టిపుసుల్తాన్ మతోన్మాద ప్రచారం- వాస్తవాలు

 టిపుసుల్తాన్ మతోన్మాద ప్రచారం- వాస్తవాలు

భూమిపుత్ర,చరిత్ర:

ప్రముఖ ఐరిష్ రచయుత “జార్జి బెర్నార్డ్ షా” ఒక సందర్భంలో “పాలిటిక్స్ ఈస్ లాస్ట్ రిసార్ట్ ఆఫ్ స్కౌండ్రల్స్” అంటారు. అది ఈ నాటి పరిస్థితులకు ఎంతవరకు సరిపోతుందో తెలియదు కానీ కొన్నిసార్లు నిజమేననిపిస్తుంది నేడు జరుగుతున్న విగ్రహ రాజకీయాలను చూస్తుంటే.

చరిత్ర- ఇది ఒక పెద్ద సబ్జెక్ట్. ఎవరి కోణంలో వారు విశ్లేషించుకుంటూ వాస్తవాలు మరుగునపరిచి అదే చరిత్ర అని మూర్ఖంగా వాదిస్తుంటారు.వ్యక్తుల జీవితంలో కొంత భాగాన్ని మాత్రమే తీసుకుని దాని ముందు,వెనుక జరిగిన సంఘటనలను ప్రస్తావించకుండా ఆ భాగాన్నే పదేపదే ప్రస్తావిస్తూ అదే చరిత్ర అని పదిమందిని నమ్మించాలని చూస్తుంటారు. ఇక విషయానికొస్తే గత రెండు రోజులుగా కడప జిల్లా ప్రొద్దుటూరులో టిప్పుసుల్తాన్ విగ్రహ ఏర్పాటు దుమారం లేపుతోంది. ఆ విషయంలో వివిధపార్టీలు లేవనెత్తుతున్న అభ్యంతరాలను పక్కనబెడితే వాస్తవమేమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

టిపు సుల్తాన్ 1750 నవంబర్ 20 న దేవనహళ్ళి కోటలో జన్మించాడు.తండ్రి హైదరాలీ.తల్లి ఫాతిమా ఫక్రున్నీసా. తండ్రి హైదరాలీ పూర్వీకులు అరేబియా లోని నవాయత్ తెగకు చెందిన వారు.మధ్యయుగ కాలంలో భారతదేశంలో ముస్లిం రాజ్యస్థాపన జరగడంతో అరేబియా, ఇరాన్, టర్కీ, ఇరాక్, మంగోలియా,ఆఫ్ఘనిస్తాన్ వంటి దేశాలనుండి భారతదేశానికి జీవనోపాధి నిమిత్తం,ఇక్కడి పాలకుల కొలువులలో ఉద్యోగాలకోసం వలసవచ్చినవారు. హైదరాలీ అనేక పరిణామాల అనంతరం మైసూరు రాజు కృష్ణ ఒడయార్ సంస్థానంలో సర్వ సైన్యాధ్యక్షుడు. టిపు తల్లి ఫాతిమా ఫక్రున్నీసా కడప నవాబు కొలువులో కడప కోటకు అధిపతిగా ఉన్న మీర్ మొయినుద్దీన్ కుమార్తె. టిపు పూర్తి పేరు టిపు సుల్తాన్ ఫతే అలీ.

హైదరాలీ నిరక్షరాస్యుడైనా టిపుసుల్తాన్ కు మాత్రం ఉర్దూ,పార్శీ,అరబిక్,కన్నడ,మరాఠీ భాషలలో ప్రావీణ్యముంది. ప్రపంచ ప్రసిద్ధి గాంచిన మైసూరు సిల్క్ వస్త్రాల స్థాపనకు ఆద్యుడు టిపు.మస్కట్,బెంగాల్ ల నుంటి పట్టుపురుగులను తెప్పించి మల్బరీ తోటలను పెంచి పట్టుపురుగుల పెంపకాన్ని అభివృద్ధి చేసిన ఘనత టిపుది. యుద్ధంలో రాకెట్ సాంకేతికతను ఉపయోగించి కొత్త ఒరవడికి నాందిపలికినవారు హైదరాలీ,టిపులే. ఒకేసారి 500 రాకెట్లను ప్రయోగించే సామర్థ్యం కలిగియుండేది వీరి ఫిరంగిదళం. టిపు పాలనలో కులమతాలకు అతీతంగా ప్రతిభ కే పట్టం కట్టే పద్ధతి ఉండేది. మంగళూరు సంధి చర్చల విషయంలోనూ,మలబారు చర్చల సందర్భంగానూ అప్పాజీరావు,శ్రీనివాసరావు, మాదన్న వంటి హిందువులనే నియమించాడు. విశ్వసించాడు.

బ్రిటీష్ వారు తమ చర్యలు విఫలమయినపుడల్లా తమ దేశ ప్రజల దృష్టి మరల్చడానికి టిపును మతోన్మాదిగా,నియంతగా ముద్ర వేశారు.కవితలు రాశారు. నాటకాలు వేశారు. పెయిడ్ ఆర్టికల్స్ ప్రచురించారు. ఈ దుష్ప్రచారం ఎంతవరకూ సాగిందంటే ఆయన మరణించిన మరణం (మే 4, 1799) 221 సంవత్సరాల తరువాత కూడా అవి ఆగలేదు. బలవంతపు మత మార్పిడులు చేశాడని,దేవాలయాలను ధ్వంసం చేశాడని మార్క్ విల్ట్ అనే ఒడయారుల సంస్థానంలోని బ్రిటీష్ వ్యక్తి రాశాడు. వాస్తవానికి ఆయన రాజు. తన సామ్రాజ్య విస్తరణలో భాగంగా తన స్థానాన్ని పదిలపరుచుకోవడానికి రాజ్యంలో జరుగుతున్న పరిణామాలను ఎప్పటికప్పుడూ తెలుసుకుంటూ తనకు వ్యతిరేకంగా జరుగుతున్న కుట్రలను పసిగడుతూ వారికి కఠిన శిక్షలు విధించడం సహజం. అలా చేయకపోతే విచ్ఛిన్నకర శక్తులు పేట్రేగిపోయి రాజ్యం కూలిపోతుంది. అందులో భాగంగానే మలబార్ నాయర్లయినా,గోవా క్రైస్తవులైనా,ప్రజలకు ఇబ్బంది కలిగించే మహదవీలకైనా మరణశిక్ష వేయకుండా మతమార్పిడిని శిక్షగా అమలు చేశాడు. దానికి బ్రిటీషర్లు మతం రంగు పులిమారు.

ఎనిమిదవ శతాబ్దంలో ఆదిశంకరాచార్యులు స్థాపించిన కర్ణాటకలోని షిమోగాలోని శృంగేరీ పీఠంపై మరాఠాలు దాడి చేసి ధ్వంసం చేసి ఆభరణాలను,బంగారాన్ని,ధనాన్ని కొల్లగొట్టి విగ్రహాలకు నష్టం కలిగించినపుడు మఠాధిపతి సచ్చిదానంద విజ్ఞప్తి మేరకు అప్పటికి మూడో మైసూరు యుద్ధంలో తాను పరాజితుడై యున్నప్పటికీ పూజల పునరుద్ధరణకు,విగ్రహ పునఃప్రతిష్ఠాపనకై సరిపడినంత ధనాన్ని,రక్షణ నివ్వాల్సిందిగా ఆ ప్రాంతంలో ఉండే తన అధికారులకు తెలియచేశాడు. మఠాధిపతిని జగద్గురువుగా సంబోధిస్తూ అనేక ఉత్తర ప్రత్యుత్తరాలను జరిపాడని తర్వాత జరిగిన పరిశోధనలలో వెల్లడైనట్లు మైసూరు రాజ్య పురావస్తు శాఖ డైరెక్టర్ రావుబహద్దూర్ నరసింహాచార్ వెల్లడించారు. తన రాజ్యంలోని ఆలయాల నిర్వహణకు,పాలనకు ప్రత్యేక శాఖను నియమించడం ఆయన మతసామరస్యానికి నిదర్శనం. కడప జిల్లాలోని పులివెందులలోని ఆంజనేయ స్వామి దేవాలయం,వెంకటాచలపతి దేవాలయంలో ఆగిపోయిన పూజల పునరుద్ధరణకై ఆజ్ఞలు జారీ చేశాడు.

బ్రాహ్మణులకు భృతిని ఏర్పాటు చేశాడు.ఇదే జిల్లాకు చెందిన గొల్లపల్లి,తొంగపల్లి కి చెందిన గ్రామశిస్తులను పుష్పగిరికి చెందేలా ఆజ్ఞాపత్రాలు జారీ చేశాడు. శ్రీరంగపట్నం లోని రంగనాథాచార్యుల దేవాలయంలో వెండిగిన్నెలను,కర్పూరహారతినిచ్చే గిన్నెలను బహుకరించినట్లు శాసనాలు లభ్యమవుతున్నాయి. తన తండ్రి పునాది వేసిన కంచి గోపుర నిర్మాణాన్ని పూర్తి చేశాడు.మెల్కొటే దేవాలయంలో హిందూ తెగలైన వడగలై,తెంగలై శాఖల మధ్య నెలకొన్న వివాదాలను పరిష్కరించాడు. నంజన్ గూడలోని నంజుండేశ్వర దేవాలయంలో పచ్చలతో పొదిగిన శివలింగానికి నేటికీ పూజలు జరుగుతూనే ఉన్నాయి. ఒడయారు రాజుల సంప్రదాయాలను గౌరవించడమే కాక వారు పాటించే పద్ధతులను ఈయన కూడా పాటించేందుకు ప్రయత్నించారు. దసరా ఉత్సవాలను ఘనంగా పదిరోజులు జరిపేవాడు. తన రాజ్యంలోని అత్యధికులైన హిందువుల మనోభావాలను గౌరవించి ,పాలకుడిగా మత పరిరక్షణకు,అభివృద్ధికి కృషి చేసినట్లు అనేక చారిత్రక ఆధారాలు ఉన్నా బ్రిటీష్ రచయితలు,చరిత్రకారులు వాస్తవాలను పరిగణనలోకి తీసుకోకుండా తమ సామ్రాజ్యకాంక్షతో ఆయనను మతోన్మాదిగా చిత్రీకరించారు.

కలకత్తా విశ్వవిద్యాలయంలో సంస్కృతాధిపతిగా ఉన్న హరప్రసాద్ శాస్త్రి టిపుసుల్తాన్ బలవంతపు మతమార్పిడులు ఇష్టంలేక 300 మంది బ్రాహ్మణులు ఆత్మహత్య చేసుకున్నారని రాశాడు. ఆ పాఠ్యాంశం చాలా రోజులుగా అలాగే ఉండిపోయింది. ఆ తర్వాత అలహాబాద్ విశ్వవిద్యాలయంలో ఆచార్యులుగా పనిచేసిన బి.ఎన్. పాండే హరప్రసాద్ శాస్త్రి గారిని మీరు రాసిన గ్రంథానికి ఆధారాలను చూపమని హరప్రసాద్ శాస్త్రి గారికి లేఖ రాస్తే ఆయన దగ్గర నుండీ ఉలుకూపలుకూ లేదు.అప్పటికే టిపు సుల్తాన్ సచ్చిదానంద భారతికి రాసిన లేఖలు వెలుగులోకి వచ్చాయి. పట్టువదలని విక్రమార్కుడిలాగా బి.ఎన్.పాండే హరప్రసాద్ గారిని మీరు సమాధానమివ్వకపోతే మీరు మేధోవంచనకు పాల్పడ్డారని అనుకోవలసివస్తుందని అన్నపుడు మైసూరు గెజిటీర్ లో సమాచారం ఉన్నదని లేఖరాసి ఊరుకున్నాడు.బి.ఎన్.పాండే ఈ విషయంపై చరిత్ర లో లబ్ధప్రతిష్టులైన శ్రీకాంతయ్య ను సంప్రదించగా ఆయన గెజిట్ లో బ్రాహ్మణులు ఆత్మహత్య చేసుకున్న ఘటన లేదనీ, టిపుసుల్తాన్ దేవాలయాల కోసం చేసిన సేవల గురించి మరింత సమాచారాన్నిచ్చాడు.అప్పుడు ఆయన విశ్వవిద్యాలయ ఉన్నతాధికారులను సంప్రదించి పాఠ్యపుస్తకంలోనుండి ఆ అంశాన్ని తొలగించాడు. అప్పటికే జరగవలసిన నష్టం జరిగిపోయింది. ఆ పాఠ్యాంశాలను చదువుకున్న విద్యార్థులు టిపు సుల్తాన్ పట్ల ద్వేషభావం నాటుకుపోయింది. ఈ ఉదంతం టిపు మీద జరిగిన తప్పుడు ప్రచారానికి ఒక ఉదాహరణ మాత్రమే.

టిపు గురించి వాస్తవ దృక్పథం తో కూడిన సమాచారం కావాలంటే 1967 లో సుబ్బరాయ గుప్తా రచించిన న్యూ లైట్ ఆన్ టిపు సుల్తాన్,కాశ్మీర్ విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ మోహిబ్బుల్ హసన్ 1951 లో రాసిన హిస్టరీ ఆఫ్ టిపుసుల్తాన్,1970 లో డెనిస్ ఫారెస్ట్ రాసిన టైగర్ ఆఫ్ మైసూర్ &ది లైఫ్ అండ్ డెత్ ఆఫ్ టిపు చదవండి.నేను ఎప్పుడూ చెప్పే మాటే మరొక్కసారి చెపుతున్నాను. పుస్తకాలు విస్తృతంగా అధ్యయనం చేస్తే విషయపరిజ్ఞానం పెరుగుతుంది. చదవకుండా మేము పట్టుకున్న కుందేలుకు మూడే కాళ్ళు అని మూర్ఖంగా వాదిస్తే మీతో వాదించి ప్రయోజనం లేదని గ్రహించి మిన్నకుండిపోతారు.

ఇతర భారతీయ సంస్థానాధిపతులవలె శ్వేతజాతీయులతో సైన్యసహకార ఒప్పందాన్ని కుదుర్చుకుని సామంతుడిగా ఉండటానికి ఆంగీకరించియుంటే రక్షింపబడి ఉండేవాడు. ఓడిపోతాను, మరణిస్తానని తెలిసీ కూడా అందుకు ఒప్పుకోలేదు. తన ఆత్మగౌరవాన్ని,స్వాతంత్రాన్ని తాకట్టు పెట్టలేదు.బలి అయినా మైసూరు పులిగా,ప్రజారంజక పాలకుడిగా కర్ణాటక జానపద లావణీలలో చిరంజీవిగా నిలిచిపోయాడు.

సాకే శ్రీహరిమూర్తి., ఎం.ఏ,ఎల్ఎల్.బీ.,
ఎం.ఏ.,జర్నలిజం& మాస్ కమ్యూనికేషన్.,
ఎం.ఏ.,హిందీ & తెలుగు.

Related News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *