తిరుమల ఉద్యోగుల్లో కరోనా భయం

 తిరుమల ఉద్యోగుల్లో కరోనా భయం

పలువురు ఉద్యోగుల మృతితో ఆందోళన

దర్శనాలకు వచ్చేవారితోనే వ్యాప్తి

భూమిపుత్ర ,తిరుమల:

తిరుమలకు చెందిన పలువురు ఉద్యోగులు కరోనా బారిన పడి మృత్యువాత పడడంతో ఇప్పుడు ఉద్యోగుల్లో టెన్షన్‌ మొదయ్యింది. టీటీడీపైనా సెకండ్‌ వేవ్‌లో కరోనా తన పంజా విసురుతోంది. పాజిటివ్‌ కేసులు పెరుగుతూ వస్తున్నాయి. ఈ వేవ్‌లో ఇప్పటికే 15 మంది మృతి చెందడంతో ఉద్యోగులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. సెకండ్‌వేవ్‌లో సుమారు 150 మందికిపైగా ఉద్యోగులు వైరస్‌ బారినపడ్డారు. వీరిలో 13 మంది శాశ్వత ఉద్యోగులు, ఇద్దరు కాంట్రాక్టు కార్మికులు మృతి చెందారని టీటీడీ ఉద్యోగ సంఘాలు చెప్తున్నాయి. బుధవారం ఒక్కరోజే అన్నదాన భవనంలో పనిచేసే ఓ సర్వర్‌తోపాటు విజిలెన్స్‌ విభాగంలో పనిచేసే ఓ జమేదార్‌, ఇంజనీరింగ్‌ విభాగానికి చెందిన ఓ ఉద్యోగి మృతి చెందారు. గురువారం కూడా మరో ఇద్దరు కరోనాతో పోరాడుతూ తుదిశ్వాస విడిచారు.

కాగా.. మృతి చెందినది 15 మందని టీటీడీ ఉద్యోగ సంఘాలు చెప్తున్నా కాంట్రాక్టు ఉద్యోగుల్లో మృతి చెందిన వారి సంఖ్య ఇంకా అధికంగానే ఉన్నట్టు సమాచారం. మృతుల సంఖ్య పెరుగుతున్నా డ్యూటీ విధానంలో మార్పులేక పోవడంతో ఉద్యోగులు భయం భయంగా విధులకు హాజరవుతున్నారు. ఇంటి వద్ద నుంచే పనిచేసే అవకాశం ఉన్నవారికి ఆ వెసులుబాటు కల్పించాలని మరికొందరు కోరుతున్నారు. తిరుమల బాలాజీనగర్‌లోనూ సెకండ్‌వేవ్‌లో దాదాపు 20 మంది కొవిడ్‌తో చనిపోయినట్లు స్థానికులు చెబుతున్నారు. 15 రోజుల్లోనే వీరంతా చికిత్స పొందుతూ చనిపోయారని, మృతుల్లో మూడు జంటలు కూడా ఉన్నాయని తెలిపారు.  గత ఏడాది మార్చిలో కరోనా కేసులు అధికంగా ఉన్నప్పుడు ఆనె 21వ తేదీ నుంచి శ్రీవారి దర్శనాలను టీటీడీ రద్దు చేసిన విషయం తెలిసిందే. అయినా దాదాపు 800 మందికిపైగా ఉద్యోగులు వైరస్‌ బారినపడ్డారు. వీరిలో ఓ అర్చకుడు, ఆరుగురు ఉద్యోగులహ మృతి చెందిన విషయం తెలిసిందే. దీంతో 15 రోజుల డ్యూటీని టీటీడీ అమలు చేసింది.

ఆ తర్వాత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్‌ సడలింపు ఇవ్వడంతో జూన్‌ 8వ తేదీ నుంచి ఆరువేల మందితో శ్రీవారి దర్శనాలను మొదలుపెట్టారు. ఆ తర్వాత తగ్గుతూ వచ్చిన కొవిడ్‌ కేసులకు అనుగుణంగా భక్తుల దర్శనాల సంఖ్యను కూడా పెంచుతూ వచ్చారు. ఈ ఏడాది మార్చి మొదటివారానికి 25వేల రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు, 22వేల టైమ్‌ స్లాట్‌ సర్వదర్శనం టోకెన్లు, రూ.300 సుపథం ప్రవేశం, వీఐపీ బ్రేక్‌, శ్రీవాణి, ఆన్‌లైన్‌ ఆర్జిత సేవ టికెట్లు అంటూ రోజుకు సగటున 50వేల మందికి శ్రీవారి దర్శనం కల్పించేలా ఏర్పాట్లు చేశారు. రెండో వారం తర్వాత కరోనా సెకండ్‌వేవ్‌ కేసులు అధికమవుతున్న క్రమంలో తిరుపతిలో ఇచ్చే టైమ్‌ స్లాట్‌ సర్వదర్శన టోకెన్లను పూర్తిగా రద్దుచేశారు. దాదాపు 30వేల మందికి శ్రీవారి దర్శన ఏర్పాట్లు చేసినా కొవిడ్‌ కేసులను చూసి, భక్తు తమ పర్యటనలను వాయిదా వేసుకుంటున్నారు. దీనివల్ల ప్రస్తుతం 15వేలలోపే భక్తులు తిరుమలకు వస్తున్నారు.భక్తుల సంఖ్య తక్కువగా ఉన్నప్పటికీ టీటీడీ శాశ్వత, కాంట్రాక్టు ఉద్యోగులు మాత్రం విధులకు హాజరవ్వక తప్పడం లేదు. తెలుగు రాష్ట్రాలతో పాటు కరోనా అధికంగా ఉన్న కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు వంటి ప్రాంతాల నుంచి భక్తులు దర్శనానికి వస్తుండటంతో ఆలయంతో పాటు రిసెప్షన్‌ వంటి ముఖ్య విభాగాల్లో పనిచేసే ఉద్యోగులు హడలిపోతున్నారు.

Related News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *