తాలిబాన్ల హస్తగతంతో మరింత దిగజారనున్న ఆప్ఘనిస్థాన్ ఆర్థిక పరిస్థితి!!

 తాలిబాన్ల హస్తగతంతో మరింత దిగజారనున్న ఆప్ఘనిస్థాన్ ఆర్థిక పరిస్థితి!!

భూమిపుత్ర,సంపాదకీయం:

అఫ్ఘనిస్థాన్‌లో అమెరికా పెట్టిన చిచ్చు ఇంకా రగులుతూనే ఉంది. ఇప్పట్లో అక్కడ సాధారణ పరిస్థితులు వచ్చేలా కనిపించడం లేదు. ప్రభుత్వం ఏర్పడి ప్రజలకు ఎలాంటి భరోసా ఇస్తుందో అని ఊహించడానికి లేదు. అక్కడి తాలిబన్‌ ముష్కర మూకలు అప్పుడే దమనకాండతో రెచ్చిపోతున్నారు. దేశం విడిచి పోతున్న వారిని దారుణంగా కాల్చేస్తున్నారు. కాబూల్‌ విమనాశ్రయానికి చేరుకుంటున్న వారిని నిలువరి స్తున్నారు. అక్కడ ఇప్పట్లో ఆర్థిక సామాజిక పరిస్థితులు దారికి వచ్చేలా కనిపించడం లేదు. దీనికికితోడు ప్రజలు ఆకలితో అలమటించే దుర్భర పరిస్థితులు దాపురించాయి. మహిళలను బయటకు రాకుండా కట్టడి చేస్తున్నారు. మహిళా విద్యకు చోటులేకుండా తాలిబన్లు హుకూం జారీచేసారు. కో ఎడ్యుకేషన్‌పైనా ఆంక్షలు విధించారు. మరోవైపు తాలిబన్లు అప్గనిస్తాన్‌ను ఆక్రమించుకున్న నాటి నుంచి ఆ దేశంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. దేశాధ్యక్షుడే దేశం విడిచి పారిపోయాడంటే అక్కడ పరిస్థితులు ఎంత తీవ్రంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు.

అప్గన్‌ సైన్యం ఏమాత్రం ప్రతిఘటించకుండా తాలిబన్లకు లొంగిపోయింది. తాలిబన్ల రాక్షస పాలన గురించి తెలిసిన ఆ దేశ ప్రజలు.. అక్కడ నుంచి విదేశాలకు వలస వెళ్తున్నారు. ఈ క్రమంలో తాలిబన్లు విశాల హృదయంతో ముందుకు సాగాలి. తమ రాక్షస వికృత చేష్టలను పక్కన పెట్టారు. తాలిబన్‌ సైన్యంపై పట్టు పెంచుకునేలా పాలకులు వ్యవహరించాలి. అప్పుడే దేశంలో శాంతి న ఎలకొని ప్రజల్లో విశ్వాసం ఏర్పడుతుంది. ప్రపంచంలోని అత్యంత పేద దేశాల్లో అప్గానిస్తాన్‌ ముందు వరుసలో ఉంటుంది. దేశ ఆర్థిక పరిస్థితి దారుణంగా మారింది. అప్గాన్‌కు లభించే ఆదాయంలో 20 శాతానికి పైగా విదేశాల ఆర్థిక సాయం నుంచే అందుతోంది. తాలిబన్ల దురాక్రమణతో ఆ సాయం మొత్తం ఇక నిలిచి పోయినట్లే. మరోవైపు అప్గాన్‌ సెంట్రల్‌ బ్యాంక్‌కు చెందిన 9.5 బిలియన్‌ డాలర్ల ఆస్తులను అమెరికా స్తంభింపజేసింది. అంతేకాదు అప్గాన్‌కు ఎలాంటి రుణాలు ఇవ్వబోమని ఐఎంఎఫ్‌ తేల్చిచెప్పింది. అప్గాన్‌ను ఐక్యరాజ్యసమితి బ్లాక్‌లిస్టులో చేర్చింది. దీంతో విదేశాలు ఇక్కడ పెట్టుబడులు పెట్టే అవకాశం లేదు.

అప్గాన్‌ లో ఖనిజ సంపద ఉన్నప్పటికీ దాన్ని తవ్వితీయాలంటే విదేశీ పెట్టుబడులు రావాల్సిందే. తాలిబన్‌ పెద్దలు ఇక రష్యా, చైనా, పాకిస్తాన్‌పైనే ఆశలు పెట్టుకున్నారు. విదేశీ శక్తులపై పోరాటం అనే భావన తాలిబన్లను ఇన్నాళ్లూ ఒక్కటిగా కలిపి ఉంచింది. ఇప్పుడు అధికారంలోకి రాగానే దాని తాలూకు అవలక్ష ణాలన్నీ ఒంటబట్టడం ఖాయం. కొందరు అధికార భోగాలు అనుభవిస్తుండడం, మరికొందరు సాధారణ సైనికులుగా మిగిలిపోవడం వంటివి వారిలో విభజన తీసుకొచ్చే ప్రమాదం ఉంది. అసంతృప్తితో రగిలిపోయే వారు తిరుగుబాటు చేయడాన్ని కొట్టిపారేయలేం. మహిళలు, మైనార్టీల పట్ల తాలిబన్లు కర్కశంగా వ్యవహరి స్తారన్న చెడ్డపేరుంది. వారి నిర్వాకం వల్ల అప్గానిస్తాన్‌ ప్రపంచంలో ఏకాకిగా మారింది. దేశంలో పెద్ద సంఖ్యలో గిరిజన తెగలున్నాయి. వీటిలో చాలా తెగలకు తాలిబన్లతో శత్రుత్వం కొనసాగు తోంది. కేవలం 75వేల మంది సభ్యులతో తాలిబన్లు.. నెలన్నర వ్యవధిలో సుమారు నాలుగు కోట్ల జనాభా ఉన్న అప్గనిస్థాన్‌ ను వశపర్చుకోవడం అంతర్జాతీయ సమాజాన్ని ఆశ్చర్యానికి గురిచేసింది.

ఈ క్రమంలో సైన్యం ఉపసంహ రణ వల్లే ఈ పరిణామాలకు కారణమైందంటూ అమెరికాపై ఆరోపణలూ వినిపిస్తున్నాయి. అయితే తమ నిర్ణయాన్ని సమర్థించుకుంటున్న అగ్రరాజ్యం.. నిందలను తోసిపుచ్చుకునే ప్రయత్నం ముమ్మరం చేసింది. తాజాగా పాక్‌ను ఈ వ్యవహారంలోకి తీసుకొచ్చి తీవ్ర విమర్శలు గుప్పించింది. పాకిస్థాన్‌, ఆ దేశపు ఇంటెలిజెన్స్‌ సర్వీస్‌ వల్లే తాలిబన్లు పాతుకుపోగలిగారు అని రిపబ్లికన్‌ సభ్యుడు స్టీవ్‌ చాబోట్‌ చేసిన ఆరోపణలు గమనించాలి. అప్గనిస్థాన్‌ గడ్డపై ప్రస్తుత పరిస్థితులకు పాక్‌ కూడా ఒక కారణంగా ఆయన విశ్లేషించారు. తాలిబన్లకు వెన్నుదన్నుగా నిలిచి.. దురాక్రమణకు పాక్‌ సహకరించిందన్నారు. అంతేకాదు అప్గన్‌ల నరకయాతన గురించి తెలిశాక.. ఇస్లామాబాద్‌ సహా పాక్‌లోని పలు ప్రాంతాల్లో వేడుకలు జరిగాయి. పాక్‌ రాజకీయ నాయకులు, అధికారులు సంబురంగా సోషల్‌ విూడియాలో షేర్‌ చేసుకున్నారు. రోడ్ల విూదకు చేరి నృత్యాలు చేసిన దృశ్యాలు సైతం వైరల్‌ అయ్యాయని చాబోట్‌ ఉటంకించాడు. ఇక పారిపోయేందుకు ప్రయత్నిస్తున్న అప్గన్‌ల నుంచి భారీ డబ్బు వసూలు చేసి.. పాక్‌ భూభాగంలో ఆశ్రయం ఇస్తున్నారని విమర్శించాడు.

మరో పాకిస్థాన్‌ విదేశాంగ మంత్రి ఖురేషీ అప్గనిస్థాన్‌ పర్యటన చర్చనీయాంశంగా మారింది. అప్గన్‌ అల్లకల్లోల పరిస్థితుల్లో అక్కడ పర్యటిస్తున్న తొలి విదేశీ నేత ఖురేషీ కావడం విశేషం. హక్కానీ నెట్‌వర్క్‌ అప్గన్‌ స్వాధీన ప్రకటన తర్వాత.. ప్రభుత్వ ఏర్పాటుకు తాము సహకరిస్తామని, తాలిబన్లతో సత్సంబంధాలు కొనసాగిస్తామని పాక్‌ బహిరంగ ప్రకటనచ చేసింది. దీంతో చైనా, ఇరాన్‌ తర్వాత తాలిబన్లకు పాక్‌ మద్దతు ప్రకటించిన దేశంగా నిలిచింది. అయితే తాలిబన్లకు పాక్‌ సహకారం ఉందన్న బహిరంగ ఆరోపణల నేపథ్యంలోనే .. ఆ దేశ మంత్రి తాలిబన్లతో చర్చలు జరుపుతుండడం విశేషం.అఫ్గాన్‌ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంలో మొన్నటిదాకా అధికారంలో ఉన్న అష్రాఫ్‌ ఘనీ ప్రభుత్వం ఘోరంగా విఫలమయ్యింది. ఆయన పాలనలో ఆరోగ్యం, విద్య వంటి కనీస సదుపాయాలు ఆశించినంతగా మెరుగుపడలేదు. ప్రజల జీవన ప్రమాణాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. అవినీతి పెచ్చరిల్లింది. జనం మార్పును కోరుకుంటున్నారు. అంటే దాని అర్థం తాలిబన్లను స్వాగతిస్తున్నారని కాదు. ఘనీ అసమర్థ, అవినీతి పాలనతో విసుగెత్తిపోయిన ప్రజల మనసులను గెలుచుకోవడం తాలిబన్లకు కత్తి విూద సామేనని చెప్పొచ్చు. షరియా చట్టం పేరిట గతంలో సాగించిన నిరంకుశ పాలనకు స్వస్తి చెప్పితేనే తాలిబన్లకు ప్రజల మద్దతు లభిస్తుంది. సంస్కరణలకు బాటలు పరిచి, జీవన ప్రమాణాలను పెంచడంపై దృష్టి పెడితే తాలిబన్లకు కొంత జనామోదం లభించే అవకాశం ఉంది.

Related News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *