పదవతరగతి పరీక్షలపై తొలగని ప్రతిష్టంభన

 పదవతరగతి పరీక్షలపై తొలగని ప్రతిష్టంభన

తెలంగాణలో పరీక్షలు లేకుండానే ఫలితాల ప్రకటన

భూమిపుత్ర , విజయవాడ :

కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో  కర్ఫ్యూ కొనసాగుతున్న వేళ పదో తరగతి పరీక్షలు జరుగుతాయా  లేక రద్దు చేస్తారా అనే విషయంలో గందరగోళం తొలగడం లేదు . వీటిపై ప్రభుత్వం నుంచి స్పష్టత లేక పోవడంతో విద్యార్థులు , వారి తల్లిదండ్రులతో పాటు ఉపాధ్యాయుల్లోనూ అయోమయం నెలకొంది . వార్షిక పరీక్షలు నిర్వహించి తీరుతామని సిఎం జగన్ , మంత్రి ఆదిమూలపు సురేశ్ ఇప్పటికే ప్రకటించారు . తాజాగా పరీక్షలపై జోక్యం చేసుకోవాలని టిడిపి నేత లోకేశ్ కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు లేఖ రాశారు . మరోవైపు తెలంగాణలో టెన్ ఫలితాలు ప్రకటించి ర్యాంకులు కూడా తెలిపారు . ఇంటర్ అడ్మిషన్ల షెడ్యూల్ కూడా ప్రకటించారు . దీంతో ఇప్పుడు ఎపిలో పరీక్షల పై విద్యార్థుల్లో టెన్షన్ మొదలయ్యింది .

 కరోనా ప్రొటోకాల్ ప్రకారం పరీక్షలు నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి ఆదిమూలపు సురేశ్ పదేపదే చెప్తున్నారు . ఇదే క్రమంలో పది విద్యార్థులకు ఇప్పటి వరకు పాఠశాలలో నిర్వహించిన పరీక్షల మార్కులను అప్లోడ్ చేయాలని ప్రధానోపాధ్యాయులకు ప్రభుత్వం తాజాగా ఆదేశాలు జారీ చేసింది . ఈ నేపథ్యంలో పది పరీక్షల పై ఉపాధ్యాయులు , విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు . ప్రభుత్వం రోజుకో రకమైన ఆదేశాలు జారీ చేస్తుండటంతో ప్రతి ఒక్కరిలోనూ పరీక్షల నిర్వహణపై అయోమయం నెలకొంది . పరీక్షలు నిర్వహించే ఉద్దేశం ఉన్నప్పుడు , విద్యార్థుల పాత మార్కులను ఎందుకు అప్ లోడ్ చేయమంటారని కొందరు ప్రశ్నిస్తున్నారు . ఫార్మాటివ్ అసెస్మెంట్ విధానాన్ని గత ప్రభుత్వం ప్రవేశపెట్టింది . ఈ విధానంలో పదో తరగతి విద్యార్థులకు 80 మార్కులకు మాత్రమే ఫైనల్ పరీక్షలు నిర్వహించేవారు .

  మిగిలిన 20 మార్కులు యూనిట్స్ , మూడు నెలలు , అర్ధసంవత్సర పరీక్షల్లో విద్యార్థికి వచ్చే మార్కుల శాతాన్ని బట్టి వాటికి కలిపేవారు . ఆ మార్కుల శాతాన్ని మెయిన్ పరీక్షలకు ముందు అప్ లోడ్ చేసేవారు . వీటిని విద్యార్థులు సాధించిన మార్కులతో కలపి , తుది ఫలితాలను విడుదల చేసేవారు . ఇలా అప్లోడ్ చేసే విధానాన్నే ఫార్మాటివ్ అసస్మెంట్ అంటారు . ఈ విధానం వల్ల కార్పొరేట్ స్కూల్ విద్యార్థులకు 100 శాతం మార్కులు వస్తున్నాయన్న కారణంతో , అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రస్తుత జగన్ ప్రభుత్వం దీనిని పూర్తిగా రద్దు చేసింది . ఈ విధానం ఆధారంగానే తెలంగాణ ప్రభుత్వం ఈ ఏడాది పది పరీక్షలు రద్దు చేయగానే విద్యార్థులకు మార్కులను కేటాయించి , సర్టిఫికేట్లను జారీ చేసింది . రెండేళ్ల క్రితం రద్దు అయిన విధానాన్ని ప్రభుత్వం ఈ నెల 18 న తిరిగి తీసుకువచ్చింది . ఈ సంవత్సరం పది విద్యార్థులకు నిర్వహించిన రెండు పరీక్షల మార్కులను అప్ లోడ్ చేయాలంటూ ఆదేశాలు జారీ చేసింది . ఈ నిర్ణయం ఉపాధ్యాయులను విస్మయానికి గురిచేసింది .

  ఒక వైపు పాఠశాలలు ప్రారంభించి విద్యార్థులను పరీక్షలకు సిద్ధం చేయమం టూనే , మరోవైపు మార్కులను అప్ లోడ్ చేయమని ఎందుకు అడుగుతున్నారో అర్థం కాని పరిస్థితి ఉపాధ్యాయుల్లో నెలకొంది . ఫార్మాటివ్ అసెస్మెంట్ ను ఈ నెల 18 నుంచి ప్రారంభించి 20 నాటికి పూర్తిచేయాలని ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు ఆదేశాలు అందాయి . కానీ నేటి వరకు దీనికి సంబంధించిన సాఫ్ట్ వేర్ ను మాత్రం ప్రభుత్వం అందుబాటులోకి తీసుకురాలేదు . అసలు ఈ పక్రియకు సంబంధించి ఎటువంటి లింక్ ను పాఠశాలలకు పంపలేదని సమాచారం . కానీ ప్రస్తుత ప్రభుత్వం అప్లోడ్ పక్రియను ప్రధానోపాధ్యాయులు మాత్రమే చేయాలంటూ ఆదేశాలు జారీ చేసింది . ఎక్కువ మంది ప్రధానోపాధ్యాయులకు ఈ విధానంపై అవగాహన లేకపోవడం , మరికొంతమందికి అసలు కంప్యూటర్ పరిజ్ఞానం లేకపోవడం పెద్ద సమస్యగా మారింది . మొత్తంగా ఇప్పుడు టెస్త్ పరీక్షలు జరుగుతాయా లేక రద్దు చేస్తారా అన్నది తెలియక విద్యార్థులు , వారి తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది .

Related News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *