జాడే లేని నైరుతి రుతు పవనాలు

 జాడే లేని నైరుతి రుతు పవనాలు

భూమిపుత్ర, అనంతపురం:

నైరుతి రుతుపవనాలు ముందస్తుగా పలకరించినా తర్వాత ముఖం చాటేశాయి. ఈ విడత కష్టాలు గట్టెక్కినట్లేనని భావిస్తున్న తరుణంలో అన్నదాత ఆశల చుట్టూ మబ్బులు కమ్ముకున్నాయి. ఏటా జూన్‌ 10 నుంచి 12 మధ్య రుతు పవనాలు ప్రవేశిస్తుండగా ఈసారి 4నే రావడంతో ఖరీఫ్‌పై రైతుల ఆశలు చిగురించాయి. ముందస్తు వేరుశనగ, ఇతర పంటల సాగుకు అనువని భావించారు. దుక్కులు చేసుకొని విత్తనాలు, ఎరువులు సమకూర్చుకున్నారు. ఇంతలో నైరుతి నిరుత్సాహ పరచడంతో రైతుల్లో ఆందోళన మొదలైంది. ఇదే పరిస్థితి మరికొద్ది రోజులు కొనసాగితే ఖరీఫ్‌ సాగు ప్రశ్నార్థకమయ్యే ప్రమాదం ఉంది. వరుణుడు కరుణించకపోవడంతో దిగాలు చెందుతున్న రైతును పెట్టుబడి సమస్య వేధిస్తోంది. బ్యాంకులు సైతం రుణాలు ఇవ్వకుండా తిప్పుకుంటుండడంతో రైతులు అయోమయ స్థితిలో పడ్డారు. వ్యవసాయ శాఖ పథకాల అమలు గురించి ఇంత వరకూ అధికారుల వద్ద ఎలాంటి సమాచారం లేదు.

ప్రభుత్వం నుంచి రాయితీపై ఇచ్చే వేరుశనగ విత్తనాలు బహిరంగ మార్కెట్‌లో కన్నా ఎక్కువగా ఉండడంతో రైతులు మొగ్గుచూపలేదు. ఇంత వరకూ ఎరువుల జాడ అసలే లేదు. ఖరీఫ్‌ సాగుపై ఆశలు సన్నగిల్లుతున్నాయి.వర్షాలు సమృద్ధిగా కురవాల్సిన సమయం. ప్రతేడాది ఏరువాక పౌర్ణమి సందర్భంగా వ్యవసాయ పనులు చేసుకుంటే కలిసి వస్తుందని అన్నదాతల నమ్మకం. ఈఏడాది అందుకు భిన్నమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇంత వరకూ రుతు పవనాల జాడే లేదు. వారం రోజులుగా మేఘాలు అన్నదాతలను ఊరిస్తున్నాయే తప్ప చినుకు పడడం లేదు. ఖరీఫ్‌ సాగు ఎలా చేపట్టాలనే ఆందోళనలో రైతులు పడ్డారు. గతేడాది ఇప్పటికే 20 శాతం వర్షాలు కురిస్తే పంటలు సాగు చేశారు. ఈఏడాది మృగశిర కార్తె వచ్చినా చినుకు జాడలేక వడగాల్పులకు తట్టుకోలేక పొలాలను సాగు చేసేందుకు అన్నదాతలు భయపడుతున్నారు.

వేసవిలో 40 నుంచి 42 డిగ్రీలతో వేడెక్కిన కర్నూలు జిల్లాలో నైరుతి రుతుపవనాలు జూన్‌ 4న విస్తరించడంతో వాతావరణం ఒక్కసారిగా మారింది. ఉష్ణోగ్రతలు 34 నుంచి 38 డిగ్రీలకు పడిపోయాయి. రాత్రి ఉష్ణోగ్రతలు కూడా బాగా తగ్గుముఖం పట్టాయి. ఉదయం, మధ్యాహ్న సమయాల్లో గాలి తేమశాతం పెరిగింది. విస్తారంగా వర్షాలు నమోదవుతాయని రైతులు ఆశించారు. అందుకు అనుగుణంగా ఆకాశం మేఘావృతం అవుతున్నా చుక్కనీరు కూడా రాలని పరిస్థితి. వర్ష సూచన ఉన్నట్లు వాతావరణ శాస్త్రవేతలు, వాతావరణ బులెటిన్‌లు విడుదల చేస్తున్న ఫలితం శూన్యం. అక్కడక్కడతేలికపాటి వర్షం, మరికొన్ని ప్రాంతాల్లో తుంపర్లు మినహా చెప్పుకోదగ్గ స్థాయిలో వర్షం కురవలేదు. విత్తుకు అసలైన సమయం వచ్చినందున రైతులు వర్షం కోసం దిక్కులు చూస్తున్నారు.

ఈనెల 22న ఆరుద్ర కార్తె రావడంతో అన్ని రకాల పంటలకు అనువైన సమయమని ప్రకటించారు. జులై ఆఖరు వరకూ పంటలు వేసుకోవచ్చని చెబుతున్నా రుతు పవనాల ప్రభావం చూపకపోవడంతో రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. విస్తారంగా వర్షాలు కురవాల్సిన సమయంలో బలమైన గాలులు విస్తుండడంతో కమ్ముకున్న మేఘాలు చెల్లాచెదురవుతున్నాయి. సాధారణ రోజుల్లో గాలివేగం 6 నుంచి 12 కిలోవిూటర్లు ఉంటుంది. ఇప్పుడు 12 నుంచి 18 కిలోవిూటర్లు నమోదవుతున్నాయి. మరికొన్ని మండలాలు, గ్రామాల్లో 20 నుంచి 30 కిలోవిూటర్ల వేగంతో గాలులు వీస్తుండడంతో ఏరువాక సాగుకు ఇబ్బందిగా మారింది. జులై, ఆగస్టులో ఉండాల్సిన వాతావరణం జూన్‌లోనే నెలకొని ఉండడం గమనించదగ్గ విషయం.జూన్‌లో రుతుపవనాలు ప్రవేశించిన తర్వాత వర్షాలు రావడం కష్టంగా మారింది.

Related News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *