వ్యవస్థల వైఫల్యంపై సుప్రీం విసుర్లు

 వ్యవస్థల వైఫల్యంపై సుప్రీం విసుర్లు

భూమిపుత్ర,సంపాదకీయం:

వ్యవస్థల అలసత్వాన్ని,వైఫల్యాన్ని తీవ్రంగా పరిగణించిన సుప్రీం కోర్టు బూజు దులిపే పనిలో పడింది. ఒక్కో విషయంలో సుప్రీం ధర్మాసనం ఇస్తున్న సూచనలు, హెచ్చరికలు.. .బూజుపట్టిన రాజకీయ వ్యవస్థ తీరును రుజువు చేస్తున్నాయి. ఎంతోకాలంగా పాలకులు తమకు అనుకూలంగా చట్టాలను చేసుకుని..చట్టాలను తమ చుట్టాలుగా చేసుకుని అధికారులను మచ్చిక చేసుకుని పోలీస్‌ వ్యవస్థను నిర్వీర్యం చేసి ఎదుటివారి విూదకు ఉసిగొలిపే కాపలా కుక్కగా చేసుకుని రాజ్యం ఏలుతున్న తీరు మెల్లగా విమర్శలకు గురవుతోంది. బెయిల్‌ రద్దులతో మొదలైన చీఫ్‌ జస్టిస్‌ ఎన్‌వి రమణ హెచ్చరికలు మెల్లగా తన దృష్టికి వచ్చిన కేసుల విషయంలో చురకలు అంటిస్తున్నారు. నిద్రాణంగా ఉన్న వ్యస్థలను మేల్కొలిపే పనిచేస్తున్నారు. తాజాగా ప్రజాప్రతినిధులపై కేసుల నమోదులో జాప్యం,పోలీస్‌ అధికారులను వేధించడం వంటి విషయాల్లో గట్టిగానే చివాట్లు పెట్టారు.

చట్ట సభల సభ్యులపై నమోదైన కేసుల దర్యాప్తులో మితివిూరిన జాప్యం, అత్యధిక వ్యాజ్యాల్లో ఉన్నతస్థాయి దర్యాప్తు సంస్థలు కనీసం ఛార్జ్‌షీట్లయినా దాఖలు చేయక పోవడంపై సర్వోన్నత న్యాయస్థానం వ్యక్తం చేసింది ధర్మా గ్రహంగానే కాదు…ఓ హెచ్చరికగా గుర్తించాలి. చట్టం తమ చేతుల్లో ఉందన్న భావనలో ఉన్న ప్రతినిధులు కేసుల నమోదు విషయంలో పోలీస్‌ వ్యవస్థను నిద్రాణంగా ఉంచుతున్నారు. అభియోగ పత్రాలు దాఖలు చేయకపోవడానికి గల కారణాలు కూడా చెప్పని ఈడీ, సీబిఐ వంటి దర్యాప్తు సంస్థల తీరును మరోమారు తప్పుబట్టడం ద్వారా అవి ఎంతగా నిద్రపోతున్నాయో మేల్కొలిపారు. ఛార్జ్‌షీట్లు లేకుండా కేవలం ఆస్తులు జప్తు చేస్తే ఏం ప్రయోజనమన్న వ్యాఖ్యలు చురకల్లా తగిలి ఉంటాయి. ములుకుల్లా గుచ్చుకుని ఉంటాయి. ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేసి ఎంపిలు, ఎంఎల్‌సి, ఎమ్మెల్యేలపై కేసులను త్వరగా విచారించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై బుధవారం సుప్రీం కోర్టు చీఫ్‌ జస్టిస్‌ ఎన్‌వి రమణ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది.

అమికస్‌ క్యూరీ హన్సారియా, సొలిసిటర్‌ జనరల్‌ (ఎస్‌జి) మెహతా సమర్పించిన నివేదికలను పరిశీలించి ధర్మాసనం చేసిన వ్యాఖ్యలు సిబిఐ, ఇడి పని తీరును, కేంద్రం,వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు తమ పార్టీ నాయకులను కేసుల నుండి తప్పించడానికి చేస్తున్న యత్నాలను కళ్లకు కట్టినట్టున్నాయి. నిజంగా సామాన్యలపై కొరడా ఝళిపిస్తున్న పోలీసులు ప్రజాప్రతినిధుల విషయంలో చూసీచూడనట్లుగా ఉండడం,దర్యాప్తు చేపట్టక పోవడం ఏళ్లుగా అవి కొనసాగుతున్న తీరు అధికార దుర్వినయోగానికి అద్దం పడుతున్నాయి. ఎన్నో కేసుల్లో ఇలాగే చేస్తున్నారు. చట్టం తమ చేతుల్లోకి తీసుకుని ఇష్టం వచ్చినట్లుగా చెలాయిస్తున్నారు. చాలా కేసుల దర్యాప్తు లో హైకోర్టులు స్టే ఇవ్వడంవల్ల ఆలస్యం అవుతోందని సోలిసిటర్‌ జనరల్‌ నివేదించగా అది సరి కాదని, కేవలం ఎనిమిది కేసుల్లోనే స్టే ఉన్నట్టు ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. ఎస్‌జి కోర్టుకు సమర్పించిన నివేదిక అసంపూర్తిగా ఉందని ధర్మాసనం సున్నితంగా వ్యాఖ్యానించినా కేంద్ర ప్రభుత్వ తీరును తలంటినట్టే భావించాల్సి వుంటుంది.

ఇలా అనేక కేసుల విషయంలోనూ జరిగింది. ఇది ఒక కేంద్రానికే సంబంధించినదిగా చూడరాదు. అలాగే అనేకానేక కేసుల్లో ఇలాగే జరుగుతోంది. దేశవ్యాప్తంగా ఎంపిలపై 51, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలపై 71 మొత్తం 122 కేసులు ఇడి నమోదు చేసింది. అందులో 76 కేసుల్లో దర్యాప్తు పెండిరగ్‌లో ఉంది. సిబిఐ 121 కేసులు నమోదు చేయగా వాటిలో 37 పెండిరగ్‌లో ఉన్నాయి. ఈ కేసుల్లోని నిందితుల్లో కొందరు మరణించారు కానీ ఆ వ్యాజ్యాలు మాత్రం పరిష్కారానికి నోచుకోలేదు. ఆంధ్రప్రదేశ్‌లో వివిధ ప్రత్యేక కోర్టుల్లో 138 మంది ఎంపి, ఎమ్మెల్యేలపై కేసులు పెండిరగ్‌లో ఉన్నాయని, కొన్ని కేసుల విచారణలో అసాధారణ జాప్యం జరుగుతోందని నివేదిక పేర్కొంది. కొన్ని రాష్ట్ర ప్రభుత్వా లైతే తమ వారిని ఆయా కేసుల నుండి తప్పించడానికి అడ్డగోలుగా ఉపసంహరణలకు పాల్పడిన వివరాలూ నివేదికలో ఉన్నాయి.

ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌ మత ఘర్షణలకు సంబంధించి 2013లో 510 కేసులు నమోదు కాగా 77 కేసులను ఎటువంటి కారణం చూపకుండానే యోగి ప్రభుత్వం ఉపసంహరించుకుంది.170 కేసులు రద్దు చేశారని నివేదిక తెలిపింది. తమ రాజకీయ ప్రయోజనాల కోసం మత విద్వేషాలను రెచ్చగొట్టి, విధ్వంసం సృష్టించిన బిజెపి అధికారంలోకి రాగానే ఆ కేసుల రద్దుకు లేదా ఉపసంహరణలకు పాల్పడడం దారుణం. కేసుల విచారణను వేగవంతం చేయాలని ఆదేశాలు జారీ చేసినా న్యాయమూర్తుల కొరత కారణంగా వాటిని అమలు చేయడం అంత సులభం కాదని సుప్రీంకోర్టు పేర్కొనడం వాస్తవ పరిస్థితిని ప్రతిబింబిస్తోంది. నిజానికి ఎంతోకాలంగా కోర్టుల్లో జడ్జిల సంఖ్యలు ఖాళీగా ఉన్నాయి. భర్తీ చేయడంలో కేంద్రం విూనమేషాలు లెక్కిస్తూ జాప్యం చేస్తోంది. మేము ఏజెన్సీల గురించి ఏవిూ చెప్పదలచుకోలేదు. ఎందుకంటే మేము వాటి నైతిక స్థైర్యాన్ని దెబ్బ తీయాలనుకోవటం లేదు.

న్యాయమూర్తుల లాగా వారికీ అధిక భారం ఉంది. కాబట్టే సంయమనం పాటిస్తున్నాం. అన్న ధర్మాసనం వ్యాఖ్యలూ అలాంటివే! అయితే, ఈ రెండు వ్యవస్థల్లో ఖాళీల భర్తీ లేదా అవసరమైన అదనపు సిబ్బందిని సమకూర్చవలసిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలదే.!అందునా సిబిఐ, ఇడిలలో నియామకాలన్నీ కేంద్రం పరిధి లోనివే. కాబట్టి దర్యాప్తు, విచారణలో జాప్యానికి ప్రభుత్వాలే పరోక్షంగా బాధ్యత వహించాలి. వెంటనే అన్ని స్థాయిల్లో న్యాయమూర్తుల నియామకాలు, దర్యాప్తు సంస్థల్లో ఖాళీల భర్తీ చేపట్టాల్సిన తక్షణ అవసరాన్ని గుర్తించాలి. ఏ న్యాయస్థానంలోనైనా విచారణ 6 నెలల పరిమితిలో దర్యాప్తు ముగించాలని, లేదా ఆయా కేసుల్లో విచారణ పూర్తి చేయడానికి నిర్దిష్ట సమయాన్ని నిర్దారించాలన్న సొలిసిటర్‌ జనరల్‌ సూచన సరైనదే. సర్వోన్నత న్యాయస్థానం ఇందుకు మార్గదర్శకాలను నిర్దేశించడం అవసరం.

అలాగే చట్టసభల సభ్యులపై నమోదైన కేసుల విచారణకు ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయడంపైనా తొందరగా నిర్ణయం తీసుకోవాలి. అలాగే అధికారంలో ఉన్నప్పుడు అధికార యంత్రాంగాన్ని వాడుకోవడం తరవాతి కాలంలో వచ్చిన ప్రభుత్వాలు వారిని కేసులతో వేధించే విషయంలోనూ సుప్రీం చేసిన సూచనలు కీలకంగా గుర్తించాలి. ప్రభుత్వాలు మారినపుడు గత ప్రభుత్వాలకు అనుకూలంగా ఉన్న పోలీసు అధికారులపై రాజద్రోహం వంటి కేసులు పెట్టడం పరిపాటిగా మారిందని సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ఇలాంటి పరిస్థితిని పోలీసు అధికారులే మార్చాలని, ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా చట్టానికి బద్ధులై వ్యవహరించాలని సూచించింది. ఛత్తీస్‌గఢ్‌లో సస్పెన్షన్‌కు గురైన ఐపీఎస్‌ అధికారి గుర్జీందర్‌ పాల్‌సింగ్‌ను అరెస్టు చేయకుండా రక్షణ కల్పించింది. దేశంలో ప్రబలుతున్న ఆందోళనకర ధోరణి పట్ల ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ విచారం వ్యక్తం చేశారు.

Related News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *