తెలంగాణను బెంబేలెత్తిస్తున్న బ్లాక్ ఫంగస్!!

 తెలంగాణను బెంబేలెత్తిస్తున్న బ్లాక్ ఫంగస్!!

భూమిపుత్ర,హైదరాబాద్‌:

తెలంగాణ రాష్ట్రంలో బ్లాక్‌ ఫంగస్‌ను ఎపిడమిక్‌ యాక్ట్‌ 1897 ప్రకారం నోటిఫైబుల్‌ (ప్రత్యేకంగా గుర్తించదగిన) వ్యాధిగా వైద్యశాఖ ప్రకటించింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆసుపత్రులు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాలను అనుసరిస్తూ బ్లాక్‌ ఫంగస్‌ను గుర్తించేందుకు స్క్రీనింగ్‌తో పాటు వివిధ రకాల డయగ్నోస్టిక్స్‌ను ఉపయోగించాలని ఆరోగ్యశాఖ సూచించింది. కేసు తేలిన వెంటనే వైద్యశాఖకు తప్పనిసరిగా చెప్పాలని పేర్కొంది. అంతేగాక ఆయా జిల్లాల వారీగా నమోదవుతున్న కేసులను ఆయా మెడికల్‌ సూపరింటెండెంట్లు తప్పనిసరిగా రోజూ వారీ రిపోర్టులను ఐడిఎస్‌పిఏ తెలంగాణ.గవ్‌.ఇన్‌ కు పంపాలని డిహెచ్‌ డా జి శ్రీనివాసరావు ఆదేశించారు. ఎట్టి పరిస్థితుల్లో ఈ వ్యాధిపై నిర్లక్ష్యం వహించవద్దని ఆయన సూచించారు.

ఇప్పటి వరకు కోఠి ఈఎన్‌టిలో 90 మంది బాధితులు చికిత్స పొందుతుండగా, గాంధీలో 25 మంది ఉన్నట్లు అధికారులు చెప్పారు. దీంతో పాటు ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో మరో 50 మంది వరకు ఉండొచ్చని అధికారు అంచనా. కానీ ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో బాధితుల సంఖ్య భారీగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో కేసుల తీవ్రత మరింత పెరిగితే ఈఎన్‌టి హాస్పిటల్‌ను పూర్తి స్థాయి నోడల్‌ కేంద్రంగా మార్చాని ప్రభుత్వం భావిస్తుంది. రోజు వారీగా నిర్వహించే ఓపి, సర్జరీలను తాత్కాలికంగా నిలిపివేసి బ్లాంక్‌ ఫంగస్‌ స్పెషల్‌ కేర్‌ హాస్పిటల్‌గా మార్చనున్నారు. దీంతో ప్రస్తుతం ఏర్పాటు చేసిన 100 బెడ్లకు అదనంగా మరో 100 పడకలు పెరగనున్నాయి. ఇప్పటికే ఈ అంశంపై అధికారులు ప్రత్యేక అంతర్గత సవిూక్ష సమావేశం నిర్వహించుకొని మందులు, మౌలిక వసతుల సమకూర్పుపై చర్చించారు. అంతేగాక ప్రైవేట్‌ ఆసుపత్రులు కూడా ప్రత్యేక వార్డులో ఈ ట్రీట్మెంట్‌ చేసుకోవచ్చని అధికారులు చెబుతున్నారు.

 ఇప్పటికే కొన్ని ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న బ్లాక్‌ ఫంగస్‌ బాధితుల అవయవాలు పాడైపోతే వాటిని డాక్టర్లు తొలగించినట్లు సమాచారం.బ్లాక్‌ ఫంగస్‌ భయపెట్టిస్తోంది. హైదరాబాద్‌లోని ప్రభుత్వ, ప్రైవేట్‌, కార్పొరేట్‌ ఆసుపత్రుల్లో ప్రతి రోజూ సుమారు పది నుంచి 20 మంది బ్లాక్‌ ఫంగస్‌ అనుమానితులు వ్యాధి నిర్ధారణ కోసం వస్తున్నారు. గాంధీ, ఈఎన్‌టితో పాటు ప్రముఖ కార్పొరేట్‌ ఆసుపత్రుల్లోనూ ఇదే పరిస్థితి ఉంది. అయితే అనుమానంతో వచ్చిన ప్రతి వ్యక్తికి బ్లాక్‌ ఫంగస్‌ ఉన్నట్లు కాదని, ఇది కేవలం కరోనా నుంచి కోలుకున్న కొందరిపై మాత్రమే దాడి చేస్తుందని డాక్టర్లు చెబుతున్నారు. దేశ వ్యాప్తంగా ప్రస్తుతానికి ఇది సుమారు 1శాతం మందిలో మాత్రమే వస్తుందని వైద్యులు వివరిస్తున్నారు. వాస్తవంగా మొదటి దశలోనూ ఇలాంటి సమస్యలు ఉన్నప్పటికీ అప్పట్లో వాటి ప్రభావం అతి తక్కువగా ఉండేది. కానీ సెకండ్‌ వేవ్‌లో దీని తీవ్రత అధికంగా ఉందని పలువురు డాక్టర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

అత్యధికంగా స్టెరాయిడ్స్‌ వాడిన వారిలో ఇమ్యూనిటీ తగ్గి ఈ బ్లాక్‌ ఫంగస్‌ దాడి చేస్తుందని వైద్యులు గుర్తించారు. ఇప్పటికే లాంగ్‌ కొవిడ్‌ సమస్యతో కొంత మంది ఇబ్బందు పడుతుండగా, కొత్తగా వచ్చిన ఈ బ్లాక్‌ ఫంగస్‌తో అనేక మంది ఆందోళనకు గురవుతున్నారు.బ్లాక్‌ ఫంగస్‌ కు ప్రస్తుతం ప్రత్యేకంగా వినియోగిస్తున్న లింపోసోమల్‌ ఆంఫోటెరిసిన్‌ బి, పోసాకానాజోల్‌, ఇసావుకానజోల్‌ వంటి మందులు బ్లాక్‌ మార్కెట్‌కు తరలివెళ్లకుండా ప్రభుత్వం ఆన్‌లైన్‌ విధానాన్ని అమలు చేస్తుంది. రెండు డోజుల క్రితం ప్రవేశపెట్టిన వైద్యశాఖ మెయిల్‌కు ఏకంగా 700 మంది ధరఖాస్తు చేసుకున్నట్లు తెలిసింది. అంటే బ్లాక్‌ ఫంగస్‌ బాధితుల సంఖ్య దీన్ని పరిశీలిస్తేనే అర్ధం అవుతోంది. కానీ కేంద్రం మాత్రం కేవం 300 ఇంజక్షన్లను మాత్రమే ఇచ్చిందని వైద్యశాఖ చెప్పుకొస్తుంది. దాని ప్రకారం రోగులకు ఇవ్వనున్నట్లు అధికారులు చెబుతున్నారు.

మ్యూకోర్‌మైకోసిస్‌(బ్లాక్‌ ఫంగస్‌) అనేది అరుదైన ఫంగస్‌. సాధారణంగా మట్టి, మొక్కు,ఎరువుల్లో కుళ్లిపోతున్న పండ్లు, కూరగాయాల్లో ఉండే బూజు లాంటి పదార్ధంతో ఇది తయారవుతోంది. ఇది సైనస్‌, మెదడు, ఊపిరితిత్తులపై ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా రోగనిరోధక శక్తిని నాశనం చేసే వ్యాధులైన హెచ్‌ఐవి, క్యాన్సర్‌ ఉన్న వారితో పాటు డయాబెటిస్‌, ఆస్తమా రోగులు, అవయవమార్పిడి చేసుకున్న వారిలో దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఈ ఫంగస్‌ ఇమ్యూనిటీ శక్తి అధికంగా ఉన్న వారికి ఎలాంటి హానీ చేయదు. కానీ కొవిడ్‌ వల్ల రోగనిరోధక శక్తి తగ్గిపోయిన వారిని మాత్రం వెంటాడుతుంది.బ్లాక్‌ ఫంగస్‌ ముక్కు ద్వారా శరీరంలోకి ప్రవేశిస్తుంది. ముక్కులో ఉండే ప్చని ప్రదేశంపై దీని ప్రభావం మొదలై అక్కడి నుంచి కన్ను, పై దవడ ఎముక, మెదడుకు వ్యాపిస్తుంది. ఇది తన శక్తిని పెంచుకుంటూ రక్తనాళాలను క్షీణింపచేస్తుంది. దీంతో రక్తప్రసరణకు ఆటంకం ఏర్పడి వివిధ అవయవాలపై ప్రభావం చూపుతోంది. అయితే దీని దీని నియంత్రణకు రెండు, మూడు మందులు ఉన్నప్పటికీ పూర్తిస్థాయిలో పనిచేయవని డాక్టర్లు చెబుతున్నారు.

సుమారు 80శాతం మంది ప్రాణాలు మాత్రమే కాపాడటం సాధ్యమవుతుందని వైద్యులు పేర్కొంటున్నారు. అయితే ఇది కంటి, పై దవడ వరకు చేరితే వాటిని తొలగించాల్సి వస్తుంది. అంతేగాక మెదడు వరకు చేరితే పక్షవాతం రావడం, స్పృహ కోల్పోవడం, తొందరగా ప్రాణాలు కోల్పోవడం జరుగుతుంది. అయితే దీన్ని ప్రారంభ ధశలో గుర్తిస్తే 15 నుంచి 20 రోజులు మందు ఇచ్చి రోగిని కాపాడుకోవచ్చు. కానీ ఆలస్య సమయంలో గుర్తిస్తే డాక్టర్ల పర్యవేక్షణలో సుమారు 40 రోజుల వరకు మందు ఇవ్వాల్సి ఉంటుంది.ముక్కులో నొప్పి, దురద వంటివి బ్లాక్‌ ఫంగస్‌కు మొదటి లక్షణం. ఈ సమయంలో ఎండోస్కోపిక్‌ పరీక్ష చేస్తే చర్మం డ్యామేజ్‌ అయిందా లేదా తెలుస్తుంది. నల్లని భాగం కనిపిస్తే అది బ్లాక్‌ ఫంగస్‌ అని నిర్ధారించాలని వైద్యు స్పష్టం చేశారు. అయితే ఆ చర్మం పూర్తిగా క్షిణించిన తర్వాత నల్లని జిగురు పదార్థాలు ముక్కు నుంచి బయటికి వస్తాయి. తర్వాత స్టేజీలో విపరీతమైన కంటి, పంటి, దవడ ఎముక, తలనొప్పిని కుగచేస్తుంది. మిగతా నొప్పుల కంటే ఈ నొప్పి తేడా ఉంటుంది.

సాధారణ మందులతో ఈ నొప్పి తగ్గదు. ఇలాంటి లక్షణాలు ఉంటే బ్లాక్‌ ఫంగస్‌గా గుర్తించాలి. చూపు మందగించడం, కంటిలో నలుసు ఉన్నట్లు అనిపించడం వంటి లక్షణాలు ఉంటాయి. సిటీ స్కాన్‌ చేసినా సాధారణ సైనసైటిస్‌గా తెలుస్తుంది కానీ, బ్లాక్‌ ఫంగస్‌గా గుర్తించలేము. వ్యాధి తీవ్రమైన వారిలో ఆపరేషన్లు చేసి కన్ను, పై దవడ వంటి భాగాలను తొగించాని వైద్యులు పేర్కొంటున్నారు. బ్లాక్‌ ఫంగస్‌ ఏర్పడితే ముక్కు చుట్టూ నొప్పి ఏర్పడుతుంది. బ్లాక్‌ ఫంగస్‌ వల్ల కళ్లు ఎర్రబడతాయి.ముఖం వాపు, తిమ్మిరులు ఏర్పడతాయి.తనొప్పి, జ్వరం, దగ్గు, రక్తపు వాంతులు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలుగవచ్చు. మానసిక స్థితి అదుపుతప్పడం వంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి.ముక్కులో దురద, కళ్లపైన లేదా కళ్ల కింద ఉబ్బినట్లు కనిపించినా, కంటిచూపు మందగించినా వైద్యులను సంప్రదించాలి.దంతాల్లో నొప్పిగా ఉన్నా అప్రమత్తం కావాలి.ఇమ్యూనిటీ లెవల్స్‌ తక్కువున్న వారిపై బ్లాక్‌ ఫంగస్‌ దాడి చేస్తుంది. కొవిడ్‌ చికిత్సలో భాగంగా స్టెరాయిడ్స్‌ని ఇష్టారీతిగా వాడటం, రక్తంలో షుగర్‌ లెవల్స్‌ సరిగ్గా లేకపోవడంతో బ్లాక్‌ ఫంగస్‌ వచ్చే ప్రమాదం ఉంది.

డయాబెటీస్‌ నియంత్రణలో లేని కరోనా బాధితుల్లో, అంతేగాక కిడ్నీ మార్పిడి తదితర సర్జరీలు, చికిత్స కోసం ఇమ్యునిటీ కంట్రోల్‌ డ్రగ్స్‌ వాడిన రోగుల్లో, ఇదివరకే అనారోగ్య సమస్యలున్న కరోనా బాధిలతుకు స్టిరాయిడ్స్‌ అతిగా తీసుకున్న వాళ్లకు బ్లాక్‌ ఫంగస్‌ సమస్య ఏర్పడుతున్నట్లు నిపుణులు కనుగొన్నారు. దీంతో పాటు సైనసైటిస్‌ సమస్య ఉన్నవారికి కూడా బ్లాక్‌ ఫంగస్‌ ఏర్పడవచ్చు.బ్లాక్‌ ఫంగస్‌ కేసు పెరిగినా భయపడాల్సిన అవసరం లేదు. ఈ వ్యాధి అందరికీ రాదు. ఇప్పటి వరకు కొవిడ్‌ సోకిన తర్వాత స్టెరాయిడ్స్‌ వాడినోళ్లలోనే ఎక్కువగా వస్తుంది. అయినా వారెవ్వరూ విషమ పరిస్థితుల్లో లేరు. ఈ ఫంగస్‌తో ఇప్పటి వరకు ఒక్కరూ కూడా మరణించలేదు. ప్రాణాంతకరమైన వ్యాధి కాదు కానీ మెదడు వరకు ఫంగస్‌ వెళ్లిన వారిలో ప్రమాదం పొంచి ఉంటుంది. ఇప్పటికే ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంది. అయితే ప్రతి రోజూ వచ్చే కేసులను పూర్తి స్థాయిలో పరిశీలిస్తున్నాం. ఆయా పేషెంట్ల ఆరోగ్య పరిస్థితిని ప్రభావం ఆధారంగా తదుపరి నిర్ణయాలు తీసుకుంటామని ఉన్నతాధికారులు పేర్కొన్నారు

Related News

Leave a Reply

Your email address will not be published.