మట్టి పరిమళాల అక్షర ఝరి- “అనంత” సౌరభ విజ్ఞానపు కడలి

 మట్టి పరిమళాల అక్షర ఝరి-  “అనంత” సౌరభ విజ్ఞానపు కడలి

భూమిపుత్ర, సాహిత్యం:

‘‘వేగంగా సృష్టించబడే సాహిత్యమే జర్నలిజం’’ అని మథ్యూ అర్నాల్డ్ అన్నాడు. అలాంటి సాహిత్యాన్ని ఆసరాగా, ఆయువుగా, ఆయుధంగా చేసుకుని జీవిస్తున్న ప్రముఖ జర్నలిస్టు సాకే శ్రీహరిమూర్తి. ఈయన ‘భూమిపుత్ర’ దినపత్రిక సంపాదకులు. పత్రికలు నడపడానికి శ్రీమంతులే కానక్కరలేదు. గొప్పతెలివి తేటలూ, చేయాలన్న ఆకాంక్ష బలంగా ఉంటే చాలనడానికి నిలువెత్తు సాక్ష్యం ఈయన. ఈయనో వ్యక్తి కాదు వ్యవస్థ.  గొప్ప సంఘసంస్కరణ దృష్టితో ఈ బృహత్కార్యాన్ని నిర్విఘ్నంగా కొనసాగిస్తున్న ఉత్తమ పాత్రికేయులు వారు.

సామాజిక, రాజకీయ, సాంస్కృతిక చైతన్యం కలిగిన అభ్యుదయభావాలు మూర్తి గారిలో మెండుగా ఉన్నాయి. సమాజంలోని మంచి చెడులపై తన అభిప్రాయాలను నిర్భయంగా వెల్లడించే తత్త్వం వీరిది. తాను నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి జీవిస్తున్న నిరాడంబరులు. ఒక సాధారణ వ్యక్తి ఒక అసాధారణమైన పనిని చేయవచ్చుననేదానికి ఉదాహరణ మూర్తిగారు.
ప్రపంచంలో జరుగుతున్న పరిణామాలను తన పత్రిక ద్వారా వెల్లడించడమే కాదు. తన చుట్టుపక్కల వెలుగు చూడని వార్తలను ఒడిసిపట్టడంలో ఉద్దండ పాత్ర శ్రీహరిగారిది. వార్తలను ఎంతో వాస్తవిక దృష్టితో రాస్తారు. భారత్ ఇతర దేశాలతో, ఇతరదేశాలు భారత్ పెట్టుకునే సత్సంబంధాలకు చెందిన అంశాలను సవివరంగా వెల్లడిస్తారు. ఒక నిష్పక్షపాత జర్నలిస్టుగా ఏ ప్రతిఫలాల్ని ఆశించకుండా తన విధులను నిర్వర్తిస్తున్నారు.‘కరోనా’ సమయంలో కొన్ని పత్రికలు తమ ప్రచురణను ఆపివేసిన విషయం తెలిసిందే.తెలుగునాట ప్రధాన పత్రికలే ఈ విపత్కాలంలో చాలా తక్కువ పేజీలతో ప్రచురితమయితే భూమిపుత్ర పత్రిక మాత్రం పేజీలు తగ్గించకుండా నాణ్యతలో రాజీపడకుండా కష్టకాలంలో ప్రజల పక్షం వహించడం మరువలేని విషయం. ఎన్నో మేలుతరమైన వార్తలు ఈ పత్రిక ద్వారా ప్రచురితమైనాయి. ప్రస్తుతం సాహితీ, సాంఘిక రంగాలలో ఈ పత్రిక చక్కని సేవలు అందిస్తోంది. ముఖ్యంగా పోటీ పరీక్షలకు ఉపయోగపడే వర్తమానాంశాలను ఔచిత్యంగా ప్రచురిస్తోంది. అలాగే పరిశోధక విద్యార్థులకు ఉపయోగపడే విలువైన వ్యాసాలెన్నో ఇందులో వెలువడుతున్నాయి. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి, ఇటు పరిశోధక విద్యార్థులకు ఉభయతారకమని చెప్పవచ్చు.

పత్రికా సంపాదకులు సమాజాన్ని విహంగ వీక్షణం చేయాలి. తాను ఇబ్బంది పడకుండా ఇతరుల్ని ఇబ్బంది పడనీయకుండా సున్నితంగా వ్యవహరించాలి. భగవంతునికి భక్తుని మధ్య పూజారి ఎలాగుంటాడో, ప్రభుత్వాలకు ప్రజలకు పాత్రికేయుడు అలా ఉంటాడు. ఉండాలి కూడా. నిష్పక్షమైన నియమాలతో శ్రీహరి మూర్తి తమ పత్రికను ప్రజల ముందుకు తెస్తున్నారు. ప్రధానంగా లౌకికత్వాన్ని వదలకుండా, ఏ ఇజాలకు పోకుండా, కుల, మత, పార్టీ, రాజకీయాలకు అతీతంగా పత్రికను మునుముందు తీసుకుపోవడం ఎంతో ప్రశంసనీయం.ముఖ్యంగా వీరు రాసే సంపాదకీయ వ్యాసాలు పత్రికకు వన్నె తెస్తున్నాయి. వీటిలో ఈయన ఎంతో నిర్దుష్టతను అవలంభిస్తారు. భావ స్పష్టతను పాటిస్తారు. ‘గుడ్డెద్దు చేల్లో పడ్డట్టు’ ఎదో ఊకదంపుడుకు పోకుండా ఏదైతే అవసరమో దానిని మాత్రమే ఆవిష్కరిస్తారు. జాతీయ పత్రికలకు తీసిపోని విధంగా ‘భూమిపుత్ర’ పత్రికను నడుపుతున్నారంటే అతిశయోక్తి కాదు. వీరి వృత్తి గురించి ఎంత పొగిడిన తక్కువే. ఇలాంటి కష్టమైన కార్యాలు ‘పనిరాక్షసు’లకు మాత్రమే సాధ్యం. మంచి పరిశోధకులు, పాఠకులు పొగడ్తలను ఎక్కువ పట్టించుకోరు. తాము చేసే పనిలోని నాణ్యతపై దృష్టి సారిస్తారు. అలా రోజు నిత్య విద్యార్థిలా ఆయా వార్తలను రాసి మన ముందుకు తీసుకువస్తున్న వీరు అభినందనీయులు.

విలక్షణ శైలిగల ఈ పాత్రికేయుడు రోజురోజుకు మారుతున్న సాంకేతికతను పుణికిపుచ్చుకుని అభివృద్ధి చేస్తున్న ఈ ‘భూమిపుత్ర’ పత్రిక భవిష్యత్తులో విపణిలో ప్రత్యేకమైన స్థానం నిలుపుకుంటుందనడంలో సందేహం లేదు. మొదట్లో నలుపు తెలుపుల లో ఉన్నా ప్రస్తుతం రంగురంగుల శీర్షికలు, ఫొటోలతో దర్శనమిస్తోంది. అంతర్జాతీయం, జాతీయం, ప్రాంతీయం, సంపాదకీయం, క్రీడలు, వ్యాపార, ఆధ్యాత్మికం, సినిమాలు, సాహిత్యం మొదలైన అన్ని అంశాలు ఈ పత్రికలో కనబడతాయి. ప్రమాణాల విషయంలో ఇసుమంత లోపం లేకుండా ప్రసిద్ధ పత్రికల సరసన నిలుపడం విశేషం.

శ్రీహరి గారు ‘భూమిపుత్ర’ పత్రికతో పాటు www.bhumiputra.net వెబ్ సైట్ ను కూడా రూపొందించి ఇందులో ఎప్పటికప్పుడు వార్తలను అందుబాటులో ఉంచుతున్నారు. ప్రధానంగా సంపాదకీయ వ్యాసాలు, జాతీయాంశాలు, రెండు తెలుగు రాష్ర్టాలకు చెందిన వార్తలు నిత్యం ఇందులో అప్డేట్ చేస్తున్నారు. ఈ- పేపర్ కూడా అందుబాటులో ఉంటుంది. గ్రామీణ ప్రాంతాల్లోని “అక్షర పరిమళాల్ని” వెలికితీయడంలో ఈ పాత్రికేయుని కృషి చెప్పుకోదగ్గది. ముఖ్యంగా నిరుద్యోగుల, అభాగ్య ప్రజల సమస్యల పరిష్కారానికి బలమైన గొంతుకగా ‘భూమిపుత్ర’ పత్రికను నడుపుతున్నారు.మూర్తిగారు సంపాదకీయాలు రాయడంలో దిట్ట. వీరు భాష విషయంలో ఎంతో శ్రద్ధ వహిస్తారు. సరళ సుందరమైన వాక్యాలతో విషయాన్ని పొందుపరుస్తారు. సందర్భానుసారంగా సామెతలు, జాతీయాలను ఉటంకిస్తారు. వ్యావహారికంతో పాటు మాండలిక భాషకు మరింత ప్రాధాన్యం కల్పిస్తారు. సాహిత్యం, పర్యావరణం, సామాజికం, సాంస్కృతికం మొదలైన అంశాల్ని రాయడంలో వీరు ఎంతో నైపుణ్యం చూపుతారు. పాఠకులకు ఎక్కడ విసుగు రానీయకుండా జాగ్రత్త పడతారు.

సాధారణంగా కొన్ని దిన పత్రికలు ప్రతి సోమవారం సాహిత్యానికే ప్రత్యేకంగా ఒక పేజీని కేటాయిస్తున్నాయి. మీ భూమిపుత్ర పత్రికలో కూడా సాహిత్య వ్యాసాలు విరివిగా ముద్రిత మవుతున్న విషయం విధితమే. అయితే వారంలో ఏదైనా ఒక రోజు మీ పత్రికలో సాహిత్యానికి ఒక పుటను కెటాయించి తెలుగు సాహిత్యాభివృద్ధికి మరింత తోడ్పడగలరని మనివి చేస్తున్నాను.అషామాషీ, వారం వారం, గుంపులో గోవిందయ్య, అంతర్యామి, వీక్ పాయింట్, జీవనకాలమ్, వార్తల్లో వ్యక్తి, ప్రాణహిత, సందర్భం, సమకాలీనం, విశ్వవేదిక, లోగుట్టు, కాసు – తిరకాసు, పనికొచ్చే ముక్క సంసారాలు, హ్యుమర్ మరాలు, సంతకాలు ఇలా కొన్ని డజన్ల ‘‘కాలమ్స్’’ ఇంకా ఇప్పటికీ కొన్ని పత్రికల్లో ప్రచురితమవుతూనే ఉన్నాయి. ఇటువంటి ఆసక్తికరమైన శీర్షికలతో లేదా ఇంతకంటే వైవిధ్యమైన శీర్షికల ద్వారా గొప్ప సామాజిక స్పృహను కలిగించే అంశాలు మీ పత్రికలో ప్రచురితం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిరంతరం ‘మట్టి పరిమళాల అక్షర ఝరు’ లను ప్రోత్సహిస్తూ… ‘భూమిపుత్ర’ దిన పత్రికా మరియు www.bhumiputra.net వెబ్ సైట్ ల ప్రయాణం ‘మూడు పువ్వులు ఆరుకాయలు’ గా వర్దిల్లాలనే ఆకాంక్షతో…

డా॥ బడిగె ఉమేశ్,
అసోసియేట్ ఫెలో
చరవాణి : 9494815854,
ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రం, నెల్లూరు.

Related News

1 Comment

  • పత్రిక నడపాలంటే శ్రీమంతులు కానవసరం లేదు.జిజ్ఞాస ఉంటే చాలు.వ్యక్తి కాదు వ్యవస్థ.మంచి చెడులను నిష్పక్షపాతంగా నిర్భయంగా తెలియజేయడం. పాత్రికేయునికి ఉండవలసిన లక్షణాలు ఉన్నాయని ‘భూమి పుత్ర’ దినపత్రిక సంపాదకుడు శ్రీ హరి మూర్తి గారిపై ఉత్తమ విమర్శ చేసిన డా!! బడిగే ఉమేశ్ గారికి ధన్యవాదాలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *