టీనేజ్ మ్యారేజ్ కు బ్రేక్!!

 టీనేజ్ మ్యారేజ్ కు బ్రేక్!!

భూమిపుత్ర,సంపాదకీయం :

నాలుగు దశాబ్దాల క్రితం ఆడ పిల్ల వివాహ వయస్సు పదిహేనేళ్లు. తరువాత దానిని పద్దెనిమిదికి పెంచారు. ఇక ముందు మగపిల్లలతో సమానంగా ఆడపిల్ల పెళ్లి వయస్సు కూడా 21 ఏళ్లుగా సర్కార్‌ చట్ట సవరణ చేయనుంది. జయా జైట్లీ నేతృత్వంలో ఏర్పాటైన టాస్క్‌ఫోర్స్‌ కమిటీ సిఫార్సులను కేంద్ర క్యాబినెట్‌ ఆమోదించింది. ఇక పార్లమెంట్‌ ఆమోదం పొందటమే తరువాయి. అంటే ఇకపై మన దేశంలో టీనేజ్‌ వివాహాలకు ఛాన్స్‌ లేదు. బాల్య వివాహాలకు పూర్తిగా చెక్‌ పెట్టటంతో పాటు మహిళా సాధికారతకు ఈ సవరణలు దోహదం చేస్తాయి.అబ్బాయిలతో పాటు అమ్మాయి వివాహ వయస్సు 21 ఏళ్లకు పెంచుతామని గత ఏడాది ప్రధాని మోడీ స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో ప్రస్తావించారు. ఆ ప్రతిపాదన ఇప్పుడు కార్యరూపం దాల్చుతోంది. ఇందులో భాగంగా బాల్య వివాహాల నిషేధ చట్టం 2006, మ్యారేజ్‌ యాక్ట్‌తో పాటు హిందూ వివాహ చట్టం -1955 వంటి వ్యక్తిగత చట్టాలను సవరిస్తారు.

స్త్రీ మాతృత్వ వయస్సు, ఎమ్‌ఎమ్‌ఆర్‌ (మ్యాటర్నల్‌ మోర్టాలిటీ రేట్‌) తగ్గించటం, మెరుగైన పోషకాహార స్థాయి వంటి పలు అంశాలను జయ జైట్లీ నేతృత్వంలోని కేంద్ర టాస్క్‌ఫోర్స్‌ అధ్యయనం చేసింది. పలు సిఫార్సులతో కూడిన తన నివేదికను గత డిసెంబర్‌లో నీతి ఆయోగ్‌కు సమర్పించింది. ఈ కమిటీ సిఫార్సుల ఆధారంగా బుధవారం బాలికల వివాహ వయస్సు 21కి పెంచుతూ ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఈ సిఫార్సు వెనక ఏ ఇతర కారణాలు లేవని కేవలం మహిళల సాధికారత మాత్రమే ఉందని జయా జైట్లీ స్పష్టం చేశారు.జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ప్రకారం 2015-16లో 27 శాతంగా ఉన్న బాల్యవివాహాలు 2019-21లో 23 శాతానికి తగ్గాయి. బాలికల వివాహ వయస్సు 21 ఏళ్లు చేయటం వల్ల మైనర్‌ పెళ్లిళ్లు గణనీయంగా తగ్గే అవకాశం ఉంది. అలాగే, ఆడపిల్లలు ఉన్నత చదువుల అవకాశాలు కూడా మెరుగవుతాయి.ఈ సిఫార్సులు చేయటానికి కమిటీ అనేక మంది నిపుణులతో పాటు దేశ వ్యాప్తంగా యువతీ యువకుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుంది. వారితో విస్తృతమైన సంప్రదింపులు జరిపింది. వివాహ వయస్సు పెంపు నిర్ణయం యవతపై నేరుగా ప్రభావం చూపుతుంది. దీనిని దృష్టిలో ఉంచుకుని దేశంలోని అన్ని వర్గాలు, ప్రాంతాల నుంచి విస్త్రృత స్థాయిలో అభిప్రాయ సేకరణ జరిపారు. ఇందులో 16 విశ్వవిద్యాలయాలు, పదిహేను ఎన్జీవోలు పాల్గొన్నాయి.

పట్టణ, గ్రావిూణ, అట్టడుగు ప్రాంతాల నుంచి ఫీడ్‌ బ్యాక్‌ తీసుకున్నారు. బాల్యవివాహాలు ఎక్కువగా జరిగే రాజస్థాన్‌లోని పలు జిల్లాలపై ప్రత్యేక దృష్టి పెట్టింది కమిటీ.అభిప్రాయ సేకరణలో చాలా మంది వివాహ వయస్సు 22-23 మధ్య ఉండాలని సూచించినట్టు కమిటీ తెలిపింది. అదే సమయంలో కొన్ని వర్గాల నుంచి అభ్యంతరాలు కూడా వచ్చాయి. అయితే టార్గెట్‌ గ్రూప్‌ అభిప్రాయాలే ముఖ్యం గనుక వారు చెప్పిన అంశాలనే టాస్క్‌ ఫోర్స్‌ పరగణలోకి తీసుకుంది. నీతి ఆయోగ్‌కి చెందిన డాక్టర్‌ వి కె పాల్‌, డబ్ల్యుసిడి, ఆరోగ్య, విద్యా, మంత్రిత్వ శాఖల కార్యదర్శులు కమిటీ సభ్యులుగా ఉన్నారు.వివాహ వయస్సు పెంపు విషయాన్ని సమర్ధవంతంగా ప్రజల్లోకి తీసుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. అందుకు ప్రజలను చైతన్యవంతులను చేసే కార్యక్రమాలను రూపొందించాలని కమిటీ సిఫార్సు చేసింది. అమ్మాయిలకు పాఠశాలలు, విశ్వవిద్యాలయాల ప్రవేశ అవకాశాలను విస్తృతం చేయాల్సిన అవసరాన్ని కమిటీ గుర్తించింది. అలాగే లైంగిక విజ్ఞానం పాఠాలను బోధనాంశాలుగాచేర్చాలని సిఫార్సు చేసింది. పాలిటెక్నిక్‌ వంటి శిక్షణ సంస్థలలో మహిళలకు శిక్షణ, నైపుణ్యాలు, వ్యాపార శిక్షణతో జీవనోపాధి అవకాశాలను పెంపొందించాలని కూడా కమిటీ సిఫార్స్‌ చేసింది.

ఆర్థిక స్వేచ్చ ఉన్న అమ్మాయిలకు చిన్న వయస్సులో పెళ్లి చేసే ముందు తల్లిదండ్రులు ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తారు. అందుకే ఈ సిఫార్సులు చేశారు.నిజానికి, పెళ్లి వయసు ఎంత ఉండాలనే దానిపై మన దేశంలో భిన్నాభిప్రాయలు ఉన్నాయి. మన చారిత్రక నేపథ్యం ..భిన్న సంస్కృతులు దానికి ఒక కారణం కావచ్చు, అయితే మొదటి సారి అధికారిక వివాహ వయస్సు నిర్ణయించింది మాత్రం బ్రిటిష్‌ వారే. ఇంపీరియల్‌ లెజిస్లేటివ్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా 1929లో బాల్య వివాహ నిరోధక చట్టం తెచ్చింది. తరువాత ఇది శారదా చట్టంగా ప్రసిద్ధి చెందింది. దాని ప్రకారం ఆడపిల్ల వివాహ వయస్సు పద్నాలుగు సంవత్సరాలు, అబ్బాయిలకు పద్దెనిమిది సంవత్సరాలు. భారతదేశంలో సాంఘిక సంస్కరణ ఉద్యమ ఫలితం చట్టం. చట్టం చేశారు కానీ బ్రిటిష్‌ వారు కూడా దానిని ప్రభావవంతంగా అమలు చేయటంలో విఫలమయ్యారు. హిందూ, ముస్లిం మతవాద గ్రూపుల మద్దతు కోల్పోతామనే భయం వల్ల నాటి బ్రిటిష్‌ ఇండియా ప్రభుత్వం దీనిని సమర్ధవంతంగా అమలు చేయలేదు. ఇప్పుడు కూడా దేశంలో చాలా చోట్ల ముఖ్యంగా రాజస్థాన్‌, హర్యానా వంటి రాష్ట్రాలలో ఈ చట్టం అమలు అంతంత మాత్రమే.

ఇప్పటికీ చాలా వరకు గ్రావిూణ ప్రాంతాల్లో బాల్య వివాహాలు సాధారణ వ్యవహారంగానే ఉంది.స్వాతంత్య్రానంతరం 1949లో భారత ప్రభుత్వం బాలికల వివాహ వయస్సును పదిహేనేళ్లకు పెంచింది. తరువాత 1978లో అప్పటి జనతా ప్రభుత్వం అమ్మాయికి 18, అబ్బాయికి 21 ఏళ్లను వివాహ వయస్సుగా చట్ట సవరణ చేసింది. గత నలబై మూడేళ్లుగా ఇదే అధికారిక వివాహ వయసుగా ఉంది. అంతకన్నా తక్కువ వయసు బాల బాలికలకు పెళ్లి చేస్తే అది బాల్య వివాహమవుతుంది..పెళ్లి జరిపించిన వారు శిక్షార్హులు అవుతారు. రెండేళ్ల జైలు శిక్ష, లక్ష రూపాయల జరిమానా విధించవచ్చు.ప్రస్తుతం మన దేశంలో బాలికల కనీస పెళ్ళి వయసు 18 ఏళ్లయినా ప్రపంచంలోనే అత్యధిక మైనర్‌ వివాహాలు జరుగుతున్నది మన దగ్గరే. ప్రతి రోజు పెద్ద సంఖ్యలో చిన్నారులు పెళ్ళిపీటలు ఎక్కుతున్నారు. అయితే మార్పు ఒక్కరోజులో రాదు. గతంలో ఉన్నట్టు ప్రస్తుత పరిస్థితి లేదు. ఎంతో కొంత మార్పు వచ్చింది. తాజా సవవరణలతో మరింత మార్పుకు అవకాశం ఉందనటంలో సందేహం లేదు.పెళ్ళి వయసు పెంచితే, బాల్యవివాహాలు తగ్గుతాయా అన్నది పెద్ద ప్రశ్నే.

తన పెళ్ళి చట్ట విరుద్ధమనే విషయమే తెలియని ఓ అమ్మాయి ఫిర్యాదు చేసే వరకు వెళుతుందా? అందుకు కుటుంబాలు అంగీకరిస్తాయా? నగర ప్రాంతాల్లో పరిస్థితులు చాలా వరకు మారాయి. ఉన్నత చదువులు చదివి ఉద్యోగాలు చేస్తున్న అమ్మాయిలు ఇప్పుడు కూడా 21 ఏళ్ల తర్వాతే పెళ్లి చేసుకుంటున్నారు. కాబట్టి ప్రభుత్వ తాజా నిర్ణయంతో పట్టణాలు మారు మూల గ్రావిూణ ప్రాంతాలపై ఎక్కువ ప్రభావం చూపనుంది. ఈ ప్రాంతాలలో అబ్బాయిలతో పోలిస్తే కుటుంబపరంగా అమ్మాయిలకు విద్య ఉద్యోగావకాశాలు తక్కువ. అందుకే, వారికి త్వరగా పెళ్లిళ్లు చేస్తారు. బాల్యవివాహాల కేసులు కూడా ఎక్కువగా ఇలాంటి ప్రాంతాల్లోనే కనిపిస్తుంటాయి. వివాహ కనీస వయసును పెంచడం వల్ల ఇలాంటి అమ్మాయిల జీవితాలు మెరుగుపడితే అంతకన్నా కావాల్సిందేముంటుంది!!

Related News

Leave a Reply

Your email address will not be published.