి రప్పిస్తోంది. తాలిబన్లపై ఒత్తిడి పెంచడానికి ఐరాస భద్రతాసమితిలో ప్రయత్నాలు సాగుతున్నాయి. అఫ్గాన్‌ వ్యవహారంలో ప్రపంచ దేశాలకు ఏకీభావ వైఖరి అవసరం. అదే ఇప్పుడు ప్రయత్నం కూడా. కానీ, చైనా, రష్యాలు ఇప్పటికే అఫ్గాన్‌ సానుకూల వైఖరితో ఉన్నందు వల్ల అది సాధ్యమవుతుందా అన్నది ప్రశ్న. కాబూల్‌ విమానాశ్రయం వద్ద సురక్షిత జోన్‌ను కోరుతూ, ఫ్రాన్స్‌, బ్రిటన్‌లు భద్రతాసమితిలో తీర్మానం ప్రవేశపెట్టే పనిలో పడ్డాయి.

భద్రతా సమితి తాత్కాలిక నెలవారీ అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకొనే లోగా, పాక్‌ ప్రేరేపిత తాలిబన్లపై ఒత్తిడి పెంచాలని భారత్‌ విశ్వప్రయత్నం చేస్తోంది. భద్రతాసమితిలో శాశ్వతసభ్యులైన చైనా, రష్యాలు ఇప్పటికే తాలిబన్‌ సానుకూల వైఖరిలోకి వచ్చాయి. పొరుగుదేశం పాకిస్తాన్‌ తాలిబన్లకు అధికారిక వాణిలా మాట్లాడుతోంది. అమెరికా తన సైన్య ఉపసంహరణపై అనాలోచిత నిర్ణయం, దోహా చర్చల్లో అమాయకంగా తాలిబన్లను నమ్మడంతో 8500 కోట్ల డాలర్ల విలువైన అమెరికన్‌ ఆయుధాలు ఇప్పుడు తాలిబన్ల చేతుల్లో పడ్డాయి. అమెరికా వదిలేసిన పదుల కొద్దీ బ్లాక్‌ హాక్‌ హెలికాప్టర్లు, విమానాలు, కార్గో విమానాలన్నీ వారి కనుసన్నల్లో చేరాయి. అఫ్గాన్‌ భూభాగంపై తీవ్రవాదాన్నీ, తీవ్రవాద కార్యకలాపాలనూ ససేమిరా అనుమతిం చమన్నది దోహా ఒప్పందంలో తాలిబన్ల వాగ్దానం. అయితే తాలిబన్లు అంత అమాయకులు కారని గతాను భవాలు చెబుతున్నాయి. అఫ్గాన్‌కు భారత్‌ కీలక దేశమనీ, భారత్‌తో వాణిజ్య సంబంధాలు కొనసాగించాలని భావిస్తున్నామనీ తాలిబన్‌ నేత ఒకరు ప్రకటించారు. తరతరాలుగా సాంస్కృతిక, ఆర్థిక, రాజకీయ బంధాలున్న ఆప్ఘన్‌తో ఆ స్నేహం ఆహ్వానించదగినదే. కానీ ఆప్ఘన్ గడ్డ విూద నుంచి పెరుగుతున్న తీవ్రవాద ముప్పు ఇప్పటికే దేశరక్షణపై భారత్‌కు ఆందోళన కలిగిస్తోంది.

Related News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *