తమిళనాడు 14 వ ముఖ్యమంత్రిగా ఎం.కె.స్టాలిన్

 తమిళనాడు 14 వ ముఖ్యమంత్రిగా ఎం.కె.స్టాలిన్

భూమిపుత్ర,చెన్నై:

తమిళనాడు రాష్ట్ర 14వ ముఖ్యమంత్రిగా ద్రవిడ మున్నేట్ర కజగం(డీఎంకే) అధినేత ముత్తువేల్ కరుణానిధి. స్టాలిన్ ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్ భవన్ లో గవర్నర్ భన్వరిలాల్ పురోహిత్ స్టాలిన్ తో ప్రమాణ స్వీకారం చేయించారు. ఆయనతో పాటు మరో 34 మంత్రులు కూడా ప్రమాణం చేశారు.తన తండ్రి కరుణానిధి సీఎంగా ఉన్నప్పుడు మంత్రులుగా పనిచేసిన వారిలో చాలా మందికి మళ్లీ కేబినెట్‌లో అవకాశం దక్కింది. అంతేకాదు 15 మంది ఎమ్మెల్యేలు తొలిసారి మంత్రి పదవులు దక్కించుకున్నారు. కీలకమైన హోంశాఖతో పాటు పలు ఇతర శాఖలను సీఎం స్టాలిన్ తన వద్దే ఉంచుకున్నారు.

బాధ్యతలు స్వీకరిస్తున్న ఎం.కె.స్టాలిన్

దురైమురుగన్‌కు జలవనరులు, నీటి పారుదలశాఖ, చెన్నై మాజీ మేయర్ సుబ్రమణియన్‌కు ఆరోగ్యశాఖ, పళనివేల్ తంగరాజన్‌కు ఆర్థికశాఖ, అంబిల్ మహేష్‌కు విద్యాశాఖను కేటాయించారు.రాజ్‌భవన్‌లో నిర్వహించిన ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి పలువురు రాజకీయ నాయకులు, ప్రముఖులు హాజరయ్యారు. మక్కల్ నీథి మయ్యం అధినేత కమల్ హాసన్, డీఎంకేకు చెందిన ఎమ్మెల్యేలు, కొందరు కీలకక నాయకులు ఇందులో పాల్గొన్నారు. డీఎంకే యువజన విభాగం అధ్యక్షుడు, ఆ పార్టీ ఎమ్మెల్యే, నటుడు ఉదయనిధి స్టాలిన్ ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ కార్యక్రమం ముగిసిన తరువాత.. కేబినెట్ సమావేశం కానుంది. కరోనా నివారణ చర్యలపై రూపొందించిన కార్యాచరణ ప్రణాళికను ఆమోదించనుంది.

తమిళనాడులో పదేళ్ల తర్వాత డీఎంకే అధికారంలోకి వచ్చింది. 234 సీట్లున్న తమిళనాడులో డీఎంకే కూటమి 159 సీట్లు సాధించింది. ఇందులో ఒక్క డీఎంకేకే 133 సీట్లు వచ్చాయి. కాంగ్రెస్ 18 సీట్లకు పరిమితమయింది. ఇక అన్నాడీఎంకే 66 సీట్లతో సరిపెట్టుకుంది. అన్నాడీఎంకే మిత్రపక్షాలైన బీజేపీ 4, పీఎంకే 5 చోట్ల గెలుపొందాయి.వారసత్వ రాజకీయాల్లో స్టాలిన్ తమిళనాడులో రికార్డు సృష్టించారు. ఇప్పటివరకూ తమిళనాడులో వారసులెవరూ సీఎం అయిన దాఖలాలు లేవు. ముఖ్యమంత్రిగా తొలిసారి స్టాలిన్ ప్రమాణ స్వీకారం చేసి కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టాడు .

Related News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *