తమిళనాట బీజేపీ ఎత్తులు ఫలించేనా!!

 తమిళనాట బీజేపీ ఎత్తులు ఫలించేనా!!

భూమిపుత్ర,జాతీయం:

చిన్న రాష్ట్రాల ఏర్పాటుతో తమ రాజకీయ ప్రాబల్యాన్ని విస్తరించుకునేందుకు ప్రణాళికలు రచించే బీజెపి ఇప్పుడు దేశంలో మరో రాష్ట్ర విభజనకు ఎత్తుగడ వేస్తోంది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల మధ్య విజభన జరిగింది. ఏదో ఒక రూపంలో నిత్యం రెండు రాష్ట్రాల మధ్య అగ్గి రాజుకుంటోంది. చాపకింద నీరులా బిజెపి తాను చేయాల్సింది చేసుకుంటూ పోతోంది. దక్షిణ తమిళనాడులో రెండో రాజధాని కావాలంటూ డిమాండ్‌ వినిపించినా ఆ వాదనకు పెద్దగా మద్దతు లభించలేదు. తాజాగా అదే తమిళనాడు నుంచి కొత్త విభజన నినాదం వినిపిస్తోంది. అదే కొంగునాడు. పది జిల్లాలున్న కొంగునాడును ప్రత్యేక రాష్ట్రంగా విభజించే దిశగా తాజా పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి అండతో పశ్చిమ తమిళనాడు ప్రాంతమైన కొంగునాడు ప్రత్యేక రాష్ట్రం కాబోతోందన్న ప్రచారం ఊపందుకుంది.

ద్రవిడ పార్టీలకే తమిళనాడు ప్రజల మద్దతు ఉంది. 38 జిల్లాలు, 39 లోక్‌ సభ స్థానాలు, 234 అసెంబ్లీ సీట్లు.. ఇక్కడ రాజకీయాలు ద్రవిడ సిద్ధాంతంతోనే కొనసాగుతుంటాయి. అక్కడి ఓటర్లు ప్రతి ఎన్నికల్లో ఇస్తున్న తీర్పు కూడా ఈ విషయాన్ని స్పష్టం చేస్తుంది. ఇటీవల ఎన్నికల ద్వారా అన్నాడిఎంకే తో కలిసి బరిలో నిలిచిన బిజెపి గట్టి ప్రయత్నం చేసినా ఫలితం దక్కలేదు. అయితే 4 అసెంబ్లీ స్థానాలు గెలుచుకుని ఓటు బ్యాంక్‌ ను పెంచుకోగలిగింది.ఇటీవల కేంద్ర కేబినెట్‌ విస్తరణలో చోటు దక్కించుకున్న బిజెపి తమిళనాడు మాజీ రాష్ట్రాధ్యక్షుడు ఎల్‌.మురుగన్‌ను తమిళనాడు కొంగునాడు ప్రాంతానికి చెందిన వ్యక్తిగా కేంద్రం అధికారిక ప్రకటనల్లో చూపడం వివాదానికి తెరలేపింది. తమిళనాట రాష్ట్ర విభజన వాదాన్ని తెరవిూదకు తీసుకొచ్చే కుట్రతోనే ఆయన్ను కొంగునాడుకు చెందిన వ్యక్తిగా కేంద్రం రికార్డుల్లో చూపుతోందని సోషల్‌ విూడియా వేదికగా బిజెపి పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

దీంతో కొంగునాడును , ప్రత్యేక రాష్ట్రంగా లేదా కేంద్రపాలిత ప్రాంతంగా ఏర్పాటు చేసేందుకు బిజెపి ప్రణాళికలు రచిస్తోందన్న చర్చ ప్రారంభమయింది. ఆ చర్చ రాజకీయ రచ్చగా మారింది.అభివృద్ధి పేరుతో రాష్ట్రంలో పడమర ప్రాంతంగా ఉన్న కొంగు మండలాన్ని కొంగునాడు పేరిట ప్రత్యేక కేంద్ర పాలిత ప్రాంతంగా విభజించే ఆలోచన దిశగా బిజెపి అడుగులు వేస్తోంది. అలా విభజిస్తేనే అభివృద్ధి జరుగుతుందంటూ బిజెపి నేతలు చేస్తున్న వ్యాఖ్యలు రాజకీయ దుమారాన్ని రేపుతున్నాయి.కొంగుమండలంలో పట్టుకోసం అటు అధికార డిఎంకె, ఇటు బిజెపి లు ప్రయత్నిస్తున్నాయి. ముఖ్యంగా బిజెపి పెద్ద వ్యూహ రచన చేస్తోంది. మాజీ ముఖ్యమంత్రి ఎంజిఆర్‌ హయాం నుంచి కొంగుమండలం అన్నాడిఎంకె కు కంచుకోటగా మారింది. శాసనసభ ఎన్నికల్లో మెజార్టీ స్థానాల్లో విజయం సాధించి అధికారం చేపట్టిన డిఎంకె కొంగునాడు ప్రాంతంలో మాత్రం పెద్దగా ప్రభావం చూపలేక పోయింది.తాజాగా అన్నాడిఎంకె పార్టీ రాష్ట్రంలో అధికారం కోల్పోయినా కొంగునాడులో మాత్రం ఉనికిని చాటుకుంది. గత శాసనసభ ఎన్నికల్లో 40 స్థానాలను అన్నాడిఎంకె గెలుచుకోగా, 17 స్థానాల్లో డిఎంకె, ఒక్క స్థానంలో బిజెపి నిలిచాయి.

తమ పార్టీ పట్టు కోసం బిజెపి పనిచేస్తూ విభజన పేరుతో రాష్ట్రాలను విడదీస్తూ… ఇది ప్రజల మనోభీష్టం మేరకే జరిగిందని చెప్పుకుంటోంది. ‘కొంగునాడు’ చర్చపైన డిఎంకె ఎందుకు ఆందోళన చెందుతోందని బిజెపి ఎమ్మెల్యే నయనార్‌ నాగేంద్రన్‌ ప్రశ్నించారు. అంతా తమిళనాడేనని, దీనిపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. అయినా అక్కడి ప్రజల మనోభీష్టం మేరకు తెలంగాణ, యుపి లో రాష్ట్ర విభజన జరిగిందని అన్నారు. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడం ప్రభుత్వ బాధ్యతగా ఆయన చెప్పుకొచ్చారు. కొంగునాడు అంశంపై మాట్లాడిన తమిళనాడు బిజెపి ప్రధాన కార్యదర్శి కరుణాగరన్‌.. ప్రజల ఆకాంక్షలు నెరవేరుతాయని వ్యాఖ్యానించారు. ఇతర రాష్ట్రాల్లో కూడా ఇదే జరిగిందని తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం ఓ తార్కాణంగా పేర్కొన్నారు. ‘కొంగునాడు’ అన్న పదజాలాన్ని ఉపయోగిస్తే తప్పేంటని ప్రశ్నించారు.బిజెపి రహస్య ఆలోచనలను నిశితంగా పరిశీలిస్తోన్న అధికార డిఎంకె తీవ్రంగా స్పందించింది. బిజెపి వ్యూహాలు జరిగేవి కావని ఖండించింది. డిఎంకె నేత కనిమొళి మాట్లాడుతూ అలాంటి ప్రయత్నాలు సాగవని పూర్తి మెజారిటీ తో ఉన్నామని అది జరిగే పని కాదని గట్టిగా ఖండిరచారు. ఇక కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షులు కె.ఎస్‌ అళగిరి కూడా బిజెపి తీరుపై మండిపడ్డారు.. తమిళనాడు ఒకే రాష్ట్రంగా ఉండాలనేదే ప్రజల కోరిక అని స్పష్టం చేశారు. ఏదేమైనా తమిళనాట రాజకీయ చిచ్చుపెట్టి విభజించాలనుకుంటున్న బిజెపి వ్యూహాలను అక్కడి రాజకీయ వర్గం ఎలా ఎదుర్కొంటుందో వేచి చూడాలి

Related News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *